దళిత వోట్లు చీలకుండా జాగ్రత్తలు
posted on May 18, 2023 @ 1:04PM
బిఆర్ఎస్ దళిత వోట్ల మీద ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇటీవలె బిఎస్పి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ముఖ్యఅతిథిగా రావడాన్ని బిఆర్ఎస్ వర్గాలకు నచ్చలేదు. ఎందుకంటే తెలంగాణ రాజధానిలో బిఎస్పి బహింరంగ సభ పెట్టడాన్ని బిఆర్ఎస్ మనసు మీద తీసుకుంది. ఎందుకంటే బిఎస్పి అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ మాజీ ఐపిఎస్ అధికారి. ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో వచ్చిన ధీరుడాయన. తెలంగాణ జిల్లాల్లో ఆయన కలియ తిరుగుతూ కెసిఆర్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. పరుషంగా కూడా మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ దాడిని బిఆర్ఎస్ శ్రేణులు అంత బలంగా తిప్పి కొట్టలేకపోతున్నాయి. ధర్మ సమాజ్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా దళిత పార్టీలే. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ దళిత పార్టీలు తమ అభ్యర్థులను రంగంలో దించుతున్నాయి. ఒకప్పుడు దళిత సంఘాలుగా ఉన్న ఈ సంఘాలు రాజకీయ పార్టీలుగా అవతరించాయి. దళిత హక్కుల కోసం ఉద్యమాలు చేసిన సంఘాలు రాజకీయ పార్టీలుగా అవతరించి వోటరు తీర్పును ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాయి.
దళిత బంధు వంటి పథకాన్ని పరిచయం చేసిన బిఆర్ ఎస్ కూడా ఇటీవలె విమర్శల పాలైంది. పార్టీ అధినేత కేసీఆర్ డైరెక్టుగా తన పార్టీ శాసనసభ్యులే కమీషన్లకు కక్కుర్త పడుతున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలు ప్రతి పక్షాలకు అస్త్రం దొరికినట్టయ్యింది. దళిత వర్గానికి చెందిన ఎంఎల్ఏ ప్రస్తుతం తెలంగాణ పిసిసి శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాంగ్రెస్ పార్టీలో పాపులర్ నేత అతను. ఆయన చేపట్టిన పాదయాత్ర రికార్డుల్లో కెక్కింది కూడా. ప్రస్తుతం అస్తిత్వంలో ఉన్న రాజకీయ పార్టీలకు తోడు కొత్తగా వచ్చిన దళిత పార్టీలు బిఆర్ఎస్ ను ఏ మేరకు దెబ్బతీస్తాయో వేచి చూడాలి.