గెలిచి ఓడిన కాంగ్రెస్.. ఓడి గెలిచిన డీకే
posted on May 18, 2023 9:26AM
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు స్పష్టమైన మెజార్టీ ఇచ్చినా.. ఎవరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెట్టాలన్న విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ పడిన మల్లగుల్లాలు ఆ పార్టీ సంస్కృతికి తగినట్లుగానే ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రాజీ కుదర్చడానికి కాంగ్రెస్ హై కమాండ్ కు ఐదు రోజులు పట్టింది. సుదీర్ఘ మంతనాలు, డీకే, సిద్ధరామయ్యలతో ముఖాముఖి చర్చల అనంతరం ఎట్టకేలకు సిద్ధరామయ్యను కాంగ్రెస్ హై కమాండ్ ముఖ్యమంత్రిగా నిర్ణయించింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , ఆ తరువాత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ సిద్దరామయ్య, శివకుమార్‌లతో వేర్వేరుగా భేటీ ఒకటికి రెండు సార్లు భేటీ అయ్యారు. సుధీర్ఘంగా మంతనాలు జరిపారు. అలాగే పార్టీ సీనియర్ నేతలు, కర్ణాటక నాయకులతో సైతం సమాలోచనలు జరిపారు. సిద్దరామయ్య మంగళవారమే (మే 16) ఢిల్లీకి చేరుకోగా.. డీకే మాత్రం బుధవారం (మే 17) ఢిల్లీ చేరుకున్నారు. డీకే కర్నాటక కాంగ్రెస్ విజయం క్రెడిట్ మొత్తం తనదే అని క్లెయిమ్ చేసుకోవడమే కాకుండా.. ఒక వేళ సీఎం పదవికి సిద్దరామయ్య అనే అధిష్ఠానం నిర్ణయిస్తే తనకు పదవులు వద్దనీ, సాధారణ ఎమ్మెల్యేగానే కొనసాగిస్తానని నిష్కర్షగా చెప్పేశారని కూడా ఒక సమయంలో వార్తలు వినవచ్చాయి. సిద్దరామయ్యకు ఇప్పటికే ఒకసారి అవకాశమిచ్చారని.. ఐదేళ్లు ఆయన సీఎంగా అధికారం లో ఉండి సాగించి4న దుష్పరిపాలన కారణంగానే కాంగ్రెస్ కర్నాటకలో విపక్షానికి పరిమితం కావాల్సి వచ్చిందని డీకే శివకుమార్ ఈ సందర్భంగా అధిష్టానం వద్ద ప్రస్తావించారని కూడా ప్రచారం జరిగింది. 2019లో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణం కుప్పకూలాక రాష్ట్రంలో పార్టీని తానే పునర్నిర్మించానని డీకే స్పష్టం చేశారనీ చెబుతున్నారు. అయితే ఆ తరువాత రాహుల్ రంగంలోకి దిగి స్వయంగా డీకేతో సుదీర్ఘంగా చర్చించిన తరువాత డీకే మెత్తపడ్డారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
డీకేపై బోలెడన్ని కేసులు, మనీలాండరింగ్ కేసుల్లో ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపథ్యం కూడా డీకే రేసులో వెనుకబడేటట్లు చేసిందని కూడా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద బుధవారం రాత్రి పొద్దుపోయిన తరువాత మల్లికార్జున్ ఖర్గే సిద్దరామయ్య, డీకే శివకుమార్ లతో సుదీర్ఘంగా చర్చించి వారిరువురి మధ్యా ఏకాభిప్రాయం వచ్చేలా చేశారు. దీంతో గత ఆరు రోజులుగా కర్నాటక సీఎం ఎవరన్న విషయంలో ఏర్పడిన ప్రతిష్ఠంభన తొలగిపోయింది.
సిద్దరామయ్య శనివారం (మే 20)న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం మీద కర్నాటకానికి కాంగ్రెస్ తెర దించింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో అసెంబ్లీ ఎన్నికలలో తిరుగులేని విజయం సాధించిన కాంగ్రెస్ గెలిచి ఓడితే.. సీఎం రేసులో పోటీపడిన డీకే శివకుమార్ ఓడి గెలిచారు. హై కమాండ్ నిర్ణయాన్ని ఔదాల్చి డిప్యూటీ పోస్టుకు అంగీకరించడం ద్వారా భవిష్యత్ లో కర్నాటకలో బలమైన నేతగా నిలిచేలా పునాదిని మరింత పటిష్టం చేసుకున్నారు.