జగన్ వైఫల్యంపై కేసీఆర్ చురకలు
posted on Jun 23, 2023 @ 12:22PM
తెలంగాణలో ఎకరం అమ్మితే ఇప్పుడు ఆంధ్రాలో యాభై ఎకరాలు కొనొచ్చు. ఇదీ తెలంగాణ సాధించిన ప్రగతి. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో ఎకరం కొనాలంటే తెలంగాణలో పది ఎకరాలు అమ్మాల్సిందేనని అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైంది. ఈ విషయాన్నీ చంద్రబాబునాయుడే చెప్పారు.
మనం ఏం సాధించామో ఇంతకంటే ఆధారాలు కావాలా?. పటాన్ చెరులో ఎకరం కొనాలంటే రూ.మూడు కోట్లు కావాలి. ఇవీ పటాన్ చెరులో రూ.143 కోట్ల వ్యయంతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం భూమి పూజ చేసిన సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. గతంలో కూడా మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేయగా.. ఇప్పుడు సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం.. అది కూడా ఆనాడు చంద్రబాబు ఇలా అన్నారని గుర్తు చేయడంతో ఇది మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి సూచికగా ఈ వ్యాఖ్యలు చేసినా.. అది ఇప్పటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చురకలే. ఎందుకంటే గతంలో ఆంధ్రా, తెలంగాణ మధ్య ఉన్న వ్యత్యాసం తారుమారైందంటే.. తెలంగాణ ప్రభుత్వం ఎంత సక్సెస్ అయిందని చెప్పుకుంటున్నారో.. ఆంధ్రా ప్రభుత్వం అంత ఫెయిల్ అయినట్లేనని చెప్పినట్లే అవుతుంది. అంతెందుకు రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వ హయంలో ఏపీలో భూముల ధరలకు ఎక్కడలేని రెక్కలొచ్చాయి.
అమరావతి ప్రాంతమైన కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో రియల్ ఎస్టేట్ మూడు వెంచర్లు, ఆరు ప్లాట్లు అన్నట్లుగా బూమ్ లోకి వచ్చింది. ఆ సమయంలో హైదరాబాద్ మహా నగరంలో పెట్టుబడులు పెట్టాలని అనుకున్న వాళ్ళు కూడా.. ఏపీ వైపు వచ్చేశారు. టీడీపీ హయం ఐదేళ్లలో ఏపీ రియల్ ఎస్టేట్ లో ఇదే జోరు, జోష్ కనిపించింది.
కానీ, ఏపీలో ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విజయవాడ, గుంటూరు, విశాఖ లాంటి నగరాలతో పాటు రాజధాని అమరావతిలో సైతం ఎలాంటి అభివృద్ధి లేక రియల్స్ ఎస్టేట్ ఢమాల్ మంది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల నుండే రాష్ట్రంలో ఇసుక కొరత, ఇసుకపై విధించిన ఆంక్షలు, రియల్ ఎస్టేట్ లో వైసీపీ నేతల ఆగడాలు, అయోమయమమైన చట్టాలతో నిర్మాణ పనులు ఎక్కడివక్కడ ఆగిపోయి రియల్ ఎస్టేట్ పై భారీగా ప్రభావం కనిపించింది.
ఒకవైపు అభివృద్ధి లేక మరోవైపు నిర్మాణం జరగక ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని భావించే వారంతా తెలంగాణ వైపు వెళ్లిపోయారు. ఏపీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతినడంతోనే చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలంగాణ వైపు మొగ్గు చూపారన్నది ఓపెన్ టాక్. వ్యాపారస్తులను ఆకట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు కలిసి తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో మాత్రమే రియల్ ఎస్టేట్ అనేలా రియల్టర్లు ఫిక్సయిపోయారు.
ఇప్పుడు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, అప్పుడు తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపడమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, గతంలో మంత్రులు ఇలాంటి కామెంట్స్ చేసిన సమయంలో ఏపీ నుండి వైసీపీ నేతలు వారిపై మాటల దాడి చేశారు. మరి ఇప్పుడు సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం జగన్, వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.
ఇక సీఎం కేసీఆర్ సాక్షాత్తు చేసిన ఈ వ్యాఖ్యలను టీడీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. చంద్రబాబు లాంటి నాయకుడిని కాదనుకోవడం వలన రాష్ట్రానికి జరిగిన నష్టం ఇదని.. ఓ అసమర్ధుడిని ముఖ్యమంత్రి చేయడం వలన పొరుగు రాష్ట్రాలలో మనం పరువు పోతుందని.. పక్క రాష్ట్రాలు మనపై జాలి చూపిస్తున్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టులు వైరల్ అవుతున్నాయి.