సుప్రీంలో అవినాష్ కు ఎదురుదెబ్బ
posted on May 17, 2023 @ 12:03PM
వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు చుట్టూ గుడుగుడు గుంచం గుండే రాగం అన్నట్లుగా తిరుగుతోంది. సీబీఐ అవినాష్ రెడ్డి విచారణ అరెస్టు వ్యవహారంలో ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. తాజాగా తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉన్న ముందస్తు బెయిల్ పై సుప్రీంను ఆశ్రయించారు. అయితే అవినాష్ కు సుప్రీం కోర్టులో ఊరట దక్కలేదు. విచారణ తేదీని సీజేఐ ధర్మాసనం ఖరారు చేయలేదు. విచారణ అత్యవసరమని భావిస్తే లిఖిత పూర్వకంగా అభ్యర్థించాలని, దానిని బట్టి తాము విచారణ తేదీని ఖరారు చేస్తామనీ సుప్రీం స్పష్టం చేసింది.
అదలా ఉంటే మంగళవారం విచారణకు హాజరు కావాల్సిన వివేకా పార్టీ కార్యక్రమాలు ఉన్నందున నాలుగు రోజులు వ్యవధి కావాలని కోరితే.. సీబీఐ రెండో ఆలోచన లేకుండా మూడు రోజులు గడువు ఇచ్చింది. ఆ వెంటనే ఆయన బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉన్న ముందస్తు బెయిల్ పై సుప్రీంను ఆశ్రయించారు. తన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు వెంటనే తేల్చేలా ఆదేశాలివ్వాని కోరుతూ సుప్రీం ను ఆశ్రయించారు. తన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ సుప్రీం పరిశీలనలో ఉండడం వల్ల త్వరగా విచారణ జరగడం లేదని ఆ పిటిషన్ లో పేర్కొన్న అవినాష్ రెడ్డి వెకేషన్ కోర్టులో తన ముందస్తు బెయిల్ విచారణ ముగించేలా ఆదేశాలు ఇవ్వాలని.. అప్పటివరకు సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలనీ కోరారు. అదే సమయంలో 19న విచారణకు రావాలన్న సీబీఐ నోటీసుకు సమాధానమిస్తూ హాజరౌతానని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి పి సుప్రీంను ఆదేశించడం ఆసక్తికరంగా మారింది. అవినాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు ఏ నిర్ణయం వెలువరిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అదలా ఉంచితే.. వివేకా హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకున్న ప్రతిసారీ.. జగన్ రియాక్షన్ ఏలా ఉంటోందన్న విషయంలో సామాన్య జనమే కాదు పరిశీలకులు కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. మంగళవారం అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆయన వ్యవధి కోరారు. దాదాపుగా అదే సమయంలో జగన్ హస్తిన షెడ్యూల్ ఖరారైంది. నీతి ఆయోగ్ సమావేశానికి ఆయన ఢిల్లీ వెడుతున్నారు. ఆ సమావేశం ఈ నెల 27న కాగా జగన్ మాత్రం ఒక రోజు ముందు అంటే 26వ తేదీ నాటికే ఢిల్లీ చేరుకుంటారు. ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోడీతో భేటీ అవుతారని చెబుతున్నారు.
సాధారణంగా ఈ నాలుగేళ్లలో జగన్ నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన సందర్భాలు లే వు. విత్త మంత్రి బుగ్గనే జగన్ తరఫున ఆ సమావేశాల్లో పాల్గొన్నారు. అలాంటిది ఈ సారి బుగ్గనను వద్దని జగన్ స్వయంగా వెళుతున్నారు. ఆయన పర్యటన లక్ష్యం నీతి ఆయోగ్ సమావేశం కాదనీ, తన బాబాయ్ హత్య కేసులో తమ పార్టీ ఎంపీని చిక్కుల నుంచి తప్పించడానికేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ హస్తిన పర్యటన పూర్తయ్యే వరకూ తన అరెస్టును నిలువరించుకునేందుకే అవినాష్.. మరోసారి సుప్రీంను ఆశ్రయించారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. ఇప్పటికే ఇదే ముందంస్తు బెయిలు పిటిషన్ పై సుప్రీం కోర్టు, తెలంగాణ హైకోర్టు కూడా తమ అభిప్రాయాలను చెప్పేశాయి. ముందస్తు బెయిలు పిటిషన్ విచారణను వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు.. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సీబీఐకి ఎటువంటి ప్రతిబంధకాలూ లేవని విస్పష్టంగా చెప్పేసింది.
అంతకు ముందు ముందస్తు బెయిలుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టి వేయడమే కాకుండా ఇలాంటి ఆదేశాలు కూడా ఇస్తారా అంటూ అసహనం వ్యక్తం చేసింది. దీంతో అవినాష్ ఇప్పుడు తాజాగా సుప్రీంను తన ముందస్తు బెయిలు పిటిషన్ ను త్వరగా విచారించేలా హైకోర్టును ఆదేశించాలంటూ సుప్రీం ను ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సుప్రీంలో ఆయనకు ఊరట లభించకుండటంతో ఇక అరెస్టు అనివార్యం అన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.