ఇక అరెస్టే.. సీబీఐ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు?
posted on May 19, 2023 @ 2:02PM
అవినాష్ రెడ్డి ఏదో ఒక కారణం చూపి సీబీఐ విచారణకు డుమ్మా కొడుతుండడాన్ని సీబీఐ కేంద్ర కార్యాలయం సీరియస్ గా తీసుకుంది. అలాగే అవినాష్ అనుచరులు మీడియాపై దాడి చేయడాన్ని తేలికగా తీసుకోరాదనీ నిర్ణయించింది. తల్లి అనారోగ్యమంటూ ఒ లేఖ పంపి దానిపై స్పందన కోసం ఎదురు చూడకుండా అవినాష్ పులివెందులకు బయలుదేరి వెళ్లడంతో ఇక ఈ విషయాన్ని తేలికగా తీసుకోరాదని నిర్ణయించిన సీబీఐ ప్రధాన కార్యాలయం ఆయనను అదుపులోనికి తీసుకుని విచారించమని హైదరాబాద్ సీబీఐ కార్యాలయాన్ని ఆదేశించిందని తెలుస్తోంది.
అందుకే సీబీఐ అధికారులు రెండు వాహనాలలో అవినాష్ ను ఛేజ్ చేస్తున్నారని అంటున్నారు. అదే విధంగా సీబీఐ తనను ఎటూ అరెస్టు చేస్తుందన్న నిర్ణయానికి వచ్చిన అవినాష్ అరెస్టును తప్పించుకునేందుకే తనకు గట్టి పట్టున్న పులివెందులలో తలదాచుకునేందుకు వెళుతున్నారని పరిశీలకులు అంటున్నారు.
ఒక సారి అక్కడకు చేరుకుంటే అజ్ణాతంలోకి వెళ్లడం తేలిక అవుతుందన్నది ఆయన అభిప్రాయంగా చెబుతున్నారు. అందుకే తాడిపత్రి మీదుగా పులివెందుల రూటును ఎన్నుకున్నారనీ, దారిలో తన అనుచరుల ద్వారా సీబీఐని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశాలున్నాయనీ అంటున్నారు.