జగనన్న బాణం రివర్స్.. రచ్చకెక్కనున్న వైఎస్ కుటుంబ కలహాలు
posted on Jun 23, 2023 @ 1:56PM
తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఒకవైపు రానున్న ఎన్నికలలో పొత్తుల కోసం ఏపీలో ప్రతిపక్షాలు ఏకమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తుంటే.. రాష్ట్ర విభజనలో తీవ్రంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక లో దక్కిన విజయంతో తెలుగు రాష్ట్రాలలో కూడా కోలుకునేందుకు ఆపరేషన్స్ మొదలు పెట్టింది. ఒకవైపు తెలంగాణలో నాయకులను చేర్చుకొని ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా పావులు కదుపుతూనే.. ఏపీ లక్ష్యంగా కొత్త రాజకీయం మొదలు పెట్టింది.
అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలా జరగాలంటే ఏదో ఒక మిరాకిల్ జరగాలి. ఎందుకంటే రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. కనీసం ద్వితీయ శ్రేణి నాయకులు కూడా లేకుండా వలస పోయారు. అలాంటి పార్టీ ఇప్పుడు మళ్ళీ పుంజుకోవాలంటే అందుకు తగ్గట్లే వ్యూహాలు ఉండాలి. కాంగ్రెస్ ఇప్పుడు తిరిగి కొత్త వ్యూహాలతో ముందుకు వస్తోంది. అదే జగనన్న వదిలిన బాణం వైఎస్ షర్మిలను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా ఏపీలో వైఎస్ బ్రాండ్ ను తిరిగి దరి చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.
వైఎస్ మరణానంతరం జగన్ కాంగ్రెస్ పార్టీతో విభేధించి బయటికి వచ్చి ఓదార్పు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, యాత్ర మధ్యలో ఉండగానే అవినీతి, అక్రమ ఆస్తుల కేసులో జగన్ జైలు పాలయ్యారు. దీంతో ఆయన చెల్లెలు షర్మిల జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేపట్టారు. మొదట్లో కాస్త తడబడినా, ఆ తర్వాత పార్టీకి ఆమె పెద్ద దిక్కుగా మారి తల్లి విజయమ్మతో కలిసి వైఎస్ అభిమానులను, పార్టీ క్యాడర్ ను కాపాడారు. ఇంకా చెప్పాలంటే షర్మిల రాష్ట్రవ్యాప్తంగా కాలికి బలపం కట్టుకుని తిరిగి జగన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే, ఆ తర్వాత వైఎస్ కుటుంబంలో విబేధాలొచ్చాయి. షర్మిల అన్న జగన్ ను కాదని తెలంగాణలో తండ్రి పేరుతో మరో పార్టీతో ప్రజల మధ్యకి వచ్చారు. ఆ తర్వాత తల్లి విజయమ్మ కూడా కొడుకును, కొడుకు పార్టీని కాదని.. కూతురు షర్మిల వద్దకే చేరారు.
ఆ మధ్య వైఎస్ వివేకా కేసు అంశంలో కూడా పరోక్షంగా అన్న జగన్ మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వంపై కూడా షర్మిల విమర్శలు చేయగా.. వివేకా కుమార్తె సునీతతో కలిసి షర్మిల పరోక్షంగా యుద్ధమే చేస్తున్నారు. ఈ వివరాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లోనే వివరంగా ఉన్నాయి. అయితే, అప్పుడు అన్నకు మద్దతుగా కాంగ్రెస్ తో విభేదించిన షర్మిలను ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేసుకొనే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని టాక్ నడుస్తుంది. షర్మిల కూడా కాంగ్రెస్ తో సయోధ్యకు సిద్దమైనట్లు కథనాలొస్తున్నాయి. రాజన్న రాజ్యం పేరుతో ఆమె పార్టీ అనుకున్న మేర సక్సస్ కాకపోవటంతో పొత్తు లేదా విలీనం దిశగా కాంగ్రెస్ తో కలవాలని నిర్ణయించగా.. చివరి క్షణం వరకు తండ్రి నడిచిన కాంగ్రెస్ పార్టీతోనే ఇక ఆమె ప్రయాణించేందుకు ఇడుపులపాయ కేంద్రంగా కీలక అడుగులకు రంగం సిద్దం అవుతోందని రాజకీయ వర్గాల సమాచారం.