పాట్నా ప్రయోగం సక్సెస్ అవుతుందా?
posted on Jun 23, 2023 @ 12:03PM
పాట్నా నుంచే, ఇందిరమ్మ నియంతృత్వానికి వ్యతిరేకంగా,లోక్’నాయక్’ జయప్రకాశ్’నారాయణ్ (జేపీ) సమర శంఖం పూరించారు. అవును,దేశంలో అంతర్గత అత్యవసర పరిస్థతి (ఎమర్జెన్సీ) విధించి, ప్రజస్వామ్య, రాజ్యాంగ హక్కులన్నిటినీ హరించిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, విపక్షాలన్నింటినీ ఏకం చేసిన ‘జనతా’ ప్రయోగం ఇక్కడే పురుడుపోసుకుంది. జేపీ సంపూర్ణ క్రాంతి ఉద్యమం ఇక్కడి నుంచే మొదలైంది. ఇక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ పురోగమనం మొదలైంది. ఇక్కడి నుంచే విపక్షాల ఐక్యత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అవును జనతా ప్రయోగం విఫలమై, ప్రాంతీయ, కుటుంబ పార్టీల పుట్టుకకు కూడా ఇక్కడే .. పట్నాలోనే బీజం పడింది.
ఇప్పుడు, ఇంచు మించుగా అర్థ శతాబ్ది తర్వాత మళ్ళీ శుక్రవారం( జూన్ 21) అదే పాట్నా నగరంలో, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారధ్యంలో, ప్రతిపక్షాల ఐక్యత క్రతువులో మరో అధ్యాయం మొదలవుతోంది. అయితే, 1970 దశకంలో జేపీ సారధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, నియంతృత్వ పాలనకు, ముఖ్యంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకగా పోరాటం సాగితే, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నాలలో భాగంగా, అదే జనతా పరివార్ చీలిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నితీష్ కుమార్ సారధ్యంలోని జేడీయూ, లాలు ప్రసాద్ యాదవ్ సారధ్యంలోని ఆర్జేడీ పార్టీలు ఆతిథ్య మిస్తున్నాయి. సరే రాజకీయాలలో ఇలాంటి పరిణామాలు సర్వసాధారణం. కాలంతో పాటుగా రాజకీయాలు మారిపోవడం, శతృమిత్ర సంబంధాలు తారుమారు కావడం కొత్తేమీ కాదు. నిజానికి జనతా ప్రయోగానికి ముందు తర్వాత కూడా విపక్ష ఐక్యతకు అనేక ప్రయత్నాలు సాగాయి. ఇప్పడు మళ్ళీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడమే లక్ష్యంగా సమైక్య సమర శంఖారావం పూరించేందుకు ప్రతిపక్ష పార్టీలు సమాయత్తమవుతున్నాయి. పాట్నాలో సమావేశమౌతున్నాయి.
రాజకీయ కురు వృద్దుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మొదలు బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడి అధినేత లాలుప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ వరకు, పశ్చిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మొదలు తమిళ నాడు ముఖ్యమంత్రి, డిఎంకే అధినేత స్టాలిన్ వరకు, అవశేష శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మొదలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, లెఫ్ట్ నేతలు ఏచూరి, రాజా , ఆప్ ముఖ్యంత్రులు కేజ్రీవాల్, మాన్ జోడీ ఇలా చాలా మంది హేమాహమీలు హాజరవుతున్నారు. అదే సమయంలో ఉభయ తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఒరిస్సా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ , జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, అయన కుమారుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వంటి దక్షిణాది నేతలు ఎవరూ హాజరు కావడం లేదు. దక్షణాది నుంచి ఒక స్టాలిన్ మినహా మరెవరికీ ఆహ్వానం లేనట్లు తెలుస్తోంది.
అదలా ఉంటే ఈ సమావేశం ఎంత వరకు సక్సెస్ అవుతుందనే విషయంలో సహజంగానే భిన్నాభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాల ఐక్యత కోసం, గతంలో సాగిన ప్రయత్నాలు, ప్రయోగాలు విఫలమైన నేపథ్యంలో ఇప్పడు పాట్నా వేదికగా బీజేపీ మాజీ మిత్ర పక్షం జేడీయూ అధినాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలో జరుతున్న మరో ఈ బృహత్ యత్నం .. విషయంలోనూ అవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి ఇప్పటికే ఒకటికి రెండు మూడు సార్లు వాయిదా పడుతూ వచ్చిన పాట్నా సమావేశం, సజావుగా సాగే, అవకాశాలు అంతంత మాత్రమే అంటున్నారు. ముఖ్యంగా, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ ( ఆప్) అధినేత అరవింద కేజ్రీవాల్... సమావేశానికి ముందే విపక్షాలకు పరీక్ష పెట్టారు. దేశ రాజధాని ఢిల్లీపై పెత్తనం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించాలని అప్పుడే తాను ప్రతిపక్షాలతో చేతులు కలుపుతానని, షరతు విధించారు. కాంగ్రెస్ అంగీకరించని పక్షంలో విపక్షాల మెగా సమావేశాన్ని బహిష్కరిస్తామని హెచ్చరించారు. అలాగే, విపక్షాల సమావేశంలో ఢిల్లీ ఆర్డినెన్స్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చి చర్చించాలని అరవింద్ కేజ్రీవాల్ కోరారు. పార్లమెంట్‌లో ఈ బిల్లు ఆమోదం పొందింతే బీజేపీయేతర రాష్ట్రాల అధికారాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాల ద్వారా హరిస్తుందని హెచ్చరించారు. అందుకే ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు స్పష్టత కలిగి ఉండాలంటూ ప్రతిపక్ష పార్టీల అధినేతలకు ఆయన లేఖ రాశారు.
అంతే కాదు ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇచ్చేలా విపక్ష పార్టీలు కృషి చేయాలని కేజ్రీవాల్ కోరారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఆప్ డిమాండ్ ను పట్టించుకోలేదు. ఢిల్లీ ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. సో ... ఆప్ డిమాండ్ కు విపక్షాలు ఎలాంటి పరిష్కారం చూపుతాయి అనేది చూడవలసి వుంది. అయితే, అంతిమంగా పాట్నా ప్రయోగం ఏమవుతుంది? వి పక్షాల ఐక్యత ఏమేరకు సాధ్యమవుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే దేశ రాజకీయాల్లో ఈ ఐక్యతా సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా సర్వత్రాఆసక్తిని రేకిస్తోంది.