ఈటల, కోమటిరెడ్డిలకు హస్తిన పిలుపు!
posted on Jun 23, 2023 @ 12:59PM
తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులపై బీజేపీ అధిష్ఠానంలో ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో అధికారం ఖాయమన్న భావనలో ఉన్న హై కమాండ్ గత కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించింది. బీజేపీ ఇంటింటి కార్యక్రమానికి డుమ్మా కొట్టిన పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను ఢిల్లీ కి పిలిచింది.
ఈ ఇరువురూ శుక్రవారం (జూన్ 23) సాయంత్రం హస్తినకు బయలు దేరి వెళ్లనున్నారు. శనివారం (జూన్ 24) వీరు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. ఈ భేటీలో తెలంగాణ బీజేపీలో నెలకొన్న పరిస్థితులపై చర్చించే అవకాశాలున్నాయి. పార్టీ పిలుపు మేరకు జరిగిన ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో పాల్గొనకపోవడానికి కారణాలను వీరు అమిత్ షాకు వివరించే అవికాశాలున్నాయని చెబుతున్నారు.
అలాగే రాష్ట్ర పార్టీలో వీరిరువురికీ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయన్న చర్చ రాష్ట్ర బీజేపీలో జోరుగా సాగుతోంది. తెలంగాణలో ఒక్క సారిగా జోరు తగ్గి డీలా పడిన తరుణంలో పార్టీ హైకమాండ్ ఈటల, కోమటిరెడ్డిలను హస్తినకు పిలిపించుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
గత కొంత కాలంగా ఈ ఇరువురిలోనూ వ్యక్తమౌతున్న అసంతృప్తి కి కారణాలను కనుగొని దానిని తొలగించి తిరిగి వారిని క్రియాశీలంగా మార్చేందుకు బీజేపీ అధిష్టానం చర్యలకు ఉపక్రమించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రయత్నాలలో భాగంగానే వారికి హస్తిన పిలుపు వచ్చినట్లు చెబుతున్నారు.