ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ దినోత్సవం మే 17
posted on May 17, 2023 @ 2:12PM
పురాణాల్లో సమాచారం చేరవేతకు మేఘ సందేశాలు, హనుమంతుడు, నారదుడు, హంస, పావురాళ్లు... ఆ తర్వాత ఉత్తరాలు.. టెలిగ్రాములు, నెక్ట్స్ ల్యాండ్ లైన్లు.. ఇటీవల ఇంటర్నెట్ కనెక్షన్లు.. తాజాగా సెల్ ఫోన్లు.. 4జీలు, 5 జీలు అంతా సమాచార యుగం. గతంలో సమాచారం ఒకరి నుంచి మరొకరికి చేరాలంటే.. . ఏళ్లూ పూళ్లూ పట్టేది. ఆ తరువాత క్రమంగా నెలలు, పక్షాలు, వారాలు, రోజులు నుంచి గంటలు, నిమిషాలు.. చివరకు సెకన్లకు చేరుకొంది. దీంతో ప్రపంచంలోని సమాచారమంతా ఆ మూల నుంచి ఈ మూల వరకూ ఇప్పుడు సెకన్లలో చేరిపోతోంది. దీంతో సమాచార యుగంలో సమాచార ప్రసారం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఇట్టే అర్థమైపోతోంది. మే 17వ తేదీ.. ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం. 2005 నుండి ప్రతి సంవత్సరం మే 17ను ప్రపంచ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డేగా పాటిస్తు వస్తున్నారు.
తొలుత అంతర్జాతీయ టెలిగ్రాఫ్ కన్వెన్షన్‌పై 1865 మే 17న పారిస్‌లో సంతకం చేశారు. 1969, మే 17న ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవాన్ని తొలిసారిగా జరుపుకున్నారు. ఆ క్రమంలో తొలిసారి సంతకం చేసిన మే 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ దినోత్సవంగా జరుపుకొంటున్నారు. అయితే దీన్ని ప్రాముఖ్యతను యావత్ ప్రపంచ దేశాలు గుర్తించాలని 2005లో ట్యూనిస్‌లోని ఇన్ఫర్మేషన్ సొసైటీ శిఖరాగ్ర సమావేశంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య తీర్మానాన్ని ప్రకటించింది. ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ప్రపంచంలో టెలి కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ఉన్న దేశాల్లో భారత్ రెండవ అతి పెద్ద దేశంగా అవతరించింది.
మరోవైపు.. ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకుపోతోంది. దేశా ఆర్థిక పరిపుష్టికి సమాచార రంగం కీలక పాత్ర పోషిస్తోంది. సెల్ ఫోన్ తయారీ నుంచి వాటి విడి భాగాలు ఇతర దేశాలకు ఎగుమతి వరకు చైనాతో పోటీ పడుతోంది. అలాగే నగదు లావాదేవిలు, అన్‌లైన్ సేవలు, వగైరా వగైరా అన్ని సెల్ ఫోన్ కేంద్రంగానే సాగుతోన్నాయి. అంతేకాదు.. సెల్ ఫోన్ రీచార్జ్‌ల పేరుతో అటు పలు నెట్ వర్క్ కంపెనీలకు ఇటు ప్రభుత్వానికి సైతం భారీగా ఆదాయం సమకూరుతోంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు ఈ టెలికమ్యూనికేషన్స్ రంగం వెన్నుదన్నుగా నిలుస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదు.
మరోవైపు ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్‌పై ప్రభుత్వం అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు సైతం చేపడుతోంది. నవంబర్ 2006లో టర్కీలోని అంటాల్యాలో జరిగిన ITU ప్లీనిపోటెన్షియరీ కాన్ఫరెన్స్ మే 17ను ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. అలాగే ప్రపంచ కమ్యూనికేషన్ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత, ఇంటర్నెట్ గురించి సానుకూలతను వ్యాప్తి చేయడం. అదే విధంగా ప్రపంచ టెలికమ్యూనికేషన్ డే అనేది మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సమాచారం అందుబాటులోకి తీసుకురావడమే.