బీఆర్ఎస్ లో‘సర్వే’యే సర్వస్వం
posted on Jun 23, 2023 @ 3:14PM
ఆగస్టు తరువాత ఏ క్షణంలోనైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడొచ్చన్న అంచనాల నేపథ్యంలో అన్ని పార్టీలూ కసరత్తులు ప్రారంభించేశాయి. బీఆర్ఎస్ సహా ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లు వరుస కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్నాయి. అదే సమయంలో అన్ని పార్టీలూ కూడా సర్వేలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి.
ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీల కంటే అధికార బీఆర్ఎస్ సర్వేలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే పలు సర్వేలు చేయించారు. ఆ సర్వేలన్నిటిలోనూ బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తేలిందని ప్రకటిస్తూ క్యాడర్ లో బూస్ట్ నింపుతున్నారు. అలాగే సిట్టింగతులందరికీ టికెట్లని ప్రకటించిన ఆయన సర్వేల ఆధారంగా కొందరు సిట్టింగులను పక్కన పెట్టక తప్పదన్న నిర్ణయానికి వచ్చారని కూడా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పార్టీ గెలుపు ఓటములపైనే కాకుండా ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని నిలబెడితే గెలుపు అవకాశాలు ఉంటాయన్న విషయంపై కూడా సర్వే నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.
గతంలోనే సిట్టింగులకందరికీ టికెట్లు అని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు సిట్టింగులందరికీ టికెట్లు గ్యారెంటీ కాదు అని మాట మార్చడం వెనుక కూడా సర్వేలే ఉన్నాయని అంటున్నారు. తాజాగా మరో సర్వే నిర్వహించిన ఆయన వచ్చే ఎన్నికలలో గెలుపు గుర్రాలు ఎవరన్న విషయంలో ఒక స్పష్టతకు వచ్చేశారని, ఆ మేరకు ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ముందే అభ్యర్థులను ప్రకటించేందుకు సమాయత్తమౌతున్నారని అంటున్నారు. గతంలో పలు సందర్భాలలో సిట్టింగ్‌లందరికీ పార్టీ టికెట్లు ఇస్తానని ప్రకటించిన ఆయన ఇప్పుడు ఆ గ్యారంటీ లేదని చెప్పకనే చెబుతున్నారు. కేసీఆర్ గతంలో సిట్టింగులందరికీ టికెట్లు అని ప్రకటించిన సందర్భంలో పార్టీలో ఒక్క సారిగా అసంతృప్తి జ్వాలలు ఎగసిపడిన సంగతి తెలిసిందే.
ఆపరేషన్ ఆకర్ష్ పేరిట 2019 ఎన్నికలలో వేరే పార్టీల నుంచి గెలిచిన వారిని కూడా కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారు. దాంతో తొలి నుంచి నియోజకవర్గంలో పార్టీ కోసం పని చేసి.. ఎన్నికలలో పోటీ చేసి పరాజయం పాలైన వారు.. ఇప్పుడు గత ఎన్నికలలో తమ ప్రత్యర్థులకే పార్టీ టికెట్ ఇచ్చి వారిని గెలిపించడం కోసం పని చేయాలని చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేసీఆర్ సిట్టింగులందరికీ టికెట్లని ప్రకటించినప్పుడు పార్టీ శ్రేణులూ, నాయకులూ అన్న తేడా లేకుండా అందరిలోనూ ఒక్క సారిగా అసమ్మతి, అసంతృప్తి భగ్గుమంది. దీంతో ఆయన సిట్టింగులందరికీ కాదు కొందరికే అని తన మాటను, ప్రకటనను సవరించుకున్నారు.
ఇందుకు కారణం సీఎంకు అత్యంవిశ్వసనీయుడిగా పేరొందిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వంటి మంత్రులు సిట్టింగులలో అత్యథికులు టికెట్లు ఇచ్చినా గెలవలేరని బహిరంగంగానే ప్రకటించి సీఎం కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేశారు. దీంతో ఇప్పుడు సిట్టింగులలో కనీసంలో కనీసం పాతిక మందికి టికెట్లు లేవని కేసీఆర్ సంకేతాలు ఇస్తున్నారు. అందుకే సర్వేల ఆధారంగానే పార్టీ అభ్యర్థులను నిర్ణయిస్తామనీ, తాను నిర్వహించిన, నిర్వహించనున్న సర్వేలలో గెలుపు గుర్రాలుగా తేలిన వారికే టికెట్లని చెప్పారు. తన వద్ద సర్వే వివరాలన్నీ ఉంచుకుని త్వరలో ప్రగతి భవన్ లో కేసీఆర్ ఆశావహులతో వరుస భేటీలు నిర్వహించనున్నారు.
ఆయా ఎమ్మెల్యేల పట్ల ఆయా నియోజకవర్గాలలోని ప్రజల్లో ఉన్న అభిప్రాయం, విజయావకాశాలు ఏ మేరకు ఉన్నాయి, ప్రజలలో వ్యతిరేకత ఉంటే ప్రత్యామ్నాయంగా ఎవరు బెటర్ అన్న అంశాలపై కేసీఆర్ చేయించిన సర్వే ఫలితం ఆధారంగానే పార్టీ టికెట్లు ఇస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఈ తతంగమంతా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికే పూర్తి చేసి ఎన్నికలకు సర్వం సన్నద్ధంగా తయారవ్వాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు.