తల్లి హైదరాబాద్ కు అవినాష్ బెంగళూరుకు? మర్మమేంటి?
posted on May 19, 2023 @ 3:42PM
చిన్నప్పుడు మీరు దొంగాపోలీస్ ఆట ఆడే ఉంటారు. ఒక వేళ ఆడకపోయి ఉంటే.. ఆ ఆట ఎలా ఉంటుందో తెలియకపోతే.. ప్రస్తుతం జరుగుతున్న కడప ఎంపీ అవినాష్.. సీబీఐ ఎపిసోడ్ గమనిస్తే సరిపోతుంది. సరిగ్గా దొంగా పోలీస్ ఆటలాగే అవినాష్ సీబీఐ ఎపిసోడ్ సాగుతోంది. నిరాటంకంగా గత నాలుగు నెలల నుంచీ ఈ ఆట సాగుతూనే ఉంది. తొలుత సీబీఐ అవినాష్ కు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని నోటీసులు ఇస్తే.. అవినాష్ కోర్టులను ఆశ్రయించి, విచారణకు డుమ్మా కొట్టి.. కొన్ని సార్లు హాజరై ఇలా సీబీఐకి అందకుండా తిరిగారు.
ఆ తరువాత కోర్టులు అవినాష్ ను అరెస్టు చేసుకుని విచారించవచ్చని తేల్చిసిన తరువాత సీబీఐ పరుగులు మొదలు పెట్టింది. ఆ పరుగులు అవినాష్ ను అరెస్టు చేయడానికి కాకుండా చేయకుండా ఉండేందుకా అనిపించేలా సాగాయి. సరే చివరాఖరికి శుక్రవారం (మే19)న సీబీఐ అవినాష్ కు విచారణకు రావాలని నోటీసులు జారీ చేస్తే ఇదిగో వస్తున్నానంటూ చివరి క్షణంలో తల్లి అనారోగ్యం అంటూ డుమ్మా కొట్టారు. ఇక అక్కడ నుంచి ఛేజ్ మొదలైంది. అవినాష్ తల్లి పులివెందుల ఆస్పత్రిలో ఉన్నారంటూ అక్కడికి బయలుదేరిన అవినాష్ ను సీబీఐ వెంటాడింది. రెండు కార్లలో అవినాష్ వాహనాన్ని వెంబడించింది.
దారిలో అడుగడుగునా అవినాష్ అనుచరులు సీబీఐని నిలువరించేందుకు మోహరించారు. ఇదిలా ఉండగా పులివేందుల ఆస్పత్రిలో ఉన్న అవినాష్ తల్లిని మెరుగైన వైద్య చికిత్స కోసం అంటూ హైదరాబాద్ కు తరలిస్తుంటే తల్లితో పాటు అవినాష్ కూడా హైదరాబాద్ కు వస్తారని అంతా అనుకున్నారు.
అయితే అందుకు భిన్నంగా ఆయన బెంగళూరు వెళ్లారంటూ వార్తలు వస్తున్నాయి. అనారోగ్యంతో ఉన్న తల్లి కోసం విచారణకు డుమ్మా కొట్టానని చెబుతున్న అవినాష్ తల్లితో పాటు హైదరాబాద్ కు రాకుండా బెంగళూరు ఎందుకు వెళుతున్నారన్నది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అరెస్టును తప్పించుకోవడానికి, సీబీఐ కళ్లు గప్పి అజ్ణాతంలోకి వెళ్లడానికి అవినాష్ ఎత్తులు వేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ దొంగా పోలీస్ క్రీడను పోలిన సీబీఐ, అవినాష్ క్రీడ చివరకు ఎలా ముగుస్తుందో? నని సర్వత్రా ఆసక్తిగా గమనిస్తున్నారు.