కాపుల ఐక్యతను చెడగొడుతున్న సోము
posted on May 17, 2023 @ 5:51PM
కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అటు కేంద్ర రాజకీయనేతలకు, ఇటు కర్నాటక రాష్ట్ర నేతలకు కొత్త పాఠాలు నేర్పించాయి. పనిలో పనిగా తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు కూడా పాఠాలు నేర్చుకోక తప్పలేదు.
రెండు తెలుగు రాస్ట్రాలలోని రాజకీయ నాయకులు తమ పార్టీలను గెలిపించుకునేందుకు గత నెల రోజులుగా కర్నాటకలోనే మకాం వేశారు. అందునా అప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ తెలుగువారు అధికంగా ఉన్న నియోజకవర్గాలలో తెలుగు నాయకుల చేత ప్రచారం చేయించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, హస్యనటుడు బ్రహ్మానందం అక్కడక్కడా ప్రచారం చేశారు. దాదాపు అన్ని చోట్లా బీజేపీ దుకాణం బంద్ అయ్యింది.
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుల వారిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కర్నాటకలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ప్రాంతాలలో ప్రచారానికి చేసి అక్కడ పార్టీని గెలిపిస్తానని మీసాలు తిప్పి రంగంలోకి దిగిన సోము వీర్రాజు తీరా ఫలితాలు వచ్చాక ఎవరికీ కనబడకుండా ముఖం చాటేశారు. కర్నాటకలో బలిజసామాజిక వర్గానికి నచ్చచెప్పడంతో పాటు తెలుగువారు, అందులో తన స్వంత సామాజిక వర్గానికి చెుందిన ఓటర్లను ఆకర్షించడంలో సోమువీర్రాజు అట్టర్ ప్లాప్ అయ్యారు. సోము వీర్రాజు ప్రచారం చేసిన సిద్దగట్లలో జేడీఎస్ అభ్యర్థి రవికుమార్ విజయం సాధించగా చింతామణి, చిక్ బల్లాపూర్, కోలార్, మలూరు, బంగారు పేటలల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మ్రోగించింది. కాపులు అధికంగా ఉండే గౌరిబిదనూర్ లో కూడా సోము వీర్రాజును ఎవరూ నమ్మలేదు. అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి పుట్ట స్వామిగౌడ్ గెలుపొందగా, బీజేపీ ఐదవ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
కాపు సామాజిక వర్గానికి నాయకులం అని చెప్పుకున్న సోము వీర్రాజు వంటి వారి మాటలను కర్నాటక కాపులు నమ్మలేదు. కర్నాటకలో కన్నడ మాట్లాడే వారు 66శాతం మంది ఉండగా, 11శాతం మంది ఉర్దూ మాట్లాడతారు. మూడవ స్థానంలో తెలుగువారు 7శాతం మంది ఉన్నారు. మరాఠీలు మూడు శాతం, హింది 2.5 శాతం, కొంకణి 1.5శాతం మంది ఉన్నారు. ఇంకా మళయాళం, కొండవ భాషలు మాట్లాడే వారు కూడా ఉన్నారు. 7శాతం తెలుగు వారు ఉన్న కర్నాటకలో దాదాపు 30 అసెంబ్లీ సీట్లలో గెలుపును ప్రభావితం చేసే సత్తా ఉంది. అలాంటి ప్రాంతాలలో కూడా సోెము వీర్రాజు ఏమీ చేయలేకపోయారు. కాపు సామాజిక వర్గాన్ని ఏకం చేసే నాయకత్వం లేదన్న కొందరు పరిశీలకుల మాటలు ఇక్కడ గుర్తుకు రాక మానవు. బీజేపీ వంటి జాతీయ పార్టీకి రాష్ట్ర నాయకుడిగా వ్యవహరిస్తున్న సోము వీర్రాజు తన స్వంత సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయలేకపోవడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో 20 శాతం ఉన్న కాపులను సోము వీర్రాజు ఇసుమంతైనా ప్రభావితం చేయలేరనీ, రాష్ట్రంలో .99 శాతం ఉన్న బీజేపీ ఓటింగ్ ను కనీసం ఒక శాతానికైనా తీసుకురాగరా అని పరిశీలకులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గుణాత్మక పాత్ర పోషిస్తానని చెబుతున్న జనసేన ఈ అనుభవాలను పరిగణనలోనికి తీసుకోవాలని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది నేతలు ఉన్ని కర్నాటక ప్రచారానికి వారందరూ దురంగా ఉండడాన్ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.