అనినాష్ రెడ్డికి సీబీఐ మరో చాన్స్
posted on May 20, 2023 @ 2:52PM
అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ వేచి చూచే ధోరణి అవలంబిస్తోందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. దారులన్నీ మూసుకు పోయిన తరువాత కూడా ఆయన ఎంత కాలం దాగుడుమూతలట ఆడతారో చూద్దామన్నట్లుగా సీబీఐ తీరు ఉందని అంటున్నారు. సీబీఐ విచారణకు డుమ్మా కొట్టి తల్లి అనారోగ్యమంటూ శుక్రవారం (మే19) రోజంతా రోడ్లపై కాన్వాయ్ లో విపరీతంగా తిరిగిన వైఎస్ అవినాష్ రెడ్డి ఎట్టకేలకు కర్నూలులో హాల్ట్ అయ్యారు. అక్కడి ఆస్పత్రిలో తల్లిని చేర్చి తాను కూడా అడ్మిట్ అయ్యారు.
గుండెపోటుతో తల్లి హస్పిటల్ లో చేరితే కడుపులో మంట లేదా నొప్పి అంటూ అవినాష్ అదే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. దాంతో నిన్న రోజంగా జరిగిన హైడ్రామాకు తెరపడింది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులను ధిక్కరించి పులివెందుల బయలు దేరిన అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు వెంబడించడంతో ఇక ఆయనను ఏక్షణంలోనైనా అరెస్టు చేస్తారనే అంతా భావించారు. ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం నుంచి హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి అవినాష్ ను అరెస్టు చేయాలంటూ ఆదేశాలు సైతం జారీ అయ్యాయని వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే శనివారం అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయం అన్న నిర్ధారణకు పరిశీలకులు వచ్చేశారు. అయితే అనూహ్యంగా సీబీఐ ట్విస్టు ఇచ్చింది. కడుపు నొప్పికి చికిత్స చేయించుకుని సోమవారం ( మే20) విచారణకు హాజరు కావాల్సిందిగా తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది. దారులన్నీ మూసుకుపోయిన అవినాష్ ఇంకెంత దూరం వెడతారో చూద్దామన్నట్లుగా సీబీఐ తమాషా చూస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తుంటే.. అవినాష్ విషయంలో సీబీఐ తీరు అనుమానాస్పదంగా ఉందని కొందరంటున్నారు. అవినాష్ తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసిందనీ, ఆ సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారనీ అప్పటి వదిలేయలేదనీ, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించి మరీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిందని గుర్తు చేస్తున్నారు. మరి అవినాష్ విషయంలో సీబీఐ ఆ విధంగా ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఒకే కేసులో తండ్రి విషయంలో ఒకలా, తనయుడి విషయంలో ఒకలా సీబీఐ వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
అదలా ఉంటే.. వివేహా హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. వివేకా పి.ఏ కృష్ణారెడ్డి దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ లో డాక్టర్ సునీత ఇంప్లీడ్ అయ్యారు. వివేకా హత్య కేసులో నిజమైన బాధితురాలిని తానేననీ, ఈ కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని అంగీకరించడం, అంగీకరించకపోవడం తనకు సంబంధించిన విషయమనీ, కృష్ణారెడ్డికి ఏం సంబంధం కాదనీ పేర్కొన్నారు. ఈ మేరకు సునీత తరఫు న్యాయవాది.. తొలి నుంచీ ఈ కేసులో న్యాయం కోసం పోరాడుతున్నది తన క్లయింట్ సునీతేనని పేర్కొన్నారు.
వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని సుప్రీం ను ఆశ్రయించడం నుంచి, కేసు విచారణ ఏపీ నుంచి మార్చాలని కోరడం వరకూ అన్నీ సునీత అభ్యర్థన మేరకే జరిగాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిజమైన బాధితులు సునీతారెడ్డి, ఆమె తల్లి మాత్రమేననీ, కృష్ణారెడ్డికి సంబంధం లేదనీ ఆయన వాదించారు. సునీత ఇంప్లీడ్ పిటిషన్ ను అనుమతించి సుప్రీం కోర్టు వచ్చే నెల 3లేదా 4 తేదీలలో విచారించనున్నట్లు తెలిపింది.