ఎప్పుడు కుదిరితే అప్పుడొస్తారు.. ఎందుకింత రాద్ధాంతం.. సజ్జల
posted on May 19, 2023 @ 4:08PM
ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల మరో సారి బోధివృక్షం కింద కూర్చున్నారు. అవినాష్ విషయంలో సీబీఐ, మీడియా, విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయంటూ జనానికి జ్ణానబోధ చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జలకు అవినాష్ వ్యవహారంలో మాట్లాడాల్సిన అవసరం ఏమిటన్నది పక్కన పెడితే ఆయనేం మాట్లాడుతున్నారంటే.. అవినాష్ ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే మరో రోజు విచారణకు హాజరౌతారు? ఇప్పటికిప్పుడే విచారించాలన్న తొందర సీబీఐకి ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.
మరి ఇదే జగన్ సర్కార్ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారంటూ సీనియర్ మోస్ట్ జర్నలిస్టు అంకబాబును రాత్రికి రాత్రి ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో సజ్జల చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్క అంక బాబు అనే కాదు తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయనను అరెస్టు చేసి వందల కిలోమీటర్లు రోడ్డు మార్గంలో తీసుకు వచ్చిన సంఘటనపైనా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయినా వివేకా హత్య కేసు దర్యాప్తు విషయంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఆయన మాట్లాడటమేమిటి? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ తమ చెప్పుచేతలలో ఉండాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల వారు భావిస్తున్నారా అని సెటైర్లు వేస్తున్నారు.
అవినాష్ తల్లి అనారోగ్యం కారణంగా విచారణ వాయిదా వేయాలని కోరాలంటే ముందు ఆయన సీబీఐ కార్యాలయానికి వెళ్లి తన తల్లి అనారోగ్యానికి సంబంధించి ఆధారాలు చూపి కోరితే వేరేలా ఉండేది. అందుకు భిన్నంగా ఆయన వ్యవహరించడంతో సీన్ సితారైందని అంటున్నారు. అవినాష్ ను అరెస్టు చేసి విచారించాలని సీబీఐ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆ దర్యాప్తు సంస్థ హైదరాబాద్ కార్యాలయానికి ఆదేశాలు వచ్చాయని అంటున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా అవినాష్ ను అరెస్టు చేయాలన్న పట్టుదలతో సీబీఐ ఉందని అంటున్నారు. అందుకే ఆయనను నీడలా వెంటాడుతోందని అంటున్నారు. అవినాష్ కాన్వాయ్ ను అనుసరిస్తున్న సీబీఐ వాహనాలను అడ్డుకునేందుకు అవినాష్ అనుచరులు ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో హింస రేగుతుందా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ సలహాదారు వచ్చి అవినాష్ కు ఎప్పుడు కుదిరితే అప్పుడు విచారణకు వస్తారు, దీనిపై ఎందుకు రాద్ధాంతం అంటూ మాట్లడడం చూస్తుంటే ఆయన ప్రభుత్వం తరఫున ఏం సందేశమిస్తున్నట్లు అని పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక క్రిమినల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి వత్తాసుగా ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థను నిలువరిస్తోందా అనిపించేలా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు. సజ్జల మాటలు సీబీఐని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.