రెండు వేల రూపాయల నోటు రద్దు
posted on May 19, 2023 @ 10:27PM
చాలా కాలంగా అందరూ అనుకుంటున్నదే జరిగింది. రెండు వేల రూపాయల నోట్ల చెలామణిని ఉపసంహరిస్తూ ఆర్బీఐ శుక్రవారం (మే 19)న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొంది. వాస్తవానికి డిమానిటైజేషన్ పేరిట వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేసిన సమయంలోనే ఆర్బీఐ అప్పట్లో కొత్తగా వినియోగంలోనికి తీసుకు వచ్చిన రెండు వేల రూపాయల నోట్ల చెలామణి ఎక్కువ కాలం కొనసాగదన్న వార్తలు వెలువడ్డాయి.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు వంటి నాయకులు అప్పట్లోనే రెండు వేల రూపాయల నోట్ల ను చెలామణిలోకి తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పట్లో పెద్ద నోట్ల రద్దును హర్షిస్తూనే వెయ్యి రూపాయల కంటే పెద్ద నోటును తీసుకురావడం సరికాదని పేర్కొన్నారు.
అప్పటి నుంచీ రెండు వేల రూపాయల నోటు చెలామణిపై సందేహాలు వ్యక్తమౌతూనే ఉన్నాయి. వాటన్నిటికీ తాజా ఉత్తర్వులతో ఆర్బీఐ చెక్ పెట్టింది. వాస్తవానికి ఐదేళ్ల కిందటే అంటే 2018 నుంచే ఆర్బీఐ రెండు వేల రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేసింది. ఇప్పుడు వాటి చెలామణిని విత్ డ్రా చేసుకుంది.
అయితే ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ రెండు వేల రూపాయల నోట్లను బ్యాంకులలో మార్చుకోవచ్చు. బ్యాంకులు రెండు వేల రూపాయల నోట్లను ఇవ్వవద్దనీ, అలాగే ఏటీఎమ్ లలో ఉంచొద్దనీ కూడా ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.