విపక్షాల ఐక్యతకు సంకేతం.. సిద్దరామయ్య ప్రమాణ స్వీకారోత్సవం
posted on May 20, 2023 @ 3:29PM
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య శనివారం (మే20)న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఒక విధంగా ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం . బీజేపీయేతర పక్షాల ఐక్యతకు వేదికగా మారింది. అంతే కాకుండా కాంగ్రెస్ లో మారిన సంస్కృతికి దర్పణంగా కనిపించింది. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా మరో ఎనిమిది మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున్ ఖర్గేకు ఇరువైపులా సిద్దరామయ్య, డీకే శివకుమార్ లు చేతులు పట్టకుని నిలుచున్నారు.
వీరికి వెనుకగా కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్, ప్రియాంకలు నిలబడ్డారు. ఏ విధంగా చూసినా ఇది ఒక కొత్త దృశ్యం. కాంగ్రెస్ లో గాంధీ నెహ్రూ కుటుంబం స్వయంగా తమ ఆధిపత్యాన్ని తగ్గించుకుని పార్టీలో ప్రజాస్వామ్యానికి పెద్ద పీట వేసిన సందర్భంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదలా ఉంటే ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్, రాజస్థాన్ సీఎం గెహ్లాట్, ఛత్తీస్‌గర్ సీఎం భూపేశ్ భగేల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా తదితరులు హాజరయ్యారు.
అలాగే రాజకీయవేత్తగా మారిన నటుడు కమల్ హసన్ కూడా హాజరయ్యారు. ఆహ్వానం అందినప్పటికీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కేసీఆర్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లు గైర్హాజరయ్యారు. అయితే కర్నాటకలో కాంగ్రెస్ విజయం, ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి పలు బీజేపీయేతర పార్టీల అధినేతల హాజరు జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి బలోపేతం అవుతోందనడానికి స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది.
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది గడువు ఉంది. ఈ లోగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో పార్టీలూ ఏకమౌతాయన్న అంచనాకు రావడానికి సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమం దోహదపడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.