కర్నాటక సీఎం సిద్దరామయ్యే!
posted on May 17, 2023 @ 12:53PM
కర్నాటక ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటారన్న విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభనకు ఎట్టకేలకు తెరపడింది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యనే కాంగ్రెస్ అధిషఠానం కర్నాటక ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్యంగా సంపూర్ణ మెజారిటీ సాధించిన అనంతరం.. ముఖ్యమంత్రి ఎవరన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు సిద్దరామయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది.
రాష్ట్రంలో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అన్ని విధాలుగా పార్టీని పటిష్టం చేసేందుకు ఎంతో కష్టపడటమే కాకుండా.. బీజేపీ సర్కార్ కేసులతో వేధించినా, అరెస్టు చేసినా తట్టుకుని నిలబడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేశారు. సోనియాగాంధీకి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని గిఫ్ట్ గా ఇస్తానన్న మాట నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ విజయానికి ఒంటి చేత్తో స్క్రిప్ట్ చేశారని చెప్పవచ్చనే విధంగా ఆయన పని చేశారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలు కావడంలోనూ.. అంచనాలకు సైతం అందనంతగా కాంగ్రెస్ ఘన విజయం సాధించడంలోనూ డీకే శివకుమార్ ది కీలక పాత్ర. అయినా ఆయనకు సీఎం పదవి అందని ద్రాక్షగా మిగలడానికి ప్రధాన కారణం బీజేపీ వ్యూహాత్మకంగా గతంలో ఆయనపై పెట్టిన కేసులు, జరుగుతున్న సీబీఐ దర్యాప్తే కారణమని అంటున్నారు.
కర్నాటక ఎన్నికలలో బీజేపీ పరాజయానికి ప్రధాన కారకుడైన డీకే శివకుమార్ ను ఇరుకున పెట్టే విధంగా క మలం పార్టీ అధిష్ఠానం పావులు కదిపింది.
సీబీఐ కొత్త బాస్ గా ప్రణీత్ సూద్ ను కేంద్రం నియమించింది. కేంద్రం ఈ మూవ్ డీకే శివకుమార్ ను ఇరుకున పెట్టడానికేనని అంటున్నారు. కర్నాటక డీజీపీగా ఉన్న ప్రవీణ్ సూద్ ను సీబీఐ చీఫ్ గా నియమించడంతో డీకే శివకుమార్ పై బీజేపీ బనాయించిన అవినీతి కేసుల దర్యాప్తును మళ్లీ తెరపైకి తీసుకురావడంతో.. ఆయనపై అరెస్టు కత్తి వేలాడుతున్నట్లైంది. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం డీకేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపిక చేసేందుకు ముందు వెనుకలాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీఎంగా ఎంపిక చేసి పదవి కట్టబెట్టినా.. కేసుల కారణంగా ఆయన పదవి నుంచి తప్పుకునే పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్న భావనతో సీఎంగా కాంగ్రెస్ అధిష్ఠానం సిద్దరామయ్య వైపే మొగ్గు చూపింది.