కేసీఆర్ వన్ టూ వన్ క్లాసు
posted on May 4, 2023 @ 5:07PM
బీఆర్ఎస్ అధ్యక్షుడు జాతీయ రాజకీయాలలో బిజీగా ఉన్నప్పటికీ తెలంగాణలో గత ఎన్నికల్లో గెలుపొందిన 30 మందిపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ ప్లీనరీ సమావేశాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ప్రసంగం బీఆర్ఎస్ ను ఇబ్బందుల్లో పెట్టింది. స్వంత పార్టీ ఎమ్మెల్యేలు దళిత బంధులో స్కీంలో మూడేసి లక్షల రూపాయాల కమిషన్లు తింటున్నారని, తన వద్ద ఆ ఎమ్మెల్యేల జాబితా ఉందని హెచ్చరించడం ప్రతి పక్షాలకు ఆయుధం దొరినట్టయ్యింది. నాలుక కరచుకున్న కేసీఆర్ బహింగ ప్రదేశాల్లో స్వంత పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను తిట్టకూడదని డిసైడ్ అయ్యారు. నాలుగు గోడల మధ్య క్లాసు తీసుకోవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర కార్యాలయం ప్రారంభించిన తర్వాత కేసీఆర్ స్వంత పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అవినీతి ఎమ్మెల్యేల భరతం పట్టడానికి త్వరలో హైదరాబాద్ రానున్నట్లు వారితో అన్నట్టు తెలిసింది.
జాతీయ రాజకీయాల్లో పడి రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తే అసలుకే మోసం వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ 30 మందితో ఒకేసారి కాకుండా వన్ టూ వన్ క్లాసు తీసుకోవాలని కేసీఆర్ యోచన. ఈ 30 మందికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకూడదని కేసీఆర్ నిర్ణయించినట్టు వినికిడి. మూడు నెలల్లో ఆ ఎమ్మెల్యేలు ప్రవర్తన మార్చుకుంటే సరేసరి లేదంటే టికెట్లు లేనట్టేనని కేసీఆర్ భావిస్తున్నారు. అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల జాబితాలో ఆలేరు, పాలేరు, మునుగోడు, పటాన్ చెరు, ఖైరతాబాద్, వరంగల్ ఈస్ట్, మెదక్, స్టేషన్ ఘన్పూర్, జనగామ, మంచిర్యాల, ఆందోల్ ఉన్నాయి. ప్రస్తుతం ఎంఎల్సీలు ఉన్న కౌశిక్ రెడ్డి, పోచంపల్లి , శంభీపూర్ రాజు తదితరులను అసెంబ్లీ పంపించాలని కేసీఆర్ ప్లాన్. 30 మందిలో ప్రవర్తన మారని ఎమ్మెల్యేల స్థానే ప్రత్యామ్నాయ అభ్యర్థుల ఎంపిక మీద కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. స్పీకర్ పోచారం తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి తదితరులకు టికెట్లు ఇచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. వయసురీత్యా స్పీకర్ రాజకీయాల నుంచి తప్పుకుని తన కొడుకుకు అవకాశం కల్పించాలని ఆలోచిస్తున్నారు. హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డి పేరు దాదాపు ఖరారు అయ్యింది. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల మీద కౌశిక్ రెడ్డి తో పోటీ చేయించాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు.