దశలవారీ మద్య నిషేధం దిశగా తొలి అడుగు!
posted on May 17, 2023 @ 11:14AM
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని 2019 ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేశారు. అయితే అధికారం చేపట్టి నాలుగేళ్లయినా.. రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేధం ఎంత సుందర ముదనష్టంగా అమలు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. మద్య నిషేధం మాట అటుంచి దిక్కుమాలిన జే బ్రాండ్ ల పేరుతో ప్రజారోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. అంతే కాకుండా పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చుకున్నారు.
అంటే జగన్ గత ఎన్నికల ముందు చేసిన దశల వారీ మద్య నిషేధం అన్నది ఒక బూటకపు హామీ అన్నది తేటతెల్లమైపోతుంది. పైపెచ్చు మద్యం ధరలను ఇష్టారీతిగా పెంచేయడం ద్వారా ప్రజలలో మద్యం అలవాటును మాన్పించేందుకు ప్రయత్నిస్తున్నామంటూ.. కొత్త కొత్త భాష్యాలు కూడా చెప్పారు. కాగా పొరుగున ఉన్న తమిళనాడులో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ఆయన ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిథి శత జయంతి వేడుకలను పురస్కరించుకుని స్టాలిన్ సర్కార్ రాష్ట్రంలో 500 మద్యం దుకాణాలను మూసేయాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా చర్యలకు కూడా ఉపక్రమించింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు జూన్ 3న కరుణానిథి శత జయంతి వేడుకలు ప్రారంభమవుతున్న సందర్భంగా మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయించారు. తొలివిడతగా 500 దుకాణాలను మూసివేయనున్నారు. ఆ మేరకు ఉన్నతాధికారులు మూసివేయాల్సిన దుకాణాల వివరాలను సేకరిస్తున్నారు.
ముఖ్యంగా పాఠశాలలు, ఆలయాలకు చేరువగా ఉన్న మద్యం దుకాణాలు మూత పడతాయని తెలుస్తోంది. అదే విధంగా 500 మీటర్ల దూరంలో రెండు మద్యం దుకాణాలున్న ప్రాంతాల్లో ఒకే మద్యం దుకాణం కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో ఏపీలో మాత్రం వాగ్దానం చేసి నాలుగేళ్లయినా మద్యం వినియోగం పెంచడమెలా అన్న ప్రణాళికలతో జగన్ సర్కార్ ముందుకు వెళుతోంది. ఆదాయం కోసం ప్రజారోగ్యాన్ని కూడా ఫణంగా పెడుతోంది.