సీబీఐకి అజయ్ కల్లాం వాంగ్మూలంలో అంత: పుర రహస్యం?!
posted on May 17, 2023 @ 4:52PM
ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ.. తన దూకుడును పెంచింది. ఆ క్రమంలో ఈ హత్య జరిగిన సమయంలో వెళ్లిన ఫోన్ కాల్స్.. జరిగిన సంభాషణలు.. అదే సమయంలో ఫోన్ కాల్స్ మాట్లాడిన వారి నివాసాల్లోని అప్పటి పరిస్థితులు.. ఆ సమయంలో అక్కడ ఉన్న వ్యక్తులపై సీబీఐ ప్రదానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులోభాగంగా ఒక్కొక్కరిని పిలిచి వారి వాంగ్మూలాన్ని సైతం తీసుకొంటున్నట్లు సమాచారం.
అందులో భాగంగా తొలుత జగన్ ప్రభుత్వ సలహాదారు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ్ కల్లాంను సీబీఐ అధికారులు పిలిపించి.. వాంగ్మూలం నమోదు చేసినట్లు, ఆ సందర్భంగా అజయ్ కల్లాం వివేకా గుండెపోటుతో మరణించారని జగన్ స్వయంగా చెప్పినట్లు సీబీఐకి తెలిపారని అంటున్నారు. మార్చి 15వ తేదీ తెల్లవారుజామున తమ చిన్నాన్న వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని వైయస్ జగనే స్వయంగా తమకు తెలిపారని.. అయితే ఆయన చెప్పిన సమయం మాత్రం ఖచ్చితంగా గుర్తు లేదు కానీ.. తెల్లవారు జామునే ఆయన తమకు ఈ విషయాన్ని చెప్పారని అజేయ్ కల్లాం సీబీఐ ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.
వివేకా హత్య జరిగిన రోజు అంటే 2019, మార్చి 14 అర్ధరాత్రి.. పులివెందుల్లో వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అదే రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు లోటస్ పాండ్‌లో జగన్ ఎన్నికల ప్రణాళికపై సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ కల్లాం, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దువ్వూరి కృష్ణ పాల్గొన్నారు.
ఈ సమావేశం జరుగుతుండగానే... మేడ మీద నుంచి ఫోన్ రావడంతో.. జగన్‌పైకి వెళ్లి రావడం.. ఆ తర్వాత ఆయన కిందకి వచ్చి.. చిన్నాన్న వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని చెప్పినట్లు ఓ మీడియాలో కథనాలు వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో జగన్‌తో ఆ సమయంలో భేటీ అయిన వారి నుంచి వివరాలు రాబట్టేందుకు సీబీఐ తన వంతు ప్రయత్నాలను ప్రారంభించింది. మరోవైపు ఇప్పటికే జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సీబీఐ విచారించింది. అలాగే దువ్వూరి కృష్ణతోపాటు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లను సైతం మరికొద్ది రోజుల్లో సీబీఐ పిలిచి విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అదలా ఉంటే వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించే పన్నాగం ఎవరు చేశారు? సొంత చిన్నాన్న గుండెపోటుతో మరణిస్తే.. నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ హుటాహుటిన ఎందుకు పులివెందులకు వెళ్లలేదు?. అయిన దానికీ కాని దానికీ ప్రత్యేక విమానాలలో ప్రయాణించే జగన్.. తాపీగా అదీ రోడ్డు మార్గంలో.. కారులో ఎందుకు వెళ్లారు, మార్చి 15వ తేదీ సాయంత్రం మీడియా ఎదుట ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం.. అనంతరం వైయస్ వివేకా హత్య కేసులో ఆయన వ్యవహరించిన తీరు తెన్నులు.. అలాగే వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా వివేకా గుండెపోటుతో మరణించారని తొలుత మీడియాకు చెప్పడం... ఆ తర్వాత చోటు చేసుకొన్న వరుస పరిణామాలను సైతం సీబీఐ నిశీతంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల్లో నివసిస్తున్న వైఎస్ ఫ్యామిలీని బయట వారు టచ్ చేయాలంటే అది సాధ్యమయ్యే పని కాదనీ, దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీ అక్కడ తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తూ ఉందనీ, అలాంటిదివివేకాను ఆయన ఇంట్లోనే అత్యంత పాశవికంగా హత్య చేస్తే.. ఇది బయటవారి పని అని ఎవరైనా ఎలా అనుకొంటారనే ఓ సందేహం సైతం వ్యక్తమవుతోంది.
ఓ వేళ ఇది బయటవారి పని అయితే.. జగన్ అండ్ కో సాధారణంగా ఉరుకొంటుందా? అదీ కాక అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం.. ఈ పాటికే... వారిని కటకటాల వెనుకకు నెట్టేది కదా అంటున్నారు. ఈ నేపథ్యంలో వివేకాను గొడ్డలి పోటుతో అత్యంత దారుణంగా హత్య చేసి.. గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది ఎవరు అనే ఓ చర్చ అయితే ఉమ్మడి కడప జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తం జోరుగా వాడి వేడిగా సాగుతోంది. మరోవైపు వివేకా హత్యకసులో మరిన్ని పెద్ద తలకాయలు సీబీఐ ముందు విచారణకు హాజరయ్యే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయనే ఓ చర్చ సైతం ఉమ్మడి కడప జిల్లాలో ఊపందుకొంది.