ముసుగులు తొలగిపోనున్నాయా?
posted on Jun 23, 2023 @ 2:24PM
బీఆర్ఎస్, బీజేపీ రహస్య మైత్రి ఇక బహిరంగం కానుందా? ఇంత కాలం వేసుకున్న ముసుగులను ఆ రెండు పార్టీలూ తొలగించేయనున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇందుకు సాక్షీభూతంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా అమిత్ షాను కలవనుండటాన్ని పరిశీలకుల చూపుతున్నారు. ఔనున తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రెండు రోజుల పర్యటన నిమిత్తం హస్తిన వెడుతున్నారు.
ఈ పర్యటనలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఆయన ఢిల్లీ పర్యటన ఉద్దేశం ఏమిటన్నదానిపై కంటే కేటీఆర్ అమిత్ షాతో భేటీ కానుండటమే రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీని కేంద్రంలో గద్దె దించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చి ఒక్కసారిగా జాతీయ రాజకీయాలలోకి లాంగ్ జంప్ చేసిన కేసీఆర్.. తన కుమార్తె కల్వకుంట్ల కవిత మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని, సీబీఐ, ఈడీ విచారణలను ఎదుర్కొని అరెస్టు అంచుల దాకా వెళ్లగానే సైలెంట్ అయిపోయారు.
తండ్రి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతుంటే తెలంగాణలో సీఎం పగ్గాలు చేపట్టి అధికార పగ్గాలు అందుకోవాలన్న లక్ష్యంతో బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్న కేటీఆర్ కూడా కవిత ఇబ్బందుల్లో పడగానే కేంద్రంపై విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇప్పుడు కేసీఆర్ ఏదో మహారాష్ట్రలో సభలు పెట్టడం, ఏవో కొన్ని చేరికలను ఆహ్వానించడం వినా జాతీయ రాజకీయాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు.
అన్నిటికీ మించి శుక్రవారం పాట్నా వేదికగా జరిగిన విపక్షాల భేటీకీ ఆయన దూరంగా ఉన్నారు. అసలాయనకు ఆ భేటీకి ఆహ్వానమైనా అందిందా అంటే అనుమానమే. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా అంటే కాంగ్రెస్ ముక్త భారత్ అన్న మోడీ నినాదాన్ని తెలంగాణలో నిజం చేయడానికే కేసీఆర్ రాష్ట్రంలో బీజేపీకి లేని హైప్ తీసుకువచ్చారనీ, నిజానికి కేసీఆర్ పార్టీ బీజేపీకి బీటీమ్ అని గతం నుంచీ వినవస్తున్న విమర్శలు నిజమేనా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఆ అనుమానాలు వాస్తవమే అనిపించేలా బీజేపీ, బీఆర్ఎస్ లు రహస్య మిత్రులు అని కేటీఆర్ తన హస్తిన పర్యటనలో అమిత్ షాతో భేటీ కానుండడాన్ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ బేటీతో ఇరు పార్టీలూ ముసుగులు తొలగించేస్తాయని కూడా అంటున్నారు.