తెలంగాణలో కమలం రేకులు రాలిపోతున్నాయా?
posted on Jun 23, 2023 @ 11:31AM
సిద్ధాంతాలను పక్కన పెట్టేసి బలోపేతం పేరుతో వాపును పెంచేసుకున్న బీజేపీకి ఆ ప్రభావం ఇప్పుడు తెలంగాణలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. పార్టీలో అంతర్గత విభేదాలు పెచ్చరిల్లి.. ఇంత కాలం తెలంగాణలో అధికారమే తరువాయి అన్నంతగా బిల్డప్ ఇచ్చిన బీజీపీకి వచ్చే ఎన్నికలలో గెలుపు ఆశలు సన్నగిల్లాయా? తొలి నుంచీ పార్టీనే నమ్ముకుని ఉన్న పాత నాయకులకు.. చేరికల పేరిట వచ్చి చేరిన నేతలకు పొసగని కారణంగా తెలంగాణ బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా మారిందా? అంటే జరిగిన, జరుగుతున్న పరిణామాలను చూసిన, చూస్తున్న ఎవరైనా ఔననే అంటారు.
బీజేపీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో పార్టీలోకి చేరికలు ప్రోత్సహించడానికి ఏకంగా చేరికల కమిటీనే ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇన్ చార్జిగా బయట నుంచి వచ్చి చేరినఈటలను నియమిస్తే.. ఇప్పుడు ఆయనే పార్టీలో ఇమడలేక పక్క చూపులు చూస్తున్నారు. ఇంటింటికీ బీజేపీ కార్యక్రమానికి ఆయన డుమ్మా కొట్టడంతో ఈ విషయం బహిర్గతమైంది. బీజేపీ రాష్ట్ర అథ్యక్షుడు బండి సంజయ్, ఈటల మధ్య విభేదాలు రహస్యమేమీ కాదు. వీరిరువురి పంచాయతీ ఇప్పటికే పలు మార్ల అధిష్ఠానం వద్దకు కూడా చేరింది. హై కమాండ్ ఇద్దరిలో కలిసి, విడివిడిగా సమాలోచనలు జరిపింది. అయినా బయటకు చెప్పుకోవడమే కానీ ఆల్ఈజ్ వెల్ అన్న వాతావరణం కనిపించడం లేదు. అసలు ఈటల బీజేపీలో చేరడమే అప్పట్లో రాజకీయ పరిశీలకులలో ఆశ్చర్యం కలిగింది.
వామపక్ష భావజాలం ఉన్న ఈటల ఏమిటి, అందుకు పూర్తి వ్యతిరేకమైన సిద్ధాంతాలున్న బీజేపీలో చేరడమేమిటన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలకు తగ్గట్టుగానే ఈటల బీజేపీలో చేరిన నాటి నుంచీ ఆయనకు పార్టీలో ఉక్కపోత మొదలైందన్న వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. అయినా సర్దుకుంటూ, సరిపెట్టుకుంటూ వచ్చిన ఈటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో మాత్రం సమన్వయం కుదరలేదు. ఈ తరుణంలోనే బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసలు అంటూ వార్తలు వస్తున్నాయి. తెరాస నుంచి బహిష్కృతులైనప్పటి నుంచీ కమలం గూటిగా, హస్తం గూటికా అని తేల్చుకోలేక సతమతమౌతూ వస్తున్న పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖరారైపోయింది. ఈ విషయాన్ని వారితో భేటీ అనంతరం ఈటల చెప్పకనే చెప్పారు. అక్కడితో ఆగకుండా వారు తనకే రివర్స్ కౌన్సెలింగ్ ఇచ్చారని కూడా సెలవిచ్చారు. అప్పటి నుంచే ఈటల బీజేపీలో కొనసాగుతారా అన్న అనుమానాలు ఇటు బీజేపీలోనూ కాకుండా అటు రాజకీయ సర్కిల్స్ లో కూడా వ్యక్తమౌతూ వస్తున్నాయి. ఇప్పుడు మొత్తంగా బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలంతా పార్టీకి దూరం జరుగుతున్నారన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.
ఇందుకు ప్రత్యక్ష, తాజా తార్కానం మోదీ పాలనను ఇంటింటికి ప్రచారం చేయాలని గురువారం (జూన్ 22) అన్ని స్థాయిల నేతలు తమ తమ నియోజకవర్గాల్లో కనీసం వంద ఇళ్లకు వెళ్లాలని పార్టీ నిర్దేశించింది. అయితే ఈటల రాజేందర్ , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా అనేక మంది ఖాతరు చేయలేదు. దీంతో పార్టీలో పరిస్థితి బద్దలవ్వడానికి రెడీగా ఉన్న అగ్నిపర్వతంలా ఉందన్న విషయం తేటతెల్లమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈటల రాజేందర్ ,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, యొన్నం శ్రీనివసరెడ్డి వంటి వారు, మరి కొందరు కూడా ఇంటింటికీ కార్యక్రమానికి దూరంగా ఉండటంతో ఈ గ్రూప్ కు ఈటల రాజేందర్ నేతృత్వం వహిస్తున్నారన్న భావన బీజేపీలో వ్యక్తం అవుతోంది. పైగా గత కొంత కాలగా ఈటల బండి సంజయ్ విషయంలో బీజేపీ హైకమాండ్ పై అసంతృప్తిగా ఉన్నారు. దానిని దాచుకోవడానికి ఆయన ఇసుమంతైనా ప్రయత్నించడం లేదు. ఈ పరిస్థితుల్లోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నే కొనసాగించనున్నట్లు బీజేపీ అధిష్ఠానం కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేయడంతో ఈటల ఇక ముసుగులో గుద్దులాట ఎందుకన్నట్లుగా ‘ఇంటింటికి ’కార్యక్రమానికి డుమ్మా కొట్టి తన ఉద్దేశాన్ని చాటారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీఆర్ఎస్ ను ఓడించే పార్టీ బీజేపీనేనని నమ్మి పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఏదో జరుగుతోందన్న భావనలో ఉన్నారు. అదే సమయంలో రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లో నే కొనసాగుతూ..తమ్ముడిని సొంత ఇంటికి చేర్చే ప్రయత్నాలలో ఉన్నారు. ఈ పంచాయతీలు తేల్చ లేక బీజేపీ అగ్రనేతలు తెలంగాణ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు.