వాలంటీర్లను శరణుజొచ్చిన జగన్.. మరి వారేం చేస్తారో?
posted on May 20, 2023 @ 10:15AM
త్వమేవ శరణం నాస్తి అన్నట్లుగా జగన్ మరో సారి తనను అధికార పీఠం మీద కూర్చో పెట్టే బాధ్యత వలంటీర్ల భుజస్కంథాలపై పెట్టారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు చివరాఖరికి మంత్రులూ కూడా కాదు.. వాలంటీర్లు మాత్రమే తనను కాపాడగలరని జగన్ భావించడమే కాదు.. ఆవిషయాన్ని బహిరంగంగా వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ఇంటింటికీ వెళ్లి చెప్పాలనీ, వీలైనన్ని ఎక్కువ సార్లు వెళ్లాలనీ వారిని బతిమలాడుకున్నారు.
పార్టీని గట్టెక్కించే బాధ్యత తీసుకోవాలని దాదాపు బతిమలాడుకున్నంత పని చేశారు. పార్టీ క్యాడర్, నాయకులు చేయాల్సిన పనిని వాలంటీర్ల భుజస్కంథాల మీద పెట్టేశారు. వాలంటీర్ల వ్యవస్థ సీఎం జగన్ బ్రెయిన్ చైల్డే అయినా.. వాలంటీర్లకు ప్రభుత్వం జీతాలిస్తోందన్న విషయాన్ని విస్మరించి వారిని పార్టీ పని చేయాలని కోరడం ఒకింత విస్మయం కలిగించేదే అయినా.. జగన్ పార్టీకి , ప్రభుత్వానికి మధ్య ఉన్న గీతను ఎప్పుడో చెరిపేశారు. లబ్ధి దారుల అక్కౌంట్లలో సొమ్ములు వేయడానికి అంటూ.. బటన్ నొక్కే కార్యాక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలను పార్టీ సభగా మార్చేసి విపక్షాలపై తన అక్కసు తీర్చుకోవడానికి ఉపయోగించుకోవడం తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వ వేతనం తీసుకుంటున్న వాలంటీర్లను పార్టీ గెలుపు కోసం పని చేయమంటూ బహిరంగ వేదికల మీద నుంచే పిలుపునిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి తమ ప్రభుత్వ మంచిని చెప్పమని వేడుకుంటున్నారు. ఇంత కాలం ఇదే పనిని గడపగడపకూ, మా నమ్మకం నువ్వే జగన్, ఇంటింటికీ స్టిక్కర్లు అంటించడం వంటి పనుల ద్వారా పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలూ చేశారు. వారి వల్ల పని జరగడం అటుంచి జనం ఎక్కడికక్కడ వారిని నిలదీసి కడిగి, ఏకి పారేస్తుండటంతో.. ఇక జగన్ పూర్తిగా వాలంటీర్ల మీదే ఆధారపడ్డారు.
చెప్పిన పని చెప్పినట్లు చేస్తే వారిని లీడర్లను చేస్తానని ఆశపెడుతున్నారు. తమకు ఇసుమంతైనా ప్రాధాన్యత లేకుండా సర్వం వాలంటీర్లదే ఆధిపత్యంగా మారిపోయిందన్న సొంత పార్టీ పార్టీ నేతల అసంతృప్తిని జగన్ ఇసుమంతైనా ఖాతరు చేయడం లేదంటే ఆయన వాలంటీర్లపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో, వారిపై ఎంతగా ఆధారపడ్డారో అవగతమౌతోంది. ఆ విషయాన్ని గ్రహించిన వాలంటీర్లు వాలంటీర్లకు వందనం కార్యక్రమం వేదికగానే వేతనాల విషయంలో తమ అసంతృప్తిని కుండబద్దలు కొట్టారు.
మామూలుగానే వినతులు, డిమాండ్లు పట్టించుకోని జగన్ వాలంటీర్ల వేతనాల డిమాండ్ ను కూడా అలాగే పెడచెవిన పెట్టారు. తనకు టీవీలూ, అనుకూల మీడియా లేదని బీద అరుపులు అరుస్తూ తన ఆస్తి వాలంటీర్లు మాత్రమేనని, వారే తన బలం, బలగం అని చెప్పుకున్నారు. మరో సారి తాను అధికారంలోకి రాకపోతే వాలంటీర్ల ఉద్యోగాలు ఉండవనీ, చంద్రబాబు ఊడగొడతారనీ కూడా ఓ హెచ్చరిక చేశారు.
మొత్తంగా వాలంటీర్లే తన గెలుపు సారథులుగా జగన్ నమ్ముతున్నారు. వాలంటీర్లకు ప్రజాధనంతో వేతనాలిస్తూ.. వారందరినీ పార్టీ సంక్షేమ పథకాల ప్రచార వారధులుగా వాడుకుంటూ.. నవ్విపోదురు గాక..నాకేటి సిగ్గు..అనే చందంలా ఉన్న జగన్ తీరుపై రాజకీయ పండితులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విపరీత ధోరణికి ప్రజలే వచ్చే ఎన్నికలలో అడ్డుకట్ట వేస్తారని విశ్లేషిస్తున్నారు.