పట్నా సిగపట్లు కుదరని ఏకాభిప్రాయం
posted on Jun 24, 2023 6:46AM
అనుకున్నదే జరిగింది. 2024 సార్వత్రిక సమరంలో పాలక బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ నివాసంలో జరిగిన విపక్షాల భేటీ అసంపూర్తిగా ముగిసింది. ఈ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తం కాకపోవడంతో త్వరలో సిమ్లాలో మరోసారి భేటీ కావాలని విపక్ష నేతలు నిర్ణయించారు. బీజేపీ నిలువరించేందుకు విపక్ష నేతలు కలిసికట్టుగా పనిచేయాలన్న విషయంలో ఈ భేటీలో ఏకాభిప్రాయం వ్యక్తమైనా అందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు ఓ అంగీకారానికి రాలేకపోయారు.
సమావేశానికి హాజరైన పార్టీలతో పాటుగా, హాజరు కానీ, ఆహ్వానం అందని పార్టీల నాయకులు కూడా ఇది అయ్యేది కాదు .. పొయ్యేది కాదు .. అనే అభిప్రాయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. కాగా సమావేశంలో పాల్గొన్న పార్టీల నాయకులు ఎవరి జెండా, ఎజెండాను వారు బయట పెట్టుకోవడంతో పరస్పర దూషణలతో సమావేశం వేడెక్కింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బెంగాల్‌లో కాంగ్రెస్ తీరును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తప్పుపట్టగా, లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌధరి టీఎంసీని దొంగల పార్టీగా అభివర్ణించారు.
మనలో మనం విభేదాలతో వీధికెక్కితే అంతిమంగా బీజేపీకి లబ్ధి చేకూరుతుందని మమతా బెనర్జీ పేర్కొన్నట్టు సమాచారం. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో పార్టీలన్నీ తమకు మద్దతు ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరగా, ఆర్టికల్ 370పై కేజ్రీవాల్ వైఖరిని ఒమర్ అబ్ధుల్లా తప్పుపట్టారు. మద్దతు ఇవ్వక పోతే తదుపరి సమావేశాలకు ఆప్ ‘హాజరు కాదని ఆప్ నేతలు స్పష్టం చేశారు.
కాగా, పట్నా సమావేశంలో పాల్గొనని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రాజకీయ పార్టీలు ఒక్కటి కావడం ముఖ్యం కాదు, దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా.. ప్రజలంతా ఏకం కావడం ముఖ్యమని అన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న సమస్యలకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలే కారణమని ఆయన విమర్శించారు. ఆ రెండు పార్టీల వల్లే దేశంలో సమస్యలు ఉత్పన్నమైనట్లు చెప్పారు. ఒకవేళ విపక్ష పార్టీలన్నీ రాజకీయంగా బీజేపీ వైపో లేక కాంగ్రెస్ వైపో మళ్లితే అప్పుడు దేశానికి ఎటువంటి ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు.
ఇక బిహార్ సీఎం నితీష్‌కుమార్‌పై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.నితీష్ దేశ ప్రధాని కావాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తాను నిజాలు మాట్లాడతాననే తనను విపక్షాల సమావేశానికి పిలవలేదని అన్నారు. కాగా కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించాలని ఈ సమావేశంలో పలు పార్టీలు అభిప్రాయపడ్డాయని తెలిసింది.
విపక్ష కూటమికి ఓ సమన్వయకర్తను నియమించాలనే అంశంపైనా ఈ భేటీలో చర్చ జరిగిందని సమాచారం. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, శివసేన నేతలు (యూబీటీ) ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ సహా పలువురు విపక్ష నేతలు హాజరయ్యారు. విపక్షాల సమావేశంలో కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎన్సీపీ, శివసేన, డీఎంకే, జేఎంఎం, ఎస్‌పీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఐ, సీపీఎం, జేడీయూ, ఆర్జేడీ నేతలు పాల్గొన్నారు.