మహా సీఎం అజిత్ పవార్?.. రాజీనామా కారణమదేనా?
posted on May 4, 2023 @ 11:39AM
మరాఠా యోధుడు, రాజకీయ వ్యూహాల దురంధరుడు ఉరుములేని పిడుగులా సొంత పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్ష పదవికి రాజీనామా చేసేశారు. పార్టీ శ్రేణులు ఆయనే కొనసాగాలని చేసిన డిమాండ్ లను కూడా పట్టించుకోకుండా తన వారసుడి ఎంపిక కోసం ఒక కమిటీని కూడా వేసేశారు. అయితే ఎన్సీపీ అధ్యక్ష రేసులో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలె ముందు వరుసలో ఉన్నారు.
ఈ వ్యవహారంపై గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. చెప్పా పెట్టకుండా శరద్ యాదవ్ ఎందుకింత హఠాత్తుగా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారన్నదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయితే మహారాష్ట్ర రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్న వారు మాత్రం ఒక మహా ఎత్తుగడతోనే శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారంటున్నారు. ఆయన రాజీనామా.. తదననంతర పరిణామాలపై పక్షం రోజుల కిందటే సుప్రియా సూలే హింటిచ్చారు. మహా, జాతీయ రాజకీయాలలో రానున్నరోజుల్లో రెండు భూకంపాలు సంభవిస్తాయని ఆమె చెప్పారు. అవేమిటన్నదానిపై విశ్లేషకులు యిప్పుడు క్లారిటీ యిస్తున్నారు.
కర్నాటక ఎన్నికల తరువాత మహారాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు సంభవించనున్నాయంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో గెలిచి మోడీ ముచ్చటగా మూడో సారి కేంద్రంలో మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో పావులు కదుపుతున్న బీజేపీ.. మహాలో షిండే ప్రభుత్వ తీరు పట్ల గత కొంత కాలంగా ఒకింత అసంతృప్తితో ఉంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలన్న యోచనలో ఉంది. యిది పసిగట్టిన షిండే.. ప్రతి వ్యూహాలతో ఉద్ధవ్ థాక్రేకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేశారు.
శరద్ పవార్ ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి ఈ నేపథ్యమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన బీజేపీకి దగ్గరవుతున్నారని అంటున్నారు. అందుకు గత కొంత కాలంగా ఆయన ప్రకటనలనే సాక్ష్యంగా చూపుతున్నారు. అదానీ వ్యవహారంలోనూ, మోడీ విద్యార్హతలపై తలెత్తిన వివాదంలోనూ ఆయన విపక్ష గళానికి భిన్నంగా తన వాణిని వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన కమలం గూటికి దగ్గరౌతున్నారన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తమయ్యాయి. యిదిలా ఉండగా.. తన సమీప బంధువు అజిత్ పవార్ సీఎంగా మహాలో బీజేపీ సర్కార్ ఏర్పాటుకు ఆయన రాజీనామా నాంది అని అంటున్నారు. సెక్యులర్ నేతగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న శరద్ పవార్ తాను అధ్యక్షుడిగా ఉండగా తానే ఏర్పాటు చేసిన పార్టీ బీజేపీతో జట్టు కట్టిందన్న అపప్రదను మూటగట్టుకోవడం ఎందుకన్న భావనతోనే తాను రాజీనామా చేసి ఆ స్థానంలో తన కుమార్తెను కూర్చోపెట్టి క్రతువు కానిచ్చేద్దామని నిర్ణయించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మొత్తం మీద వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విపక్షాల ఐక్యతను ముందుండి నడిపిస్తారనుకున్న శరద్ పవార్ యూటర్న్ తీసుకుని బీజేపీ పంచన చేరడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తుందనడంలో సందేహం లేదు.