అవినాష్ కు ఊరట.. బుధవారం వరకూ నో అరెస్ట్

తెలంగాణ హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ పై సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పు బుధవారానికి వాయిదా పడింది. అంత వరకూ అవినాష్ ను అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు అదేశించింది. అంతకు ముందు వరుసగా రెండో రోజు అవినాష్  ముందస్తు బెయిలు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. అవినాష్ ను  కస్టోయిల్ విచారణ చేయాల్సిందేనని సీబీఐ అధికారులు విస్పష్టంగా చెప్పారు.   గురువారం (మే26)ఇదే కేసులో అవినాష్ తరఫు న్యాయవాదులు, అలాగే సునీత తరఫు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు శుక్రవారం (మే27) సీబీఐ తరఫు వాదనలు వింది. ఈ సందర్భంగా కోర్టు సీబీఐ తీరు పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. అవినాష్ ను ఇన్నాళ్లూ ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. కనీసం ఆయన ఫోన్ ను కూడా ఎందుకు స్వాధీనం చేసుకోలేదని నిలదీసింది. ఆ ప్రశ్నలన్నిటికీ సీబీఐ తరఫు న్యాయవాదులు సమాధానాలు ఇచ్చారు. చివరికి తీర్పు బుధవారం వెలువరించనున్నట్లు కోర్టు చెప్పింది. అయితే బుధవారం అవినాష్ ను విచారణకు పిలుస్తామని సీబీఐ తరఫు న్యాయవాదులు పేర్కొనగా, అందుకు అవినాష్ తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. తల్లి ఆస్పత్రిలో ఉన్నందున ఆయన రాలేరని పేర్కొన్నారు. దీంతో కోర్టు తుది తీర్పును బుధవారం వెలువరిస్తామని పేర్కొంటూ అంత వరకూ అవినాష్ ను అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది. మొత్తం మీద కోర్టు తీర్పు అవినాష్ రెడ్డికి అనుకూలంగానే వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో అవినాష్ రెడ్డి సీబీఐకి రాసిన లేఖలో కూడా మే 27(శనివారం) తరువాత సీబీఐ ఎప్పుడు రమ్మంటే అప్పుడు విచారణకు వస్తానని పేర్కొన్నారు. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ఆయన (బుధవారం) మే 31 వరకూ విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ రోజు ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ పై సుప్రీం కోర్టు తీర్పు వెలవరించనుంది. ఏది ఏమైనా ఈ ముందస్తు బెయిలు పిటిషన్ విచారణ సందర్భంగా పలు కీలక, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో సీఎం జగన్ పేరు ప్రస్తావనకు వచ్చింది. వివేకా హత్య విషయం అవినాష్ ద్వారా జగన్ కు ప్రపంచానికి తెలియడానికి ముందే తెలుసునని తమ విచారణలో వెల్లడైందనీ, దానిని నిర్ధారించుకోవాలంటే అవినాష్ ను అరెస్టు చేసి విచారించాల్సిందేనని సీబీఐ విస్పష్టంగా పేర్కొంది. అలాగే హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందనీ, హత్య జరిగిన వెంటనే అవినాష్ వాట్సాప్ కాల్స్ చేశారనీ నిర్ధారణ అయ్యిందనీ, ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలుసుకోవాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. ఆ సమయంలో కోర్టు జోక్యం చేసుకుని ఇంత కాలం అవినాష్ ఫోన్ స్వాధీనం ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించింది. చివరకు అవినాష్ బెయిలు పిటిషన్ పై తీర్పు బుధవారం(మే31)కి వాయిదా వేసింది. 

ఎవరి స్క్రిప్టు ఎవరు చదువుతారు?

అంతా నా యిష్టం.. అంతా ఎడాపెడా ఏం చేసినా ఏం చేసినా అడిగేదెవడ్రా నాయిష్టం.. అంటూ తెలుగు సినిమాలో ఓ పాట ఉంది.  అచ్చం అలాగే గత నాలుగేళ్లుగా ఏపీలో జగన్ సర్కార్ తీరు కొనసాగుతోంది. ఆ పార్టీ శ్రేణులూ, నాయకులు అలాగే వ్యవహరిస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ సైతం అందుకు వత్తాసు పలుకుతున్నట్లుగానే వ్యవహరించారు. విపక్ష నేతలను కేసుల పేరుతో అర్ధరాత్రులు అరెస్టు చేసినా ఎవరూ మాట్లాడడానికి వీల్లేదన్నట్లుగా సాగిన అధికార పార్టీ నేతల తీరు తీరా తమదాకా వచ్చేసరికి రివర్స్ అయిపోయింది. తమపై ఉన్న కేసులు కోర్టుల్లో విచారణకు వచ్చినా సహించమన్నట్లుగా ఆ పార్టీ నాయకుల తీరు మారింది. తమ పార్టీకి చెందిన వారికి వ్యతిరేకంగా ఏం జరిగినా కుట్ర అనడం ఆనవాయితీ అయిపోయింది. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఈ విషయంలో అందరి కంటే ముందున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి, ముఖ్యమంత్రి జగన్ సొంత బాబాయ్ హత్య కేసులో నాలుగేళ్ల తరువాత ఆ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయంపై సీబీఐ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో ముఖ్యమంత్రి జగన్ పేరు ఉండటం వెనుక భారీ కుట్ర ఉందని సజ్జల ఆరోపిస్తున్నారు. ఎవరో రాసిన స్క్రిప్టునే సీబీఐ కౌంటర్ అఫిడవిట్ లో మెన్షన్ చేసిందని భాష్యం చెబుతున్నారు.  అవినాష్ రెడ్డి సీబీఐ విచారణను తప్పించుకోవడానికి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిని షెల్టర్ గా చేసుకుని నాలుగు రోజులకు పైగా  తలదాచుకోవడంలో తప్పు లేదు కానీ, ఆయనను అరెస్టు చేసి విచారించాల్సిన అవసరం ఉందని సీబీఐ కోర్టుకు నివేదించడం మాత్రం కుట్ర అంటున్నారు. వివేకా హత్య కేసులో  ఇప్పటికే జగన్ ఓఎస్ డీని సీబీఐ విచారించింది. తెలంగాణ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ లో ఆ విషయాన్ని ప్రస్తావించి అవినాష్ ద్వారా జగన్ కు  తెలిసిందన్న అనుమానం ఉందని కూడా సీబీఐ ఆ అఫిడవిట్ లో విస్పష్టంగా చెప్పింది.  అయినా కూడా సజ్జల సీబీఐ అలా ఎలా  అంటుంది.. మేం ఏం అంటే అదే చెప్పాలిగా అన్నట్లుగ మాట్లాడుతున్నారు. సీబీఐ దర్యాప్తు వైసీపీ నేతలేం చెబితే అలా జరగాలన్నట్లుగా సజ్జల తీరు ఉంది. ఇంత కాలం సీబీఐ తీరు అలాగే సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ అవినాష్ దగ్గరకు వస్తోందంటే జగన్ రెక్కలు కట్టుకుని హస్తినలో వాలిపోయేవారు. వెంటనే సీబీఐ అవినాష్ కు దూరం జరిగేది. ఇలా సాగుతూ వచ్చిన దర్యాప్తు ఇప్పుడు అవినాష్ ను అరెస్టు చేసే వరకూ రావడం చూస్తుంటే..  ఇప్పటి వరకూ జగన్ మాట విని కాపాడిన శక్తులు కూడా అశక్తులయ్యేంతగా అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసులో ఇరుక్కు పోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

జగన్ సర్కార్.. సలహాదారుల నియామకాల్లో తగ్గేదేలే!

నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఏపీ సర్కార్ తీరు ఉంది.  సలహాదారుల నియామకంపై  కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, ఆ నియామకాల చట్టబద్ధతను తేలుస్తామని చెబుతున్నా ఏపీ సర్కార్ పట్టించుకోవడం లేదు. బేఖాతరు చేస్తోంది. ఖజానాపై భారం పడుతోందని తెలిసా.. ఇష్టారీతిన సలహాదారుల నియామకం చేపడుతోంది. జగన్ సర్కార్ తాజాగా  మరో సలహాదారుడ్ని నియమించింది. మైనార్టీశాఖ సలహాదారుగా బాగ్దాదిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటూ ఆ పదవిలో కొనసాగగుతారు. గత వారం కూడా మైనారిటీ సంక్షేమశాఖలో క్రైస్తవ వ్యవహారాలకు సలహాదారుడ్ని సర్కార్ నియమించింది.  వారం వ్యవధిలో ఒకే శాఖకు ఇద్దరు సలహాదారుల్ని నియమించడం గమనార్హం. గతంలో హైకోర్టు సలహాదారుల నియమాంకపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్తవారి నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.   మైనార్టీ సంక్షేమ శాఖకు కొ ముఫ్తీ సయ్యద్‌ మొహమ్మద్‌ అలీ బాగ్దాదిని సలహాదారుగా నియమించింది ప్రభుత్వం.. ఈయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ శాఖలో రెగ్యులర్‌ అధికారులను నియమించని ప్రభుత్వం.. నలుగురు సలహాదారులను నియమించిందనే విమర్శలు ఉన్నాయి.  అంతేకాదు ఈ నెల 18న కూడా మైనారిటీ సంక్షేమశాఖ పరిధిలోని క్రైస్తవ వ్యవహారాలకు సంబంధించి మద్దు బాలస్వామిని సలహాదారుగా నియమించింది ప్రభుత్వం. వారం కూడా కాకుండనే మరో సలహాదారుడ్ని ప్రభుత్వం నియమించింది. వీరిద్దరే కాకుండా ఇంతకు ముందు నుంచే జియావుద్దీన్‌, హబీవుల్లాలు సలహాదారులుగా కొనసాగుతున్నారు. ఈ నియామకంతో మైనార్టీ వ్యవహారాలకు సలహాదారుల సంఖ్య నాలుగుకు చేరింది.  మైనారిటీ సంక్షేమశాఖకు సలహాదారులుగా కొనసాగుతున్నవారికి  మంచి జీతభత్యాలు ఉన్నాయి. జియావుద్దీన్‌, హబీవుల్లాలకు కేబినెట్‌ హోదాతో పాటుగా నెలకు రూ.3.50 లక్షలు.. ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. క్రైస్తవ వ్యవహారాల సలహాదారుగా నియమించిన బాలస్వామి.. ఇప్పుడు నియమించిన మహమ్మద్‌ అలీ బాగ్దాదీలకు జీతభత్యాలకు సంబంధించి ఉత్తర్వులు ఇంకా రాలేదు. సలహాదారుల నియామకానికి సంబంధించి గతంలో హైకోర్టు ప్రభుత్వం తీరును తప్పుబట్టింది.. కొన్ని సీరియస్ కామెంట్స్ చేసింది. అయినా కూడా  మరో ఇద్దరిని సలహాదారులుగా  నియమించడం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొండవీటి చాంతాడులా ఉన్న ఏపీ సర్కార్ సలహాదారుల జాబితా కొండవీటి జాంతాడంత ఉంటుంది.  నియమితులైన సలహాదారులకు.. కేబినెట్ హోదా ఇవ్వడం.. భారీగా జీతభత్యాలు.. సకల సౌకర్యాలు అందించడం.. అసలే అప్పుల ఆంధ్రగా మారిపోయిన రాష్ట్రానికి తలకు మించి భారం అవుతోందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.   

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో తిరుమల కొండపైకి శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. శుక్రవారం శ్రీవారిని 79వేల 486 మంది భక్తులు దర్శించుకున్నారు.  40వేల 250 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 72లక్షల రూపాయలు వచ్చింది.  ఇక శనివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో  కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలేన్లు టీబీసీ వరకూ  వచ్చాయి. కాగా టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది.   

కేసీఆర్ మద్దతు కోసం కేజ్రీవాల్.. బీఆర్ఎస్ అధినేత స్పందనేంటి?

ఢిల్లీలో తన అధికారాల్ని కేంద్రం లాగేసుకుంటున్న నేపథ్యంలో  ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ బీజేపీయేతర పక్షాల మద్దతు కూడగట్టేందుకు సమాయత్తమౌతున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు శనివారం (మే 27) రానున్నారు.  పార్లమెంట్‌లో ఈ ఆర్డినెన్స్‌ను బీఆర్ఎస్ వ్యతిరేకించాలని ఆయన కేసీఆర్ ను కోరనున్నారు.  ఇప్పటికే ఇదే విషయంపై కేజ్రీవాల్  పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేలను కలిసి చర్చించారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌తో కూడా సమావేశం కానున్నారు. కాంగ్రెస్ తో సహా బీజేపీని వ్యతిరేకించే పక్షాలన్నీ ఇప్పటికే ఈ ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాయి. ఇటీవల సుప్రీం కోర్టు బ్యూరోక్రాట్‌ల బదిలీలు,  నియామకాలపై తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో కేంద్రం పాత్ర కాదు, ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వమే  పూర్తి నియంత్రణ కలిగి ఉంటుందని ఆదేశాలు ఇచ్చింది.  దీనిపై ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల ట్రాన్స్‌ఫర్, పోస్టింగ్‌లపై  సర్వాధికారాలు మళ్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఢిల్లీలో పాలనాధికారాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే ఉంటుందని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసి సంగతిని కేజ్రీవాల్‌ గుర్తు చేస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన ఎనిమిది రోజులకు కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి లెఫ్టినెంట్ గవర్నర్ కి అధికారం కట్టబెట్టిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈ ఆర్జినెన్స్ పార్లమెంట్ లో చట్టం అయితే ప్రజాస్వామ్యానికి ఇబ్బంది అని కేజ్రీవాల్ అంటున్నారు. రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజార్టీ లేదు. అందుకే అక్కడ పాస్ కావాలంటే ఇతర పార్టీల మద్దతు కావాలి. బీఆర్ఎస్ గతంలో బీజేపీ విషయంలో దూకుడుగా ఉన్నా… ఇటీవల సైలెంట్ అయింది. దీంతో కేజ్రీవాల్  విజ్ణప్తికి బీఆర్ఎస్ స్పందన ఏ విధంగా ఉంటుందన్నదానిపై  సర్వత్రా ఆసక్తి నెలకొంది.    

జగన్ కు ఓటమి భయం.. పులివెందులకు రాం..రాం!?

వైనాట్ 175 నుంచి సొంత నియోజకవర్గం పులివెందులలోనే గెలుపు భయం వరకూ జగన్ తిరోగమన ప్రస్థానం వేగంగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ స్థానం కూడా ప్రతిపక్ష పార్టీల ఖాతాలో పడకూడదన్నట్లుగా ఉన్న వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ ధీమా మాయమైంది.  సొంత నియోజకవర్గం.. పులివెందుల్లో నే ఆయన ఎదురీదాల్సిన పరిస్థితి నెలకొంది.  ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అదే స్థానం నుంచి బరిలోకి దిగితే ఓటమిని   ప్రమాదం ఉందన్న భయంతో  ఉమ్మడి కడప జిల్లాలోని మరో నియోజకవర్గం నుంచి పోటీ లోకి దిగాలని జగన్ యోచిస్తున్నట్లు వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.   అందులో భాగంగా జమ్మలమడుగు, కమలాపురం, కడప  అసెంబ్లీ స్థానాలపై ఆయన ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. ఆ క్రమంలో ఈ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఐ ప్యాక్‌ బృందాన్ని జగన్ కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ సర్వే కోసం ఇప్పటికే  ఐ ప్యాక్ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించినట్లు సమాచారం.  వైయస్ ఫ్యామిలీకి పులివెందుల కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి నియోజకవర్గంలో  వివేకా దారుణ హత్యకు గురికావడం.. అనంతరం చోటు చేసుకొన్న  పరిణామాల నేపథ్యంతో పాటు.. సదరు నియోజకవర్గం కడప ఎంపీ  అవినాష్ రెడ్డి కుటుంబం గుప్పిట్లోకి వెళ్లిపోయిందని.. ఆ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు పూర్తిగా తారుమారు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. దాంతో  జగన్ నియోజకవర్గం మార్చాలనే నిర్ణయానికి వచ్చారనీ వైసీపీలోనే ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది.    వివేకా హత్య కేసులో ఇప్పటికే వైయస్ భాస్కరరెడ్డి అరెస్ట్ అయ్యారు. నేడో రేపో వైయస్ అవినాష్ రెడ్డి సైతం కటకటాల పాలయ్యే అవకాశాలున్నాయి. ఆ క్రమంలో సొంత వారి నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైతే పరిస్థితి ఏమిటనే భావనతోనే పార్టీ అధినేత పులివెందుల నుంచి కాకుండా పక్కనే ఉన్న మూడు నియోజకవర్గాలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.    అలాగే  వివేకా హత్య కేసులో.. వైయస్ ఫ్యామిలీ హస్తం ఉందనే  విధమైన బలమైన ముద్ర ఇప్పటికే నియోజవకర్గ ప్రజలలోకి  చాలా బలంగా వెళ్లిపోవడం, దీంతో ఆ ఫ్యామిలీలో చీలికలు రావడం... అలాగే ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చినట్లు కొట్టొచ్చినట్లు కనిపించడంతో జగన్ పులివెందుల నుంచి పోటీ చేస్తే గెలుపు అనుమానం అన్న భావన బలంగా వ్యక్తం అవుతోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం జగన్ సొంత ఇలాకా.. పులివెందుల్లో సైతం టీడీపీ తన సత్తా  చాటడంతో...  స్థానికుడు భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ఈ ఎన్నికల్లో గెలుపొందారని చెబుతున్నారు. అలాగే పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బిటెక్ రవి సైతం పార్టీ బలోపేతం కోసం ఎంత కష్టపడాలో అంతా  కష్టపడుతోన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో  జగన్ తన నియోజకవర్గాన్ని మార్చుకునేందుకు పక్కా ప్రణాళికలు  సిద్దం చేసుకొన్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. 

తాడేపల్లి ప్యాలెస్ డొంకలు కదులుతున్నాయా?

వివేకా హత్య కేసులో తాడేపల్లి ప్యాలెస్ డొంకలు కదులుతున్నాయా? అంటే సీబీఐ శుక్రవారం(మే26) తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ ఔననే అంటోంది. అవినాష్ సీబీఐ విచారణకు సహకరించకపోవడం, అరెస్టును తప్పించుకోవడానికి ఉన్న దారులన్నీ ఉపయోగించుకుంటూ.. చివరకు ఆ దారులన్నీ మూసుకుపోయిన తరువాత అనుచరులు, పోలీసులను అడ్డుపెట్టుకుని కర్నూలు విశ్వ భారతి ఆస్పత్రిలో షెల్టర్ పొంది.. ముందస్తు బెయిలు విచారణ వేకేషన్ బెంచ్ చేపట్టేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంను ఆశ్రయించడం తోలిపిందే. ఒక ఎంపి, అదీ అధికార పార్టీ ఎంపీ కేంద్ర దర్యాప్తు సంస్థను ఇలా ముప్పు తిప్పలు పెట్టడమేమిటన్న ఆనుమానాలు అందరిలో వ్యక్తమయ్యాయి. చివరకు తెలంగాణ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో ఈ అనుమానాలకు సమాధానాలు దొరికాయి. ఆ కౌంటర్ అఫిడవిట్ లో సీబీఐ జగన్ పేరు ప్రస్తావించింది. వివేకా హత్య గురించి జగన్ కు ప్రపంచానికి తెలియడం కంటే ముందే తెలుసునన్నది తమ అనుమానమని, ఆ విషయాన్ని అవినాష్ రెడ్డే ఆయనకు తెలిపాడని సీబీఐ పేర్కొంది. వివేకా హత్యను మందుగా చూసినట్లుగా చెబుతున్న ఎంవీ కృష్ణారెడ్డి ఆ విషయాన్ని బయటకు వెళ్లడించడానికి ముందే..   హత్య జరిగిందన్న విషయాన్ని అవినాష్ జగన్ కు చెప్పారా అనేది దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ తన అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొంది.   శుక్రవారం సీబీఐ తప వాదనలు వినిపించలేదు. అవినాష్ రెడ్డి, సునీత తరపు లాయర్లు వాదనల అనంతరం కోర్టు అవినాష్ ముందస్తు బెయిలు విచారణను శనివారం (మే 27)కు వాయిదా వేసింది. దీంతో శనివారం(మే27) సీబీఐ తరపు లాయర్లు వాదనలు వినిపించనున్నారు. ఈ సందర్భంగా వివేకా కేసులో జగన్ అంశంపై మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారుజామున నాలుగున్నర గంటలకే జగన్  హత్య గురించి.. తనతో పాటు సమావేశంలో ఉన్న వారికి చెప్పారన్న ప్రచారం జరిగింది. ఆ నలుగురిలో ఒకరైన మాజీ సీఎస్, ప్రభుత్వ సలహాదారు కల్లాం అజేయరెడ్డి ఇటీవల మీడియా సమావేశం పెట్టారు. తాను సీబీఐకి వాంగ్మూలం ఇచ్చానని వెల్లడించారు కూడా. అలాగే జగనే తమకు వివేకానందరెడ్డి చనిపోయారని చెప్పారని..అయితే గుండెపోటా కాదా అన్నది మాత్రం చెప్పలేదన్నారు. మరో వైపు ఉదయమే వివేకా హత్య గురించి బయట ప్రపంచానికి తెలియక ముందే అవినాష్ రెడ్డి .. జగన్‌, భారతి పీఏలకు ఫోన్లు చేసి.. మాట్లాడారని గుర్తించిన సీబీఐ గుర్తించి వారినీ విచారించింది. ప్రశ్నించింది. దీంతో శనివారం (మే 28) తెలంగాణ హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ విచారణలో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇలా ఉండగా  సీఎం జగన్మోహన్ రెడ్డి  ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇక  అవినాష్ రెడ్డి తన తల్లిని హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించి అక్కడే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి ముందు సీన్ హైదరాబాద్ ఆస్పత్రి ముందు రిపీట్ అవుతుందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.  ఇందుకూ కారణాలు లేకపోలేదు.   వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా కడప ఎంపీ  అవినాష్ రెడ్డికి నోటీసులు ఇస్తే చాలు ఏపీ సీఎం జగన్ తన పర్యటనలను, కార్యక్రమాలను రద్దు చేసేసుకుంటారు. గతంలో   మూడుసార్లు అదే జరిగింది.  అందులో రెండు సార్లు ఆయన హుటాహుటిన హస్తిన బయలుదేరి వెళ్లారు. అలా వెళ్లిన ప్రతి సారీ సీబీఐ దర్యాప్తులో వేగం మందగించింది.  ఇక ఈ నెల 19 నుంచి అవినాష్ సీబీఐతో టామ్ అండ్ జెర్రీ ఆట ఆడుతున్నారు. మే 19న ఆయన సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా తల్లి అనారోగ్యం కారణంతో విచారణకు డుమ్మా కొట్టారు. సరే మే 22న విచారణకు రావాలని సీబీఐ మరో సారి నోటీసులు ఇస్తే వాటినీ ఖాతరు చేయలేదు. సుప్రీం ను ఆశ్రయించి హైకోర్టులో పెండింగ్ లో ఉన్న తన ముందస్తు బెయిలు పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకూ సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశించాలని కోరారు. అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేయకుండానే.. ముందస్తు బెయిలు పిటిషన్ విచారించి ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ లోగా అవినాష్ సీబీఐకు రాసిన లేఖలో తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేననీ, మే 27 తరువాత ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానంటూ లేఖ రాశారు. ఆ లేఖే మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఎందుకంటే జగన్ ముందుగా శుక్రవారం( మే26) నుంచి మూడు రోజుల పాటు హస్తిన పర్యటనలో ఉంటారు. అంటే ఆయన హస్తిన పర్యటనకూ అవినాష్ సీబీఐ విచారణకు హాజరు కాకపోవడానికి లింకు ఉందని పరిశీలకులు గత సంఘటనలను ఉటంకిస్తూ విశ్లేషిస్తున్నారు. జగన్ ఏ కారణాలు చెప్పి హస్తిన వెళ్లినా.. ఆయన పర్యటన లక్ష్యం మాత్రం ఎలాగోలా సీబీఐ అరెస్టు నుంచి అవినాష్ ను బయటపడేయడమేనని పరిశీలకులు అంటున్నారు. ఆ పని  జగన్ చేసుకు వస్తారన్న ఆశతోనే మే 27 వరకూ విచారణకు హాజరు కాలేనని అవినాష్ సీబీఐకి లేఖ రాశారని అంటున్నారు. తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసి ఇంత కాలమైనా ఇప్పటి వరకూ ఆయనకు బెయిలు కోసం కనీసం దరఖాస్తు కూడా చేయని అవినాష్ రెడ్డి, జైలులో ఉన్న తండ్రిని ఒక్కసారి కూడా ములాఖత్ ద్వారా కలవని అవినాష్ రెడ్డి.. తన దాకా వచ్చే సరికి మాత్రం  బెంబేలెత్తిపోతున్నారు. జైలులో ఉన్న అవినాష్ రెడ్డి తండ్రి అస్వస్థతకు గురి కావడంతో ఆయనకు ఉస్మానియాలో చికిత్సకు శుక్రవారం (మే26) తీసుకువచ్చి తిరిగి జైలుకు తరలించారు. ఆ సందర్భంగా కూడా అవినాష్ కనీసం ఆయనకు చూడటానికి ఉస్మానియాకు వెళ్లలేదు. ఇవన్నీ చూస్తుంటే అవినాష్ జగన్ హస్తిన పర్యటనపై చాలా ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కానీ ఇప్పుడు సీబీఐ తన అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ లో స్వయంగా తన పేరే ప్రస్తావించడంతో జగన్  అవినాష్ ను కాపాడేందుకు ఢిల్లీ పెద్దల వద్ద ఒక వేళ ఏమైనా ప్రయత్నాలు చేసినా అవి ఫలిస్తాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. 

తెలంగాణలో నెక్ట్స్ సీఎం సీతక్కే?!

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎంగా సీతక్కే అవుతారని ఆ పార్టీలో మెజారిటీ భావిస్తోంది. అందుకు తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులే కారణమని చెబుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.  ఈ సారి ఎలాగైనా తెలంగాణలో కేసీఆర్ పాలనకు చెక్ పెట్టి.. కాషాయం జెండా రెపరెపలాడించాలని కేంద్ర పెద్దల మార్గదర్శనంలో... టీ బీజేపీ నేతలూ ఒక ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. అదే విధంగా  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ  సైతం ప్రజల్లోకి నేరుగా దూసుకుపోతోంది. ఆయన అధ్యక్షతన జరుగుతోన్న సభలు, సమావేశాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్,  ఆయన ఫ్యామిలీపై నేరుగా విమర్శలు గుప్పించ గల సత్తా తెలంగాణలో ఎవరికైనా ఉందా? అంటే అది రేవంత్ ఒక్కరే అన్న భావన ప్రజలలో బలంగా వ్యక్తమౌతోంది.  అదీ కాకుండా  రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్లు అన్నట్లుగా మారిపోయింది. అలాంటి పార్టీ ఇప్పుడు జవసత్వాలు పుంజుకుని  బీఆర్ఎస్, బీజేపీలకు దీటుగా పోటీగా నిలిచిందంటే అందుకు కారణం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వమేనని పార్టీ అధిష్ఠానం సైతం నమ్ముతోంది. వాస్తవానికి   తెలంగాణ తెచ్చింది  తానేనని కేసీఆర్ చెప్పుకుంటున్నా.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది మాత్రం అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ  అన్న విషయాన్ని ప్రజలకు చేరువ చేయలేకపోవడమే అప్పటి పార్టీ రాష్ట్ర నాయకత్వం తప్పిదమని అప్పట్లోనే కాదు ఇప్పుడూ విమర్శలు ఉన్నాయి.  రాష్ట్రంలో కాంగ్రెస్ అన్ని విధాలుగా దిగజారిపోయిన కాంగ్రెస్ ను తెలుగుదేశం పార్టీ వీడి వచ్చిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు సాగించారు. చాలా వరకూ సక్సెస్ అయ్యారు కూడా. అయితే వేరే పార్టీ నుంచి వ్యక్తికి పీసీసీ పగ్గాలు కట్టబెట్టడాన్ని జీర్ణించుకోలేని ‘సీనియర్లు’ ఆయనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఒక దశలో ఆయన రాజీనామాకు కూడా సిద్ధమయ్యారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే అధిష్ఠానం రేవంత్ కు అనుకూలంగా నిలబడటంతో రేవంత్ నిలదొక్కుకున్నారు. పార్టీని నిలబెట్టారు. ఈ క్రమంలోనే కర్నాటక ఫలితాల తరువాత ఒక్క సారిగా కాంగ్రెస్ పార్టీలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. రేవంత్ దూకుడును నియంత్రించుకున్నారు. సీనియర్లు ధిక్కారాన్ని తగ్గించుకున్నారు. ముందు రాష్ట్రంలో అధికారం ఆ తరువాతే అధికారం, పెత్తనం గురించి ఆలోచిద్దాం అన్న ధోరణి కనబరుస్తున్నారు. కర్నాటకలో డీకే , సిద్ధూ ఐక్యంగా పార్టీని విజయపథంలో నడిపించిన తీరును అనుకరించాలని నిర్ణయించుకున్నారు.  ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నేత ఎవరన్న దానిపై పార్టీలో జరిగిన చర్చలో సీతక్క పేరు తెరమీదకు వచ్చిందని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు ఎమ్మెల్యే సీతక్క  మావోయిస్టుగా ఉన్నా  అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి హయాంలో జన జీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. అనంతరం  తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన.. అనంతరం చోటు చేసుకొన్న వరుస పరిణామాల నేపథ్యంలో తెలంగాణలోని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ గూటికి చేరారు.   ఆ కొద్ది రోజులకే రేవంత్‌కి పీసీసీ చీఫ్ కట్టబెట్టడంపై అప్పటికే పార్టీలోని సీనియర్లు, సూపర్ సీనియర్లు.. అంతా అలిగి  ధిక్కార స్వరం వినిపించిన నేపథ్యంలో సీతక్క, వేం నరేంద్రరెడ్డి తదితరులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతూ రేవంత్ నాయకత్వానికి అండదండగా మద్దతుగా నడుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరినా రేవంత్ విషయంలో వ్యక్తమైన వ్యతిరేకత కాంగ్రెస్ పాత కాపుల నుంచి సీతక్కకు ఎదురు కాలేదు. ఎందుకంటే  గతంలో ఆమె మావోయిస్టుగా ఉన్నప్పడూ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సైతం ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. అలాగే కరోనా సమయంలో ఆమె ప్రజలమధ్యే నిత్యం ఉంటూ.. వారి కోసం అహర్నిశలు కష్టపడ్డారు....  ఎవరూ బయటకు అడుగుపెట్టేందుకు కూడా సాహసం చేయని ఆ సమయంలో నెత్తిన ఆహార పదార్థాలు, ఔషదాలు గంప పెట్టుకుని కొండల్లో కోనల్లో ఉంటున్న గిరిజనులకు అందజేయడానికి మైళ్లకు మైళ్లు ఒక్కర్తే నడిచి వెళ్లారు. ఇప్పుడూ ఆమె జనం కష్ట నష్టాలకు వెంటనే స్పందించి ఆదుకోవడానికి ముందుంటారు. గత ఏడాది సంభవించిన భారీ వరదల సమయంలో వరద బాధితులను ఆదుకోవడానికి ఎంతో సాహసోపేతంగా పడవపై వరద నీటిలో బాధితుల వద్దకు వెళ్లిన సందర్భాలున్నాయి.  అంతే కాదు వాదాలకు, వివాదాలతో సంబంధం లేకుండా జనం మధ్యే ఉండే ఆమె పార్టీలో అందరికీ అభిమానపాత్రురాలే అంటారు. ఈ నేపథ్యంలోనే  2023 ఏడాది చివర జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి.. అత్యధిక స్థానాలను గెలుచుకొంటే.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీతక్క పేరు పరిశీలించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 

ఈ అబ్బాయి చాలా మంచోడు.. అల్లుడికి అత్త కితాబు

సొంత అన్న కొడుకే  ముఖ్యమంత్రిగా ఉన్నారు. హత్య జరిగి నాలుగేళ్ల అయినా... ఆ హత్యకు స్కెచ్ వేసిన సూత్రదారులు వీళ్లేనంటూ.. పాత్రదారుల్లో ఒకరు అప్రూవర్‌గా మారి సీబీఐ ఎదుట స్వయంగా వాంగ్మూలం ఇచ్చినా.. నిందితులు ఇంత వరకు అరెస్ట్ కాలేదు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ సైతం.. ఈ కేసును ఛేదించ లేక.. నిసత్తువతో చతికిలి పడిపోయినట్లుగా వ్యవహరిస్తోంది. మరోవైపు ఈ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే.. అత్యంత దారుణంగా హత్యకు గురైన వివేకానందరెడ్డికి బంధాలు, అనుబంధాలు, అక్రమ సంబంధాలు, ల్యాండ్ సెటిల్‌మెంట్లు అంటగడుతూ.. ఆయన క్యారెక్టర్ అసిసినేషన్ చేసేందుకు ఏ మాత్రం వెనకాడకుండా ఆరోపణలు గుప్పిస్తున్నారు.  వైఎస్  ఫ్యామిలీ నుంచి ఇలా ఒకరి తర్వాత ఒకరు తెరపైకి వచ్చి.. తమ తమ అభిప్రాయాలు వ్యక్తీకరిస్తున్నారు. దీంతో వివేకా హత్య కేసు.. ఓటీటీలో రిలీజ్ అయిన ఓ పెద్ద సైజ్ వెబ్ సిరీస్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉందనే ఓ అభిప్రాయం  ఉమ్మడి కడప జిల్లా వాసుల్లో వ్యక్తమవుతోంది. తాజాగా వైయస్ ఫ్యామిలీ నుంచి వైయస్ వివేకా సొంత సోదరి వైయస్ విమలమ్మ.. మీడియా ముందుకు వచ్చి గొంతు సవరించుకొన్నారు. ఆ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైయస్ అవినాష్ రెడ్డి అమాయకుడని.. చిన్ననాటి నుంచి మైల్డ్‌గా ఉండేవాడని.. చెప్పుకొచ్చారు. అలాగే ఈ హత్య కేసులో అసలు సిసలు సూత్రదారులు మాత్రం ప్రస్తుతం నడిరోడ్డుపై విచ్చలవిడిగా తిరుగుతోన్నారని.. ఈ కేసుతో ఏ మాత్రం సంబంధం లేని వారు మాత్రం జైళ్లలో   మగ్గుతోన్నారని ఆమెఆవేదన వ్యక్తం చేశారు.  మరో వైపు తన తండ్రి హత్య కేసులో.. తమ కుటుంబ సభ్యుల ప్రమేయం లేదని... గతంలో  వివేకా కుమార్తె వైయస్ సునీత స్వయంగా స్పష్టం చేశారని.. కానీ ఆ తర్వాత.. అదే  సునీత.. మాట మార్చారంటూ  విమలమ్మ పేర్కొనడమే కాదు, సునీత వెనుక దుష్టశక్తులు ఉన్నాయంటూ ఆమె ఆరోపించారు. అయితే  విమలమ్మ వ్యాఖ్యలపై ఉమ్మడి కడప జిల్లా వాసులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  అంతే కాదు విమలమ్మకు ఈ సందర్బంగా వారు పలు సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో వివేకా హత్య కేసులో..అవినాష్ రెడ్డి అమాయకుడు అయితే.. సీబీఐకి ఆయన ఎందుకు భయపడుతున్నారని.. అలాగే సీబీఐ విచారణకు రమ్మంటే.. ఆయన ఎందుకు ముఖం చాటేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.  ఓ వేళ ఈ హత్య కేసులో  అవినాష్ నిర్దోషి అయితే.. సీబీఐ విచారణకు హాజరై... తన నిర్ధోషత్వన్ని నిరూపించుకోంటే సరిపోతోంది కాదా అని కడప జిల్లా వాసులు ప్రశ్నిస్తారు. మరో వైపు మీ మరో మేనల్లుడు వైయస్ జగన్ ప్రభుత్వమే కదా.. ఆంధ్రప్రదేశ్ ‌రాష్ట్రంలో అధికారంలో ఉంది. అలాంటప్పుడు వైయస్ వివేకా హత్య కేసును త్వరితగతిన ఛేదించాలంటూ.. సీబీఐపై ఆయన కానీ.. ఆయన ప్రభుత్వం కానీ ఎందుకు ఒత్తిడి చేయడం లేదని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు.  ఇక   సునీత వెనుక దుష్టశక్తులు ఉన్నాయన్నారు కదా? ఆ దుష్ట శక్తులు ఎవరో ప్రకటించాలని ఈ సందర్భంగా వైయస్ విమలమ్మను వారు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా మీ ప్రియమైన సోదరుడి కుమార్తె   సునీత ఎందుకు మాట మార్చారో మీకు తెలియదా? అంటూనే.. తన తండ్రి హత్య కేసులో దోషులు ఎవరో తేల్చాలంటూ... సోదరుడు ప్లస్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ వద్దకు స్వయంగా వెళ్లి సునీత విజ్జప్తి చేయగా...  సీఎం వైయస్ జగన్ నుంచి వచ్చిన సమాధానం.. విన్న ఆమె.. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకొని.. ఏం చేసిందో.. ఏమిటో మీకు తెలియదా? అంటూ వైయస్ విమలమ్మకు ఉమ్మడి కడప జిల్లా వాసులు తలంటుతోన్నారు.  అదీకాక వైయస్ అవినాష్ వెనుక సీబీఐ పడుతోందంటూ విమలమ్మ వ్యాఖ్యానించడం పట్ల జిల్లా వాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి చెప్పిన సాక్ష్యమే కాదు.. వైయస్ వివేకా హత్య జరిగిన సమయానికి ముందు ఆ తర్వాత  వైయస్ అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి వెళ్లిన కాల్స్‌ డేటాపై సీబీఐ ఆరా తీయడం.. ఆ క్రమంలో పలువురిని పిలిచి విచారించడం... ఆ తర్వాత ఈ హత్య కేసులో అసలు సిసలు సూత్రదారులు వీరేనంటూ సీబీఐ రంగంలోకి దిగిందని... అంతేకానీ వైయస్ అవినాష్ రెడ్డిని ఈ కేసులో ఇరికించాలనే తాపత్రయం సీబీఐకి ఎందుకు ఉంటుందని సదరు జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు.   ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంత ఇంటి మనిషి ఇలా హత్య కావింప బడితే.. ఈ కేసులో ఆయన స్పందన.. అదీ ముఖ్యమంత్రిగా నేటికి స్పందించకపోవడం పట్ల.. జిల్లా వాసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేసులో అసలు సిసలు దోషులను ఏ మాత్రం విడిచిపెట్టవద్దంటూ సీఎం వైయస్ జగన్ మీద మీరైనా తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని జిల్లా వాసులు మనస్పూర్తిగా కోరుతున్నారు.  ఏదీ ఏమైనా వైయస్ వివేకాను అత్యంత దారుణంగా హత్య చేయడం.. తొలుత ఆయనది గుండెపోటు అని చెప్పడం.. ఆ తర్వాత హత్య అని తేటతెల్లం కావడం.. అనంతరం ఈ హత్య కేసులో చోటు చేసుకొన్న వరుస పరిణామాల నేపథ్యంలో ఈ నాలుగేళ్లగా వైయస్ సునీతకు అందని న్యాయం... వైయస్ ఫ్యామిలీలోని ఇటువంటి పెద్ద వాళ్ల ప్రార్థనలతో.. ఈ వైయస్ వివేక హత్య కేసులో తప్పించుకొని.. బయట విచ్చలవీడిగా తీరుగుతోన్న అసలు సిసలు సూత్రదారులు ఎవరో వారిని కనిపెట్టి పట్టుకొని.. వారికి కఠిన శిక్ష పడేలా చేయడం ద్వారా ఈ కేసు విచారణకు శుభం కార్డు పడితే అదే తమకు ఇది అని కడప జిల్లా వాసులు క్లియర్‌ కట్‌గా స్పష్టం చేస్తుండడం విశేషం.

ఆ ఇద్దరి దారెటు? ఈటల రహస్య భేటీ ఎందుకు?

ఇంచుమించుగా నాలుగైదు నెలలుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు వార్తల్లో వ్యక్తులుగా వెలిగిపోతున్నారు. ముఖ్యంగా, గత నెలలో ఆ ఇద్దరినీ బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచీ, ఆఇద్దరి చుట్టూనే రాష్ట్ర రాజకీయం చక్కర్లు కొడుతోంది. అప్పటి నుంచి ఆ ఇద్దరు ఏ పార్టీలో చేరుతున్నారు? అనే ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తూనే వుంది. ఓ వంక బీజేపీ, మరో వంక కాంగ్రెస్ ఆ ఇద్దరిని తమ వైపుకు తిప్పుకునేందుకు  ప్రయత్రాలు చేస్తున్నాయి.  ఢిల్లీ  పెద్దలు మొదలు రాష్ట్ర నేతలు వరకు ఈ ప్రయత్నాలు చేశారు. కొంతకాలం క్రితం   కేంద్ర హోం మంత్రి అమిత షాతో  పొంగులేటి భేటి అయినట్లు వార్తలొచ్చాయి.. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీమ్ సభ్యులు పొంగులేటి, జూపల్లి జోడీతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఆ తర్వాత బీజేపీ చేరికల కమిటి చైర్మన్ ఈటల రాజేందర్ తో పాటుగా మరికొందరు బీజేపీ నేతలు పొంగులేటి ఇంటికెళ్ళి బీఆర్ఎస్ బహిష్కృత నేతలతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపారు. బీజేపీలో కి రావలసిందిగా ఆహ్వానించారు. అయితే, ఆ ఇద్దరు నేతలు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే శక్తి  బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ఎవరికీ వుందో తేలిన తర్వాతనే తమ నిర్ణయం ఉంటుందని అంటున్నారు. అయితే ఓక దశలో వారు బీజేపీలో చేరడం ఖాయమనే వార్తలొచ్చాయి.  అయితే ఇంతలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించడం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాజీలందరు మళ్ళీ రండని పిలుపు ఇవ్వడంతో ఆ ఇద్దరు కాంగ్రెస్ లో చేరుతున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో గురువారం(మే 25) మాజీ మంత్రి, బీజేపీ చేరికల కమిటి చైర్మన్ ఈటల రాజేందర్  ఆ ఇద్దరు నాయకులతో రహస్యంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ శివార్లలో ఫామ్‌హౌస్‌లో ఈటల రాజేందర్, పొంగులేటి, జూపల్లి మధ్య రహస్య సమావేశం జరిగింది. సుమారు నాలుగు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో ఏమి చర్చించారు, ఏమి నిర్ణయించారు అనేది స్పష్టంగా తెలియక పోయినా, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసినా, లోక్ సభ ఎన్నికల నాటికీ, బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం ఖాయమని, ఇందుకు సంబంధించి, బీఆర్ఎస్, కాంగ్రెస్ జాతీయ నాయకుల మధ్య కుదిరిన ఒప్పదం తాలూకు వివరాలను ఈటల ఆ ఇద్దరి ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసివచ్చిన ఈటల ఢిల్లీ పరిణామాలను పొంగులేటి, జూపల్లికి వివరించారాని అంటున్నారు. అయితే, ఆ ఇద్దరు నాయకుల స్పందన ఏమిటనేది తెలియవలసి ఉందని అంటున్నారు.  అదలా ఉంటే అనుచరులు, అనుయాయులు, కనీసం సెక్యూరిటీ సిబ్బంది కూడా లేకుండా అత్యంత రహస్యంగా ఈ భేటీని జరగడంతో ఈ సమావేశంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇంత సీక్రెట్‌గా సమావేశమవడానికి గల కారణాలు ఏంటనే దానిపై చర్చ మొదలైంది. అలాగే  పొంగులేటి, జూపల్లి కొత్త పార్టీ పెట్టబోతున్నారని, ఇందులో భాగంగానే ఈటలను రహస్యంగా కలిశారా? అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.  మరి నిజంగా వీరిద్దరినీ ఈటల బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారా? లేక ఈటలనే తమ కొత్త పార్టీలోకి వారిరువురూ ఆహ్వానించారా? అనే ఆసక్తికర చర్చ కూడా తెరమీదకు వచ్చింది. 

తెలంగాణలో వచ్చేది సంకీర్ణమేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్నాయి. మరో ఐదారు నెలల్లో, అంటే సంవత్సరాంతానికి ఎన్నికల క్రతువు ముగుస్తుంది. కొత్త సంవత్సరం (2024) ప్రారంభం నాటికి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. అయితే కొత్త సంవత్సరంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం? ముఖ్యమంత్రి ఎవరవుతారు?  ముచ్చటగా మూడవసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా? లేక ఇప్పటికే  డీఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ‘వారసుడు’ కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారా?  అంటే  బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిస్తే, కేటీఆర్, అత్తెసరు మెజారిటీతో గెలిచినా హంగ్ అసెంబ్లీ ఏర్పడినా మళ్ళీ కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని, పార్టీ కీలక నేతలు కొందరు పిచ్చాపాటి చర్చల్లో  పేర్కొంటున్నారు.   అదలా ఉంటే, రేపటి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు స్పష్టమైన వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు సైతం అంగీకరిస్తున్నారు. అయితే,బీఆర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందని,అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని  పార్టీ లోపలా బయటా కూడా చర్చ జరుగుతున్నది. రాష్ట్ర విభజనకు ముందు వైఎస్సార్ క్యాబినెట్ లో తెరాస మంత్రి పదవులు పుచ్చుకున్న విధంగా రేపు కేసేఆర్ సర్కార్ లో కాంగ్రెస్ మంత్రి పదవులు పుచ్చుకోవచ్చని ఇటు బీఆర్ఎస్ వర్గాలు, అటు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతే కాదు ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు అయిపోతే  లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రత్యక్ష పొత్తు కుదిరినా ఆశ్చర్య పోనవసరం లేదని బీఆర్ఎస్  సీనియర్ నాయకులు అంటున్నారు.  నిజానికి, జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించాలనే సంకల్పం విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పెద్దగా తేడాలేదు. జాతీయ, ప్రాంతీయ పార్టీలు రెండూ బీజేపీని బూచిగా కాదు, భూతంగా చూస్తున్నాయి. కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షాల మనగడ మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రమాదంలో పడుతుందనే భయం ప్రాంతీయ పార్టీలను వెంటాడుతోంది. అందుకే  నిన్నమొన్నటివరకు కాంగ్రెస్ పార్టీ స్నేహ హస్తం అందుకునేందుకు ససేమిరా అన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ (ఆప్), కర్ణాటక ఫలితాల తర్వాత  ఇప్పుడు హస్తం పార్టీతో  సహపంక్తి భోజనానికి సిద్దమంటున్నారు. నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు సిద్దమే కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే ఉద్దేశంతో వేచిచూసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, కాంగ్రెస్ లో కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వంటి కొద్ది మంది నేతలు తప్పించి కాంగ్రెస్ సీనియర్లు చాలా వరకు బీఆర్ఎస్ తో పొత్తుకు సిద్దంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.  అంతే కాదు అసెంబ్లీ ఎన్నికల్లో జరగరానిది జరిగి కాంగ్రెస్ పార్టీకి 80 కి పైగా సీట్లు వస్తే సరే లేదంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కట్టడి చేయలేమని గోదా గోడ దూకే ఎమ్మెల్యేలను అపలేమని స్వయంగా పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. అంతే కాకుండా గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలలో మూడొంతుల మంది బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018లో గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో 12 బీఆర్ఎస్ లోకి జంప్ చేశారు. ఈసారి హస్తం గుర్తుపై గెలిచే ఎమ్మెల్యేల సంఖ్య 29దో.. 39దో అయినా మళ్ళీ అదే జరుగుతుందని స్వయంగా పీసీసీ చీఫ్ స్పష్టం చేస్తున్నారు. సో  అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటడడం, తెలంగాణలో తొలి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం  ఖాయంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.

వెలగపూడి సభలో జగన్ కు ఊహించని షాక్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి సభల నుంచి జనం జారుకోవడం సాధారణమైపోయింది. ఆయన బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేయడానికి ఏర్పాటు చేసిన సభల నంచి జనం గుంపులు గుంపులుగా వెళ్లిపోతున్న దృశ్యాలు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే వెలగపూడి సభ మాత్రం వాటికి డిఫరెంట్.. ఇక్కడ ఆయన పేదల పెన్నిధిగా మారి పేదలకు సెంటు భూమి పట్టాలు ప్రదానం చేస్తున్నారు. ఇందు కోసం భారీ ఎర్పాట్లతో బ్రహ్మాండమైన ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున జనాలను తరలించారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల నిరసనలను అణచివేసి.. వారి గళం వినిపించకుండా పోలీసులను రైతుల దీక్షా శిబిరాల వద్ద మోహరించారు. ఇక సభకు తీసుకువచ్చిన వారంతా సెంటు భూమి లబ్ధిదారులే. అయినా సరే జగన్ పట్టాల పంపిణీ సభలో ప్రసగం ప్రారంభించగానే జనం పారిపోవడం ప్రారంభించారు. వారిని ఆపడానికి వైసీపీ శ్రేణులు, పోలీసులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. జనం కోసం పట్టాల పంపిణీ అంటూ ఏర్పాటు చేసిన సభ నుంచి ఆ జనాలే వెళ్లిపోవడంతో వైసీపీ శ్రేణుల్లో నిరుత్సాహం వ్యక్తమౌతోంది. గడపగడపకూ కార్యక్రమంలో కూడా జనం ఎమ్మెల్యేలు, మంత్రుల కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తే అక్కడికక్కడే వారి పథకాలు కట్ చేయమన్న ఆదేశాలు జారీ అవుతున్నాయి. మరి జగన్ సభను జనం బాయ్ కాట్ చేశారు కనుక అలా సభ నుంచి వెళ్లి పోయిన వారికి సెంటు భూమి పట్టాలు ఆపేస్తారా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ధైర్యం జగన్ చేయగలరా అని కూడా సవాళ్లు ఎదురౌతున్నాయి. 

జగన్ కడప కోటకు బీటలు?!

ఇంత కాలం వైఎస్ కుటుంబానికి పెట్టని కోటలా ఉన్న కడపలో ఆ కుటుంబ ఆధిపత్యం బీటలు వారుతోందా? పులివెందులలో జగన్ ఆధిపత్యానికి గండి పడుతోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ బతికి ఉన్నంత కాలం ఆ కుటుంబం పులివెందులలోనే కాదు.. కడప జిల్లాలోనూ తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. వైఎస్ బతికి ఉండగా ఆయన కుటుంబం మొత్తం ఏకతాటిపై ఉండేది.   ఆయన మరణించి 13 సంవత్సరాలు అయ్యింది.  ఆయన మరణం తరువాత వైఎస్ జగన్ ఆయన రాజకీయ వారసుడిగా రాజకీయ ప్రవేశం చేశారు. అయితే ఆయన కాంగ్రస్ ను వీడి వైసీపీ పేర సొంత కుంపటి పెట్టుకున్నారు.  ఏపీలో అధికార పగ్గాలు కూడా అందుకున్నారు. అయితే ఆయన అధికార పగ్గాలు అందుకున్న తరువాత  ఆయన తీరు, అలాగే వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న తీరు వైఎస్ కుటుంబంలో నిలువునా చీలిక వచ్చింది.  ఇదే కుటుంబం వైఎస్ కుమారుడు, ఏపీ ప్రస్తుత సీఎం జగన్ గతంలో విపక్షంలో ఉన్న సమయంలో అక్రమాస్తుల కేసులో అరెస్టయిన సందర్భంలో ఆయనకు అండగా నిలబడింది. ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలకు దిగారు. జగన్ జైలుకు వెళ్లడంతో మధ్యలో ఆగిపోయిన జగన్ పాదయాత్రను ఆయన సోదరి షర్మిల జగనన్న వదిలిన బాణాన్ని అంటూ కొనసాగించారు.   అయితే జగన్ అధికార పగ్గాలు చేపట్టిన నాలుగేళ్లు కాకుండానే పరిస్థితి పూర్తిగా మారిపోయింది.  కుటుంబాన్ని నిచ్చెనగా చేసుకుని, ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న జగన్ రెడ్డి ఆ తరువాత క్రమంగా కుటుంబాన్ని దూరం పెడుతూ వచ్చారు.  సొంత తల్లి  చెల్లి కూడా దూరమయ్యారు. చెల్లి షర్మిల అయితే  తెలంగాణకు వలస వెళ్లి తన తండ్రి పేర రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. పలు సందర్భాలలో ఆమె సొంత అన్న జగన్ పైనే విమర్శలు గుప్పించారు. తల్లి విజయమ్మ జగన్ కు దూరంగా కుమార్తెతోనే ఉంటున్నారు. జగన్ వైఎస్ ఫ్యామిలీకి  దూరమయ్యారని విశ్లేషకులు అంటున్నారు.   ఇక జగన్ సొంత బాబాయ్ వివేకా హత్య కేసు దర్యాప్తు విషయంలో తొలుత అంటూ అధికారంలోకి రాకముందు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేసిన జగన్.. ముఖ్యమంత్రి అయిన తరువాత సీబీఐ దర్యాప్తు వద్దనడంతో వివేకా కుమార్తె సునీత జగన్ కు ఎదురు తిరిగారు. సుప్రీం కు వెళ్లి మరీ సీబీఐ దర్యాప్తును సాధించుకున్నారు. ఆ తరువాత ఏపీలో దర్యాప్తు సవ్యంగా జరిగే అవకాశం లేదంటూ విచారణను సుప్రీంను ఆశ్రయించి విచారణను ఏపీ నుంచి తెలంగాణకు మార్పించుకున్నారు.  ఇక వివేకా హత్య కేసు దర్యాప్తు లాజికల్ ఎండ్ దిశగా సాగుతున్న కొద్దీ  వైఎస్ కుటుంబ కలహాలు  ముదురు పాకాన పడుతున్నాయి. గత ఏడాది జులై 8వ తేదీన వైఎస్ జయంతి సందర్భంగా ఆనవాయితీకి భిన్నంగా, తల్లి, కొడుకు, అక్కా,చెల్లి ఎవరికి  వారుగా ఇడుపులపాయలోని  వైఎస్ సమాధి వద్ద ప్రార్ధనలు చేసి నివాళులు అర్పించారు. ఒకరికి ఒకరు తారసపడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు.   ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబంలో జగన్ ఏకాకిగా మారిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితే కడప జిల్లాలో జగన్ కోటకు బీటలు వారేలా చేసిందని అంటున్నారు. 

ఫొటో దిగవా.. నీ సంగతి చూస్తా!

చెప్పినట్లు వినకున్నా.. పథకాలు అందలేదన్నా.. రోడ్లను బాగుచేయమని అడిగినా ప్రజలకు వైసీపీ చుక్కలు చూపిస్తోంది. అలా అడిగిన పానానికి ప్రజలకు వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు ఇస్తున్న షాకులు, కక్ష సాధింపులు మామూలుగా ఉండటం లేదు. కేసులు, పథకాల కోతలతో నిత్య నరకం చూపుతున్నారు. అలాంటి సంఘటన  పునరావృతమైంది. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరు గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బ్రోచర్ పట్టుకుని ఫొటో దిగలేదని హోటల్ నిర్వాహకుడు, తెదేపా మైనార్టీ సెల్ నాయకుడు రఫీపై రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో  ఫొటో దిగేందుకు నిరాకరించిన వ్యక్తి కి చెందిన హోటల్ నిర్వహణపై పరిశీలించి, చర్యలు తీసుకోవాలని  కాపు రామచంద్రారెడ్డి అధికారులకు హుకుం జారీ చేశారు.  రఫీ కుటుంబ సభ్యులు గ్రామంలో రోడ్డు పక్కన చిన్న హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రఫీ ఇంటికి వెళ్లారు. జగన్ మైనార్టీలకు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని' చెబుతూ వారికి బ్రోచర్ ఇచ్చారు. ఫొటో దిగాలని కోరగా.. అందుకు రఫీ కుటుంబ సభ్యులు తిరస్కరించారు. తమకు జగన్ ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదని, తాను తెదేపా మైనార్టీ నాయకుడని రఫీ చెప్పారు. ప్రభుత్వ విప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆర్ అండ్ బీ రోడ్డు పక్కన హోటల్ నిర్వహిస్తున్నావని, నీ కథ చూస్తానని   బెదిరించారు.  హోటల్లో శుచి, శుభ్రతపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.   వీఆర్వో రామన్న, పంచాయతీ కార్యదర్శి కుళ్లాయిస్వామినాయుడు హోటల్ ను పరిశీలించి వంటనూనె, దోసె రవ్వ, చపాతీ పిండి నమూనాలు తీసుకెళ్లారు. హోటల్ నిర్వహణకు అనుమతి పత్రాలు, ఇంటి పట్టాలు ఇవ్వాలని అధికారులు అడగ్గా, స్థానిక తెదేపా నాయకులు కేశప్ప, వీఎల్ రామాంజనేయులు, నాగరాజులతో పాటు గ్రామస్ధులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆర్అండ్ అధికారులు స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. సహాయాన్ని కోరిన వారిపై దాడి చేయడం.. అసభ్య పదప్రయోగం ..లాంటి సంఘటనలు ఇటీవల ఏపీలో అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఎలక్షన్ ఇయర్.. ఇలా దౌర్జన్యంగా వ్యవహరిస్తే.. ప్రజల తీర్పు ఎలా ఉంటుందో అనే కనీసం భయం.. జాగురుకత..వైకాపా నాయకులలో మచ్చుకైనా కానరావడం లేదు. ఇలాంటి పరిస్థితులలో.. వచ్చే ఎలక్షన్లలో ఎలా రియాక్ట్ అవ్వాలో.. జనానికి ఒక క్లారిటీ రావడం ఖాయమని రాజకీయ వర్గాలలో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. 

రాజమహేంద్రవరంలో మహా సందడి

రాజమహేంద్రవరం వేదికగా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుకు రంగం సిద్దమైంది. అలాగే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఈ మహానాడు వేదికగా ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మహానాడు మరింత ప్రాధాన్యత సంతరించుకొంది. ఇప్పటికే రాజమహేంద్రవరం సమీపంలో వేమగిరిలోని వంద ఎకరాల్లో నిర్వహిస్తున్న మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లును పక్కా ప్రణాళికలతో పూర్తి చేసినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఆ మహానాడు వేదికగా ఎన్నికల సమర శంఖారావం పూరించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఈ నాలుగున్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఈ సభ సాక్షిగా ఎండగడతామని ఆయన పేర్కొన్నారు.     మరోవైపు   మహనాడుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ విదేశాల్లోని ఎన్టీఆర్ అభిమానులు సైతం భారీగా తరలి వస్తున్నారు. ఆ క్రమంలో టీడీపీ ఎన్నారై విభాగానికి చెందిన వారు సైతం వస్తున్నారు. అయితే మే 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో మహానాడు నేపథ్యంలో విమాన ఛార్జీల ధరలు చుక్కలనంటాయి. మామూలు రోజుల్లో హైదరాబాద్ నుంచి రాజమండ్రికి టికెట్ ధర 3 వేలు.. అదీకాకుంటే 3 వేల 5 వందల వరకు ఉండేదని... కానీ మే 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు విమాన టికెట్ ధర దాదాపుగా 10 వేల రూపాయిలుగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బెంగళూరు నుంచి రాజమండ్రికి కూడా దాదాపుగా ఆయా తేదీల్లో ఇదే ధర లేకుంటే మరికాస్తా అధికంగా ఉన్నట్లు  సమాచారం.  అలాగే రాజమండ్రితోపాటు ఆ పరిసర ప్రాంతాల్లోని కాకినాడ, అమలాపురంతోపాటు ఇటు కోవ్వూరు, నిడదవోలులో ఇప్పటికే హోటల్స్‌లో రూములు సైతం భారీగా బుక్ అయినట్లు తెలుస్తోంది. అదీకాక మహానాడు నేపథ్యంలో హోటల్స్‌లో రూముల ధరలు సైతం ఆకాశాన్ని అంటినట్లు ఓ టాక్ అయితే రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో సాగుతోంది.       మహనాడుకు వేదిక అయిన రాజమహేంద్రవరం నగరం పసుపు శోభను సంతరించుకొంది. నగరం మొత్తం బంతిపూల వనంగా మారిపోయింది. నగరం ఆ మూల నుంచి ఈ మూల వరకూ.. అలాగే నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో పసుపు రంగు జెండాలతోపాటు భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు ధర్శనమిస్తున్నాయి. ఇంకోవైపు చంద్రబాబు డిజిటల్ సంతకం చేసిన మహానాడు ఆహ్వాన పత్రికలు.. ఇప్పటికే దేశవిదేశాల్లోని ప్రతినిధులకు అందాయి. 2006లో రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మహనాడు జరిగితే.... ఆ తర్వాత అంటే 2023లో.. అదే రాజమహేంద్రవరంలో  తెలుగుదేశం పార్టీ మళ్లీ మహానాడు జరుపుకొంటోంది.  

మహానాడుకు లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజమహేంద్రవరం వేదికగా జరుగుతోన్న  మహానాడుకు హాజరవుతున్నారు.  ఉమ్మడి కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో  సాగుతున్న పాదయాత్రకు ఆయన  గురువారం (మే25) తాత్కాలిక విరామం ఇచ్చి.. అమరావతి  చేరుకున్నారు.  శుక్రవారం (మే 26) నారా లోకేశ్ రాజమహేంద్రవరం చేరుకోనున్నారు. మే 27, 28 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ఆయన మహానాడులో పాల్గొని.. మళ్లీ సోమవారం అంటే మే 29వ తేదీన  తన పాదయాత్రకు ఎక్కడ తాత్కాలిక విరామం ఇచ్చారో అక్కడ నుంచి  తిరిగి కొనసాగించనున్నారు.   నందమూరి తారకరత్న మరణించిన నేపథ్యంలో.. హైదరాబాద్ వచ్చి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి.. నివాళులర్పించి.. ఆ వెంటనే ఆయన మళ్లీ తన పాదయాత్రను కొనసాగించారు. ఆ సమయంలో తప్ప నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి.. ఇప్పటి వరకూ ఒక్కరోజు కూడా  విరామం ఇవ్వకుండా, విశ్రాంతి తీసుకోకుండా ముందుకు సాగుతున్నారు.   నారా లోకేశ్ పాదయాత్ర చేపట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ... విజయవాడ, హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు కానీ.. అలాగే హైదరాబాద్ నడిబొడ్డు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా జరిగిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభకు కానీ.. నారా లోకేశ్ రాలేదు. ఇప్పుడు మహానాడుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేశ్ వస్తుండడం పట్ల.. పార్టీ శ్రేణుల్లో  ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.  2023, జనవరి 27వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం వేదికగా నారా లోకేశ్ యువగళం  పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయన చేపట్టిన ఈ పాదయాత్ర నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల మేర సాగనుంది. ఆ క్రమంలో ఇప్పటికే నారా లోకేశ్.. 14 వందల కిలోమీటర్ల మేర తన పాదయాత్రను పూర్తి చేసుకొని.. అనుకొన్న లక్ష్యాన్ని సాధించే దిశగా.. ఆయన వడివడిగా అడుగులు వేసుకొంటు వెళ్తున్నారు.  ఇంకోవైపు ఈ మహానాడుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తెలుగు రాష్ట్రాల పార్టీ  అధ్యక్షులు   అచ్చెన్నాయుడు, కాసాని జ్జానేశ్వర్లతోపాటు ఆ పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోని ఎన్టీఆర్ అభిమానులు సైతం భారీగా ఈ మహనాడుకు తరలిరానున్నారు. అందుకోసం అన్నిఏర్పాట్లు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు వివరించిన సంగతి తెలిసిందే.

ఇంతకీ నూతన పార్లమెంట్ భవనం పేరేంటి?

అత్యాధునిక సదుపాయాలతో, సర్వాంగ సుందరంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనం ప్రారంభానికి అంతే సర్వాంగ సుందరంగా సిద్దమైంది. మరో రెండు రోజుల్లో,  అంటే మే 28 న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తారు. సరే ఇంతకీ నూతన పార్లమెంట్ భవనం పేరేంటి అంటే తెలియదు. ఎందుకంటే ఆ భవనానికి ఇంకా నామకరణం జరగలేదు. కొత్త పార్లమెంట్ భవానానికి ఇంకా ఏ పేరునూ కేంద్రం ఖరారు చేయలేదు. అయితే  ఏ పేరు పెట్టినా అదొక వివాదంగా మారుతుందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ముఖ్యంగా, ఉత్తర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం నగరాల, పట్టణాల పేర్లకు హిందుత్వ వాసనలు అద్దుతున్న నేపద్యంలో పార్లమెంట్ పేరులోనూ అవే వాసననలు గుబాళిస్తే   లౌకికవాద పార్టీలు పార్లమెంట్ ను ప్రధాని ప్రారంభించడాన్ని రచ్చచేస్తున్న రీతిలోనే మరింతగా రచ్చచేయవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే  కొత్తగా నిర్మించిన పార్లమెంట్లో ఎన్ని ద్వారాలున్నాయి. ఆ ద్వారాలకు ఏ పేర్లు పెట్టారని ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.  మరోవంక నూతన పార్లమెంట్ భవనం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త పార్లమెంట్ భవనంలో మహాత్మాగాంధీ, చాణిక్యుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తో సహా ప్రముఖుల విగ్రహాలు ఉంటాయని  చెబుతున్నారు. అంతే కాకుండా కొత్త పార్లమెంట్ భవనానికి మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయట. ఈ ప్రవేశ ద్వారాలకు చారిత్రక అంశాలను మేళవించారట. వాటికి జ్ఞాన ద్వారం..శక్తి ద్వారం.. కర్మ ద్వారాలుగా నామకరణం చేశారు. జ్ఞాన ద్వారానికి ఒకవైపున గార్గి, యాజ్ఞవల్క్య మహర్షి మధ్య జరిగిన సంభాషణ దృశ్యం, మరోవైపు నలంద చిత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. శక్తి ద్వారానికి ఒక వైపున చాణిక్య, మరోవైపు మహాత్మాగాంధీ దండియాత్ర దృశ్యాలు ఉండనున్నాయి. కర్మ ద్వారానికి ఒకవైపు కోణార్క్ చక్రం, మరోవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు.   కేంద్ర ప్రభుత్వం 2022  సెప్టెంబర్లో రాష్ట్రపతి భవన్ కు వెళ్లి చారిత్రాత్మక రహదారి రాజ్ పథ్ ను కర్తవ్య పథ్ గా మార్చింది.  ఈ క్రమంలో కొత్త పార్లమెంట్ భవనానికి కూడా కొత్త పేరు పెట్టనున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే పార్లమెంట్ హౌజ్ అని పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇంత వరకు ఏ పేరునూ ఖరారు చేయలేదు. మరోవైపు నూతన పార్లమెంట్ భవనంలో బంగారు రాజదండం సెంగోల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సెంగోల్  స్పీకర్ కుర్చీ వద్ద ఏర్పాటు చేస్తున్నారు.  నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు.

అడకత్తెరలో పోకచెక్కలా కేసీఆర్ పరిస్థితి!

నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం పై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధంగా మొదలైన వివాదం, రాజకీయ దుమారంగా మారింది. పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి ఎలా ప్రారంభిస్తారని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రపతి చేతుల మీదుగా పార్లమెంట్ నూతన భవనం ప్రారంభించడం సముచితంగా ఉంటుందని, రాజ్యాంగాన్ని ఉటంకిస్తున్న ప్రతిపక్ష పార్టీలు ప్రాధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభించడం రాష్ట్రపతిని అవమానించడమే అని అరొపిస్తున్నాయి.  అంతే కాదు, చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే, ఆ గౌరవం ప్రధాని మోడీకి ఎట్టి పరిస్థితుల్లో దకక్కుండా అడ్డుకునేందుకు విపక్షపార్టీలన్నీ ఏకమయ్యాయి. ఒకటి  కాదు, రెండు కాదు ఏకంగా 19 ప్రతిపక్ష పార్టీలు నూతన పార్లమెంట్ భవన సముదాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభ వేడుకలను బహిష్కరించాలని నిర్ణయించాయి. మరో అడుగు ముందుకేసి ప్రదాని మోడీ చేతుల మీదుగా పార్లమెంట్ భవనం ప్రారంభం కాకుండా అడ్డుకునేదుకు న్యాయస్థానాలను సైతం ఆశ్రయిస్తున్నారు. సరే, చివరకు న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుంది ఏమిటి అనే విషయాన్ని పక్కన పెడితే, విపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, మోడీ చేతుల మీదుగా పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం జరగడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.  నిజానికి, ప్రారంభ వేడుకలనే కాదు, పార్లమెంట్ నూతన భవన నిర్మాణాన్ని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి గట్టిగా వ్యతిరేకిస్తోంది. పార్లమెంట్ భవన శంకు స్థాపన సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అప్పటి తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కొవిడ్ కారణంగా చూపించి, పార్లమెంట్ నిర్మాణ పనులను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర నాయకులు అనేక సందర్భాలలో అసలే దేశం క్లిష్ట పరిస్థితిల్లో  ఉందని అంటూ  ఇప్పడు నూతన పార్లమెంట్ భవనం  అవసరమా అని ప్రశ్నిస్తూ వచ్చారు. అయితే, విపక్షాలు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుకున్న విధంగా పార్లమెంట్ నిర్మాణ పనులను కొనసాగించింది. అనుకున్న విధంగానే నిర్మాణం పూర్తిచేసింది. ఈనెల (మే) 28 న ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ఈ దశలో విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి గౌరవాన్ని అస్త్రంగా చేసుకుని వేడుకను వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నది. అయితే.. పార్లమెంట్ ప్రాంగణంలో నిర్మించిన భవనాలను ప్రధానమంత్రి టెంకాయ కొట్టడం ఇదే తొలిసారి కాదని అధికార బీజేపీ నాయకులు, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద జోషీ ఇతర మంత్రులు గుర్తుచేస్తున్నారు. గతంలో 1975లో  పార్లమెంట్ ప్రాంగణంలో నిర్మించిన నూతన భవన సముదాయాన్ని అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రారంభించారు. ఆతర్వాత 1980లలో అదే పార్లమెంట్ ప్రాంగణంలో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రారంభించారని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు.  అదలా ఉంటే, ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా పార్లమెంట్ నితన భవనాలను ప్రధానమంత్రి ప్రారంభించడాన్ని తప్పు పడుతూ విపక్షాలు చేస్తున్న ఆందోళన, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అగ్ని పరీక్షగా మారింది. ఒక విధంగా 2024 ఎన్నికల్లో మోడీ ఓడించేందుకు ఏకమవుతున్న విపక్షాలు  పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి హాజరు కావడం అంటే, అది దేశ ద్రోహం కంటే మహాపరాధం అన్నట్లుగా, మోడీ వ్యతిరేకతకు లిట్మస్ టెస్ట్’గా భావిస్తున్నాయి. అటో ఇటో తేల్చుకోమని బీఆరేఎస్ వంటి బీజేపీ వ్యతిరేక పార్టీలకు సవాలు విసురుతున్నాయి. నిజానికి  ప్రతిపక్షాల ఐక్యతా యత్నాలు సాగిస్తున్న నితీష్ కుమార్, మమతా బెనర్జీ, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు ఎవరూ బీఆర్ఎస్ పార్టీని, కేసేఆర్ ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. దూరం ఉంచుతున్నారు. ఈ పరిస్థితిలో కేసీఆర్ .. సుమోటోగా  పార్లమెంట్ భవన ప్రరంభోత్సవ వేడులకలను  భాహిష్కరించడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకో వచ్చు. కానీ తెలంగాణ సచివాలయ నూతన భవన ప్రారంభోత్సవానికి గవర్నర్ పిలవక పోవడంతో, ఇప్పుడు ఎటూ తేల్చుకోలేక న్యూట్రల్ గా మిగిలి పోయారు.  అదలా ఉంటే తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఇదే అదనుగా కేసీఆర్ కు చురక అంటించారు. పార్లమెంటును ప్రధాని మోడీ కాకుండా రాష్ట్రపతి ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె, తెలంగాణ సచివాలయ నూతన భవన ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గుర్తుచేశారు. కనీసం తనకు ఆహ్వాన పత్రిక కూడా ఇవ్వలేదని తెలిపారు. దీంతో తెలంగాణ సర్కార్ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారిపోయింది.