కటకటాలా.. పరారీయా.. అవినాష్ కు మిగిలిన దారులివే!?
posted on May 19, 2023 @ 4:18PM
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి అరెస్టు నుంచి తప్పించుకోవడానికి దారులన్నీ మూసుకుపోయాయి. ఇక అరెస్టు తప్పించుకోవాలంటే ఆయనకు ఉన్న ఒకే ఒక్క దారి అజ్ణాతంలోకి వెళ్లడమే. హైదరాబాద్ టు పులివెందుల, పులివెందుల టు హైదరాబాద్ భారీ కాన్వాయ్ తో ఆయన పెడుతున్న పరుగుతు చూస్తుంటే అవినాష్ ఆవినాష్ పరారీ ప్రణాళికల్లోనే ఉన్నారని అనిపిస్తోందంటూ పరిశీలకులు విశ్లేషణలు సైతం భావిస్తున్నారు.
అంతే కాదు మధ్యలో ఒక సారి తల్లిని హైదరాబాద్ కు తరలిస్తుంటే ఆయన బెంగళూరు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఎవరిని డైవర్ట్ చేయడానికి, ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ లీకులు ఇస్తున్నారో అర్ధం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు. తల్లి గుండెపోటుతో బాధపడుతుంటే.. మెరుగైన వైద్య చికిత్స అందించాలని నిజంగా భావిస్తే ఆమెను పులివెందుల నుంచి బెంగళూరు తరలించాలి. ఎందుకంటే పులివెందుల నుంచి హైదరాబాద్ 418 కిలోమీటర్లు అయితే, అదే పులివెందుల నుంచి బెంగళూరు 211 కిలోమీటర్లు. కనీసమైన ఇంగిత జ్ణానం ఉన్నవారెవరైనా తీవ్ర అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలంటే పులివెందుల నుంచి హైదరాబాద్ కు అదీ రోడ్డు మార్గంలో తరలించరు.
కచ్చితంగా బెంగళూరుకే తీసుకు వెడతారు. కానీ ఘనత వహించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం గుండెపోటుకు గురైన తన తల్లికి మెరుగైన వైద్యం కోసం అంబులెన్సులో రోడ్డు మార్గంలో పులివెందుల నుంచి హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు. ఆ అంబులెన్స్ వెంటే తాను కాన్వాయ్ లో హైదరాబాద్ కు వస్తున్నారు. ఆ కాన్వాయ్ ని తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులూ అనుసరిస్తున్నారు. ఉదయం నుంచీ ఒకదాని వెంట ఒకటిగా వేగంగా చోటు చేసుకుంటున్న సంఘటనలు క్రైం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించేవిగా ఉన్నాయి. అసలు తల్లిక అనారోగ్యం అంటూ ఆయన పులివెందులకు బయలు దేరిన క్షణం నుంచే ఆయనలోనూ ఆయన అనుచరులలోనూ అరెస్టు ఆందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అందుకే అవినాష్ పులివెందుల ప్రయాణాన్ని రిపోర్ట్ చేస్తున్న మీడియా ప్రతినిథులపై దాడి చేశారు.
పులివెందుల మార్గ మధ్యంలో అవినాష్ కాన్వాయ్ ను అనుసరిస్తున్న సీబీఐ వాహనాలపై దాడికి సైతం సమాయత్తమయ్యారు. సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలంటే స్థానిక పోలీసుల సహకారం అవసరం. ఏపీలో ఆ సహకారం అందదని వివేకా హత్య కేసు దర్యాప్తు ఏపీలో సాగుతున్న సమయంలోనే తేటతెల్లమైంది. కడపలో, పులివెందులలో సీబీఐ అధికారులకే రక్షణ లేని పరిస్థితి అప్పట్లో కళ్లకు కట్టినట్లు కనిపించింది. సీబీఐ వాహనాలపై దాడి, అధికారులకు బెదరింపులు, వారిపైనే ప్రైవేటు కేసులు ఇలా కేసు దర్యాప్తు అడుగు ముందుకు కదలకుండా నిలువరించిన పరిస్థితి. కేసు విచారణ ఏపీ నుంచి తెలంగాణకు మారిన తరువాతే స్పీడందుకుంది. సూత్రధారులు, పాత్ర ధారుల నిగ్గు తేల్చే దిశగా వేగంగా కదిలింది.
దాంతో ఇక బెదరింపులకు అవకాశం లేదని గ్రహించిన అవినాష్ అండ్ కో.. కేసు దర్యాప్తు వేగం తగ్గించేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అక్కడ తాత్కాలికంగానే ఊరట లభించింది. సిబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోజాలమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పడమే కాకుండా.. అవినాష్ అరెస్టుకు ప్రతిబంధకాలేమీ లేవని సీబీఐకి రూట్ క్లియర్ చేసింది. దీంతో దారులన్నీ మూసుకుపోయిన అవినాష్ ఇప్పుడు రోడ్ల మీద పరుగులు తీస్తున్నారు. ఆగితే అరెస్ట్ తప్పదన్న నిర్ణయానికి వచ్చారు. ఎంత ప్రయత్నించినా ఏం చేసినా ఆయనకు సీబీఐ ఎదుట హాజరై అరెస్టు కావడం.. లేదా అజ్ణాతంలోకి వెళ్లి దాక్కోవడం అన్న రెండు దారులే మిగిలాయని అంటున్నారు. ఏపీలో అరెస్టు చేయడానికి అవసరమైన బందోబస్తు అక్కడి పోలీసుల నుంచి దక్కే అవకాశం లేకపోవడంతో ఆయనను హైదరాబాద్ చేరనిచ్చి అక్కడ సీబీఐ అరెస్టు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఒక వేళ అక్కడ కూడా సరైన భద్రతా చర్యలు లేవని భావిస్తే కేంద్ర బలగాలను రప్పించైనా అరెస్టు చేయాలన్న పట్టుదలతో సీబీఐ ఉందని, అందుకు సీబీఐ ప్రధాన కార్యాలయం నుంచి అవినాష్ ను అరెస్టు చేయాలన్న ఆదేశాలు రావడమే నిదర్శమని పరిశీలకులు చెబుతున్నారు. అవినీష్ గత నాలుగు నెలలుగా ఆడుతున్న దోబూచులాట కారణంగా దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ తెలుగు రాష్ట్రాల ప్రజల ముందు ఒక జోకర్ గా నిలబడే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అవినాష్ ను ఎలాగైనా అరెస్టు చేసి తమ ప్రతిష్ట కాపాడుకోవాలని సీబీఐ భావిస్తోంది.