యాజమాన్య హక్కులు లేని పట్టాలతో పేదలకు ఒరిగేదేంటి?
posted on May 18, 2023 @ 10:22AM
ఆర్5 జోన్ లో పేదలకు పట్టాల పంపిణీకి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అక్కడ పేదలకు సెంటు భూమి చొప్పున పట్టాల పంపిణీకి మార్గం సుగమైంది. ఇందుకు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. పేదలకు ప్రభుత్వం భూములు పంపిణీ చేయకుండా నిలుపుదల చేయలేమని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు కూడా నిరాకరించింది. అదే సమయంలో హై కోర్టు తీర్పులో కొన్ని సవరణలు చేసింది.
ప్రభుత్వం భూ పందేరం చేయవచ్చు కానీ, లబ్ధి దారులకు భూ యాజమాన్య హక్కులు దఖలు పడవని పేర్కొంది. అమరావతి పిటిషన్ల విచారణ పూర్తయ్యి తుది తీర్పు వెలువడిన తరువాత ఆ తీర్పునకు లోబడి మాత్రమే ఆ హక్కుల ఉంటాయని విస్పష్టంగా పేర్కొంది. అంటే ప్రభుత్వం పట్టాలిస్తుంది.. ఆ భూములపై లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు ఉండవు. క్రయ విక్రయాలు జరపడానికి వీలు లేదు. అమరావతి పిటిషన్లపై జూలైలో విచారణ జరగాల్సి ఉంది.
ఒక వేళ అమరావతి రైతులకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు వస్తే పేదలు బలైపోతారు. నిజానికి ప్రభుత్వం ఇవ్వదల్చుకుంటే బయట ఎక్కడైనా ఇవ్వొచ్చు. కానీ ఇతర ప్రాంతాల వారికి అమరావతిలోనే .. రైతులు ఇచ్చిన భూములనే ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం రాజధాని అమరావతి కోసం ఉద్యమం చేసిన రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలో భాగమే అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.