బాబు, పవన్ పొత్తు.. జగన్ లో ధైర్యం చిత్తు
posted on Jun 23, 2023 @ 10:16AM
జనసేనాని పవన్ కల్యాణ్.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. ఈ రెండు పేర్లూ అధికార వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 2019 ఎన్నికలలో తమ పార్టీ విజయానికి జనసేన, తెలుగుదేశం పొత్తు లేకుండా విడివిడిగా పోటీ చేయడమే కారణమన్న సంగతి ఆ పార్టీ అధినేతకు క్లియర్ కట్ గా తెలుసు. విపక్షాల అనైక్యత కారణంగానే అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా వైసీపీకి మరలడం వల్లనే అనూహ్య విజయం సిద్ధించింది.
ఇప్పుడు 2024 ఎన్నికలలో తమ విజయం సాకారం కావాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలని వైసీపీ అధినేత భావిస్తున్నారు. అలా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలంటే జనసేన, తెలుగుదేశం మధ్య పొత్తు ఉండకూడదు. ఆ పొత్తు లేకుండా చేయడమే ప్రస్తుతం వైసీపీ ముందున్న లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం విలువలకు తిలోదకాలిచ్చి దుష్ప్రచారం చేయడానికి కూడా వెనుకాడటం లేదు.
వైసీపీ సోషల్ మీడియా పవన్ ను లక్ష్యంగా చేసుకుని క్యారక్టర్ అసాసినేషన్ కు పాల్పడేందుకు కూడా వెనుకాడటం లేదు. పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనీయను అంటు చేసిన ప్రకటన వైసీపీ కాళ్ల కింద భూమిని కంపింపచేసింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటులో చీలిక లేకపోతే.. తమ అధికారానికి నీళ్లొదులుకోవడమేనని వైసీపీ భావిస్తోంది. అందుకూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అన్న పవన్ కల్యాణ్ అధికార పార్టీకి వ్యక్తిగత శత్రువుగా మారిపోయారు. పవన్ కు ఆయన సామాజిక వర్గాన్ని దూరం చేయడానికి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పవన్ పై విమర్శలు గుప్పించడానికి, అవి పరిధిదాటినా ఫరవాలేదన్న విధానానికి వైసీపీ నిర్ణయించుకుంది. అయితే ఆ విమర్శల పేటెంట్ హక్కులను వైసీపీలోని కాపు నేతలు గంపగుత్తగా తీసేసుకున్నారు. ఇక కాపు ఉద్యమ నేతగా ఆ సామాజిక వర్గంలో గుర్తింపు ఉన్న ముద్రగడనూ రంగంలోకి దింపింది.
ఇదంతా ఎందుకంటే.. వచ్చే ఎన్నికలలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఉండకూడదన్నదే వైసీపీ లక్ష్యం. అయితే పవన్ టీడీపీ, జనసేనలతో పాటు బీజేపీని కలిపేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్న సూచనలు కనిపిస్తుండటంతో జగన్ కు ఊపిరాడటం లేదు. ఎలాగైనా కూటమి ఏర్పాటుని అడ్డుకోవాలి. అడ్డంకులు సృష్టించాలి అన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ అన్న ప్రచారాన్ని మరింత విస్తృతం చేయడమే కాకుండా, మొత్తం కాపు సామాజిక వర్గాన్ని పవన్ కల్యాణ్ చంద్రబాబు ఓటు బ్యాంకుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారాన్ని తెరమీదకు తీసుకు వచ్చేందుకు ఎత్తులు వేస్తున్నారు.
అందుకే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న వారాహి యాత్ర లక్ష్యంగా వైసీపీ విమర్శలను గురిపెట్టింది. ఆయన మాట్లాడిన ప్రతి మాటనూ వక్రీకరించి, వక్రభాష్యం చెప్పే కుట్ర కు తెరలేపింది. తమ కూటమికి కాపు సామాజిక వర్గం ఓటర్లు దూరం అవుతారన్న భయంతోనే పవన్ తనకు సీఎంగా అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారన్న ప్రచారం ప్రారంభించింది. ఇప్పటికే సీట్ల సర్దుబాటు సహా అన్ని విషయాలలోనూ ఒప్పందానికి వచ్చేసిన పవన్ కల్యాణ్ హేతు రహితంగా తనకు సీఎం అయ్చ చాన్స ఇవ్వాలనడం వెనుక ఉన్నది చంద్రబాబు వ్యూహమేనంటూ విమర్శలు గుప్పిస్తోంది.
అలాగే తన ప్రాణాలకు ముప్పు ఉందని పవన్ కల్యాణ్ అనడం.. దానికి బీజేపీ వత్తాసు పలకడాన్ని కూడా వైసీపీ ఎత్తి చూపుతోంది. సింపతీ గెయిన్ చేసి కాపు సామాజిక వర్గం తనకు వ్యతిరేకం కాకుండా చూసుకోవడానికి చంద్రబాబు వ్యూహంలో భాగంగానే తన ప్రాణానికి ముప్పు అంటూ పవన్ కల్యాణ్ చెప్పారని వైసీపీ అంటోంది. సంక్షేమ పథకాలతో జగన్ కు దక్కిన ప్రజాభిమానాన్ని, ఆదరణకు తగ్గించేందుకే అవినీతి ఆరోపణలు చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగుతోంది. అన్నం ఉడికిందా లేదా అనడానికి ఒక్క మెతుకును చూసి నిర్ణయించేయవచ్చనీ, అలాగే జగన్ కు ప్రజాదరణ ఎంత గొప్పగా ఉందో ఆయన సభల నుంచి పారిపోతున్న జనాలను చూసి చెప్పేయవచ్చనీ జనసేన వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయి.