ఏపీ-తెలంగాణ భవన్ ఆంధ్రకు... పటౌడీ హౌస్ తెలంగాణకు
posted on May 5, 2023 7:23AM
దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తి ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్ పరిధిలోని 19.73 ఎకరాల విభజనకు సంబంధించి కేంద్ర హోంశాఖ తన ప్రతిపాదనను తెలియజేసింది. 12.09 ఎకరాల్లోని ఆంధ్రప్రదేశ్- తెలంగాణ ఉమ్మడి భవన్ ను (శబరి బ్లాక్, గోదావరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్) పూర్తిగా ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలని, పటౌడీ హౌస్లోని 7.64 ఎకరాలను తెలంగాణ తీసుకోవాలని ఏప్రిల్ 26న జరిగిన సమావేశంలో సూచించింది. ఆంధ్రప్రదేశ్- తెలంగాణ భవన్ విభజనపై కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్, సంయుక్త కార్యదర్శి జి.పార్థసారథి నేతృత్వంలో ఇరు రాష్ట్రాల అధికారులతో జరిగిన సమావేశం మినిట్స్ ను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఉమ్మడి ఆస్తి విభజనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు, తెలంగాణ ప్రభుత్వం రెండు ఆప్షన్లు ఇచ్చాయని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఆప్షన్లు:
(ఏ) తెలంగాణకు శబరి బ్లాక్, పటౌడీ హౌస్ లో సగభాగం.. ఏపీకి పటౌడీ హౌస్ లో మిగిలిన సగభాగం, గోదావరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్ బ్లాక్.
(బీ)ఏపీకి మొత్తం పటౌడీ హౌస్, శబరి బ్లాక్.. తెలంగాణకు గోదావరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్.
(సీ) తెలంగాణకు శబరి, గోదావరి బ్లాక్ లు.. ఆంధ్రప్రదేశ్ కు నర్సింగ్ హాస్టల్, పటౌడీ హౌస్.
తెలంగాణ ఇచ్చిన ఆప్షన్లు:
ఆప్షన్ (డీ): తెలంగాణకు శబరి బ్లాక్, గోదావరి బ్లాక్ లు, నర్సింగ్ హాస్టల్ (12.09 ఎకరాలు).. ఏపీకి పటౌడీ హౌస్ (7.64 ఎకరాలు). ఇది విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల వాటాకు విరుద్ధంగా ఉంది. అయితే ఏపీ కోల్పోయేదానికి విలువ కట్టి ఆ మొత్తం తెలంగాణ చెల్లిస్తుంది. ఒకవేళ దీనికి అంగీకరించకపోతే ఏపీ ఇచ్చిన ఆప్షన్ (సీ)ని పరిశీలించాలి.
ఆప్షన్ (ఈ) గోదావరి, శబరి బ్లాక్ లు, నర్సింగ్ హాస్టల్తో ఉన్న 12.09 ఎకరాలు ఆంధ్రప్రదేశ్కు.. 7.64 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పటౌడీ హౌస్ తెలంగాణకు. ఈ ప్రతిపాదన ఆచరణీయంగా ఉందని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారని మినిట్స్ లో పేర్కొన్నారు. ఆప్షన్ సీ, డీ, ఈలను పరిశీలించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను వారంలోపు పంపాలని కేంద్ర హోంశాఖ కోరింది.
రెండు తెలుగు రాష్ట్రాల విభజన జరిగి.. దాదాపు దశాబ్దం కాలం తర్వాత.. భవనాలు, స్థలాల బట్వారా జరగనున్ను తరుణంలో.. కేంద్ర హోం శాఖ ప్రతిపాదనపై తెలంగాణ, ఆంధ్ర ఎలా స్పందిస్తాయో వేచిచూడాలి.