గాయపడ్డ నారా లోకేష్.. భుజానికి స్కానింగ్
posted on May 18, 2023 @ 11:06AM
నదీ నదాలూ,
అడవులు, కొండలు,
ఎడారులా మన కడ్డంకి?
పదండి ముందుకు!
అన్నట్లుగా లోకేష్ పాదయాత్ర సాగుతోంది. ప్రభుత్వ అవరోధాలనే కాదు, గయాలను కూడా లేక్క చేయకుండా.. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమే లక్ష్యంగా లోకేష్ ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే గత 50 రోజులుగా భుజం నొప్పి తీవ్రంగా వేధిస్తున్నా.. క్షణం కూడా విశ్రమించకుండా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ముఖంలో బాధ, అలసట కూడా కనిపించనీయకుండా ప్రజలతో మమేకమౌతూ, కొరిన వారందరితో సెల్ఫీలు దిగుతూ, వారు చెబుతున్న సమస్యలను సావధానంగా వింటూ విరామం లేకుండా నడుస్తూనే ఉన్నారు. భుజం నొప్పి నుంచి ఉపశమనం కోసం ఫిజియో థెరపీ చేయించుకున్నా, వైద్యులు సూచనలు పాటించినా ఫలితం లేకపోయింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఆయన ఈ రోజు నంద్యాలలోని మాగ్న ఎంఆర్ఐ సెంటర్ లో స్కానింగ్ చేయించుకున్నారు.
లోకేష్ పాదయాత్ర అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో ప్రవేశించిన సమయంలో భారీగా జనం తరలి రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఆయన భుజానికి గాయమైంది. అప్పటి నుంచీ ఈ 50 రోజులుగా లోకేష్ భుజం నొప్పితోనూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఫిజియో థెరపీ, నొప్పి ఉపశమనం కోసం వైద్యుల సూచనలూ పాటిస్తూ వస్తున్నారు. అయితే నొప్పి తగ్గక పోవడంతో వైద్యులు ఎంఆర్ఐ స్కానింగ్ అవసరమని చెప్పడంతో ఈ రోజు నంద్యాలలో ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నారు. నారా లోకేష్ పాదయాత్ర ఈ రోజు 103వ రోజుకు చేరుకుంది. లోకేష్ పాదయాత్ర సందర్భంగా నంద్యాల జనసంద్రంగా మారింది. భుజం నొప్పి తీవ్రంగా ఉన్నా ఆయన సంకల్పం సడలలేదు. భుజానికి ఎంఆర్ఐ స్కానింగ్ కారణంగా ఈ రోజు పాదయాత్రలో రైతులతో ముఖాముఖీ కార్యక్రమాన్ని మధ్యాహ్నం రెండు గంటలకు చేపట్టాలని లోకేష్ నిర్ణయించారు.
ఆ తరువాత నంద్యాల యాతం ఫంక్షన్ హాలు వద్ద తన పాదయాత్ర 1300 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా మైలురాయిని ఆవిష్కరిస్తారు. అక్కడ నుంచి ఆయన కానాల జాతీయ రహదారి విస్తరణ బాధితులతో సమావేశమౌతారు. సాయంత్రానికి హెచ్ఎస్ కొట్టాల చేరుకుని అక్కడ స్థానికులతో సమావేశమౌతారు. అనంతరం ఎం చిన్న కొట్టాలలో కూడా స్థానికులతో భేటీ అవుతారు. అక్కడ నుంచి జూలపల్లి చేరుకుని వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారితే భేటీ అవుతారు. అక్కడ నుంచి పసరుపాడు మీదుగా తెల్లాపురి చేరుకుంటారు.
తెల్లాపురి నుంచి రాయపాడు చేరుకుని అక్కడ స్థానికులతో సమావేశమౌతారు. రాత్రికి రాయపాడు శివారు విడిది కేంద్రంలో బస చేస్తారు. ఉదయం స్కానింగ్ కారణంగా పాదయాత్ర ఆలస్యం కావడంతో ఆమేర ఆయన షెడ్యూల్ లో మార్పు చేసుకుని రాత్రి పదిన్నర వరకూ పాదయాత్రను కొనసాగించాలని నిర్ణయించారు.