అవినాష్ అరెస్ట్.. ఢిల్లీ నుంచి ఆదేశాలు!
posted on May 19, 2023 @ 11:05PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్‌కు ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందనీ, ఆ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న అవినాష్ రెడ్డి.. గురువారం సీబీఐ విచారణకు డుమ్మా కొట్టారని.. ఆ క్రమంలో ఆయన తల్లికి గుండెపోటు వచ్చిందని.. పులివెందుల ఆసుపత్రిలో ఆమె చేరారంటూ.. సీబీఐకి ఆయన లేఖ పంపడం.. ఆ లేఖను సీబీఐ తోసిపుచ్చి.. అవినాష్ కోసం సీబీఐ పయనం కావడం చూస్తుంటే.. అవినాష్ రెడ్డి అరెస్ట్ పక్కా అని స్పష్టమవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అదీకాక అవినాష్ రెడ్డి.. సీబీఐ విచారణకు హాజరైన తొలిసారి నుంచి అంటే 2023, జనవరి 28వ తేదీ నుంచి.. ఆయయను అరెస్టు భయం వెంటాడుతూనే ఉందని అంటున్నారు. తొలిసారి సీబీఐ విచారణకు హాజరైన వైయస్ అవినాష్ రెడ్డి వెంట.. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, కె. శ్రీనివాసులతోపాటు భారీగా ఆయన అనుచరగణం కూడా హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తరలి రావడమే ఇందుకు నిదర్శనమంటున్నారు.
మరోవైపు అదే రోజు... సీబీఐ విచారణకు హాజరయ్యే కొన్ని గంటల ముందు అవినాష్ రెడ్డి.. లోటస్ పాండ్‌లోని వైసీపీ మాజీ గౌరవ అధ్యక్షురాలు, సీఎం జగన్ రెడ్డి తల్లి విజయమ్మతో భేటీ అయ్యారు. ఆమె ఆశీర్వాదం తీసుకొనేందుకు వెళ్లానని అవినాష్ రెడ్డి పైకి చెబుతున్నప్పటికీ..ఈ వీరిద్దరి భేటీలో బలమైన చర్చ జరిగిందనే ఓ టాక్ సైతం ఉమ్మడి కడప జిల్లాలో నేటికి వాడి వేడిగా సాగుతోంది. అంతే కాదు సీబీఐ విచారణ విడతల వారీగా జరుగుతోండగా... తనను సీబీఐ అరెస్ట్ చేయకుండా.. ముందస్తు బెయిల్ కోసం వైయస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం పట్ల జిల్లా వాసులు నేటికీ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకోవైపు వైయస్ వివేకా చనిపోతూ రాసిన లేఖగా చెప్పబడుతోన్నలేఖ విషయంలో తన ఆరోపణలను పట్టించుకోకుండా సీబీఐ విచారణ జరపడాన్ని అవినాష్ మీడియా ఎదుట చెప్పడం, అలాగే వివేకా.. రెండో వివాహం.. ఆయన రెండో భార్య కుమారుడికి రాజకీయ వారసత్వం అంటూ మీడియా ముందుకు వచ్చి.. మరణించిన వివేకా క్యారెక్టర్‌ను అసాసినేట్ చేసేలా మాట్లాడడం, అదే విధంగా అవినాష్ తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి సైతం వివేకా పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలతో కోర్టులో పిటిషన్ వేయడం పట్ల కడప జిల్లాలో సందేహాలే కాకుండా ఆగ్రహం కూడా వ్యక్తమైందని చెబుతున్నారు. ఇక మే 16వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు పంపగా.. తనకు పార్టీ కార్యక్రమాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో తనకు నాలుగు రోజుల గడువు కావాలని కోరడం పట్ల జిల్లా ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే ఏపీ సీఎం జగన్ మరికొద్ది రోజుల్లో నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు దేశ రాజదాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ క్రమంలో ఆయన ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని.. అందుకు సంబంధించిన వార్తలు ఇప్పటికే మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే నీతి ఆయోగ్ సమావేశానికి ప్రతీసారి.. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరవుతోన్న విషయం విధితమే. అలాంటింది ఈసారి ముఖ్యమంత్రి వైయస్ జగన్ .. హాజరుకానుండడం పట్ల... ఉమ్మడి కడప జిల్లా వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ ప్రచారం సాగుతోన్న వేళ.. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి.. ప్రధాని, హోం శాఖ మంత్రితో భేటీ కావడం... ఆ తర్వాత అవినాష్ రెడ్డి అరెస్ట్ ఆగిపోవడం.. వంటి ఘటనలు చోటు చేసుకొన్నాయని.. అలాంటి పరిణామాలు మళ్లీ వైయస్ జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత పునారవృతమ్యే అవకాశాలు లేక పోలేదనే ఓ చర్చ సైతం ఉమ్మడి కడప జిల్లాలో నడుస్తోంది. ఏదీ ఏమైనా.. ఒక తప్పును కప్పి పుచ్చుకునేందుకు వంద తప్పులు చేస్తున్నట్లుగా అవినాష్ రెడ్డి వ్యవహారశైలి ఉందనే చర్చ సైతం వాడి వేడిగా కొన...సాగుతోంది. ఏది ఏమైనా నేడో రేపో లేకపోతే ఆ మరునాడో అవినాష్ అరెస్ట్ తధ్యమన్న భావన అయితే అందరిలో వ్యక్తమౌతోంది.