అవినాష్ తీరుతో మంట కలుస్తున్న వైసీపీ ప్రతిష్ట
posted on May 20, 2023 @ 11:29AM
వైఎస్ అవినాష్ రెడ్డి కర్నూలు ఆసుపత్రిలో కడుపునొప్పితో చేరారు. తల్లి గుండెపోటుతో, కొడుకు కడుపు నొప్పితో ఒకే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అవినాష్ ఆస్పత్రిలో చేరాల్సినంత ఆనారోగ్యానికి గురయ్యారంటే ఎవరిదాకానో ఎందుకు ఆయన అనుచరులే నమ్మడం లేదు.
నిన్న ఉదయం నుంచి సాయంత్రం కర్నూలు ఆస్పత్రికి చేరే వరకూ ఆయన ఎంత యాక్టివ్ గా ఎంత వ్యూహాత్మకంగా హైదరాబాద్ టు పులివెందుల బాట పట్టారో.. సీబీఐ బృందాలు అనుసరిస్తున్నాయని గమనించి పులివెందుల ఆస్పత్రి నుంచి తల్లిని డిశ్చార్జ్ చేయించి ఆమెను అంబులెన్స్ లో తన కాన్వాయ్ కి ఎదురు వచ్చేలా చేసి.. మార్గ మధ్యంలో తాను తల్లి ఉన్న అంబులెన్స్ లోకి మారి కర్నాలు వరకూ వచ్చారు. ఏపీ బోర్డర్ దాటి తెలంగాణలోకి వస్తే అరెస్టు ఖాయం అనుకున్నారో ఏమో కర్నూలులోనే ఆగిపోయి అక్కడి ఆస్పత్రిలో తల్లిని చేర్చారు.
అక్కడి వరకూ ఓకే కానీ కడపు నొప్పంటూ తాను కూడా అదే ఆస్పత్రిలో చేరడంతో అరెస్టు నుంచి తప్పించుకోవడానికే అవినాష్ అలా చేశాడన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి అవినాష్ లో అరెస్టు భయం గత జనవరిలో సీబీఐ తనను విచారణకు పిలిచినప్పటి నుంచీ మొదలైంది. అప్పటి నుంచీ ఆయన అరెస్టును తప్పించుకోవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించారో , ప్రయత్నిస్తున్నారో అందరూ గమనిస్తూనే ఉన్నారు. నిజానికి సింపుల్ లాజిక్ ప్రకారం చూస్తే వివేకా హత్య కేసులో సీబీఐ అవినాష్ రెడ్డిని ఇప్పటికే ఆరుసార్లు విచారించింది.
కోర్టులో ఆయన విచారణకు సహకరించడం లేదు కనుక అరెస్టు చేయకతప్పదని విస్పష్టంగా చెప్పింది. అంటే అవినాష్ అరెస్టు అనివార్యం అని అప్పుడే తేలిపోయింది. కోర్టులు కూడా అరెస్టును అడ్డుకుని సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోజాలమంటూ విస్పష్టంగా తేల్చేశాయి. అంటే అవినాష్ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, సీబీఐ విచారణకు డుమ్మా కొట్టేందుకు సాకులెన్ని చెప్పినా నేడు కాకపోతే రేపు ఆయన అరెస్టు ఖాయం. ఈ విషయంలో రాజకీయ వర్గాలలోనే కాదు, ఆయన అనుచరులలోనూ, వైసీపీ నాయకులలోనూ కూడా ఎలాంటి అనుమానాలూ లేవు.
అయినా అవినాష్ ఎందుకు సీబీఐకి అందకుండా పరుగులు తీస్తున్నారన్నది అంతు బట్టడం లేదని పరిశీలకులు అంటున్నారు. కాగా ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, అవినాష్ కు వరుసకు సోదరుడు అయిన జగన్ ఎందుకు అవినాష్ పిల్ల చేష్టలను అడ్డుకోవడం లేదని కూడా పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అవినాష్ తీరు వల్ల ఆయన ప్రతిష్టే కాకుండా వైసీపీ ప్రతిష్ట కూడా మంటగలుస్తోందని అంతర్గత చర్చలలో చెప్పుకుంటున్నారు.
విపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ సీబీఐ, సీఐడీ నమోదు చేసిన కేసుల్లో అరెస్టై 16 నెలలు జైలులో ఉండి వచ్చారు. పార్టీ అధినేతే ధైర్యంగా కేసులను ఎదుర్కొని అరెస్టై వచ్చినప్పుడు ఎంపీ అవినాష్ అరెస్టుకు ఎందుకు భయపడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ తాను అరెస్టయితే ఇక బయటకు వచ్చేందుకు వీల్లేనంతగా ఇరుక్కుపోతానని భయపడుతున్నారా అని కూడా కడప, పులివెందుల వాసులలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అదలా ఉంచితే.. వివేకా హత్య కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ చాలా చాలా ఉదారంగా వ్యవహరించిందనే చెప్పాలి. ఎక్యూజ్డ్ గా ఉన్న అవినాష్ లేవనెత్తిన అంశాలన్నిటినీ కూడా పరిగణనలోనికి తీసుకుని వాటినై సైతం దర్యాప్తు చేసింది. ఆయన ఆరోపించిన వారందరినీ పిలిపించుకుని విచారించింది. ఆ తరువాత కూడా సీబీఐ అవినాష్ వెంట పడుతోందంటే ఈ కేసులో అవినాష్ ప్రమేయానికి సంబంధించి తిరుగులేని సాక్ష్యాలేవో సీబీఐ సేకరించిందనే భావించాల్సి వస్తోంది. సాధారణంగా ఏ దర్యాప్తు సంస్థ అయినా ఎక్యూజ్డ్ ఆరోపణలను పట్టించుకోదు. కానీ హై ప్రొఫైల్ కేసు కావడంతో వివేకా హత్య కేసులో సీబీఐ అన్ని అంశాలలోనూ ఆచితూచి వ్యవహరించింది. అవినాష్ కు ఆయన కోరినన్ని అవకాశాలిచ్చింది. చివరి నిముషంలో విచారణకు డుమ్మా కొట్టి మరో రోజు వస్తామని చెప్పినా అంగీకరించింది. విచారణకు హాజరై సీబీఐ కార్యాలయం ఎదుటే సీబీఐపై నిందలు మోపినా సహించింది.
ఇక అవినాష్ కు అన్ని దారులూ మూసుకుపోయాయి అని తేలిపోయిన తరువాత కూడా ఆయన ఆడుతున్న దాగుడు మూతలు ఆయననే కాకుండా పార్టీనీ, పార్టీ అధినేత జగన్ నూ అపహాస్యం చేసేవిధంగా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ ప్రక్రియకు ఫుల్ స్టాప్ పెట్టి అవినాష్ సీబీఐ విచారణకు హాజరైతే పార్టీ ప్రతిష్ట మరింత దిగజారకుండా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.