సోము వీర్రాజుకు ఉద్వాసన
posted on Jul 4, 2023 @ 2:19PM
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజుకు పార్టీ హై కమాండ్ ఉద్వాసన పలికింది. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా స్వయంగా వీర్రాజుకు ఫోన్ చేసి తెలియజేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా మీ పదవీ కాలం ముగిసిందని సోము వీర్రాజుకు గుర్తు చేసిన నడ్డా.. ఆయనను తొలగిస్తున్నట్లు చెప్పారు. వెంటనే పదవికి రాజీనామా చేయాల్సిందిగా సూచించారు. దీంతో చాలా కాలంగా సోము వీర్రాజు తొలగింపుపై వస్తున్న వార్తలు వాస్తవమయ్యాయి. ఎట్టకేలకు ఏపీ బీజేపీ అధ్యక్షుడిని తొలగించిన బీజేపీ ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తుందన్నది చూడాల్సి ఉంది.
అసలు చాలా కాలం నుంచీ సోము వీర్రాజు వ్యవహారశైలిపై పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. సోము వీర్రాజు వ్యవహార శైలి కారణంగానే ఆ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దూరమయ్యారు. మిగిలిన నేతలలో కూడా అత్యధికులు సోము వీర్రాజు పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా సోము వీర్రాజు పార్టీ అధ్యక్షులను మారుస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల కూడా సర్వత్రా వ్యతిరేకత వెల్లువెత్తింది. అంతే కాకుండా మిత్రపక్షమైన జనసేన పట్ల సోము వీర్రాజు వ్యవహారశైలి పట్ల కూడా పార్టీ లో అసంతృప్తి వ్యక్తమౌతున్నది. రాష్ట్రంలో బీజేపీకి మిత్రపక్షమైన జనసేనతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ.. జగన్ కు సన్నిహితంగా మెలగడం ద్వారా అధికార పార్టీకి ప్రయోజనం కలిగేలా సోము వీర్రాజు వ్యవహరిస్తున్నారని రాష్ట్ర పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతున్నది.
పలు సందర్భాలలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా సోము వీర్రాజు వ్యవహారశైలి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే కాకుండా తనకు రాష్ట్ర నాయకత్వంతో పని లేదనీ, ఏదైనా బీజేపీ అగ్రనాయకత్వంతోనే తేల్చుకుంటాననీ పవన్ ఒక స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
రాజకీయంగా సోము వీర్రాజుకు పార్టీలోనూ, మిత్రపక్షం నుంచే కాకుండా బయట నంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తమ భూములను సోము వీర్రాజు కబ్జా చేశారంటూ దళిత సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీర్రాజును తొలగించడం ఖాయమని గత కొంత కాలంగా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు బీజేపీ అధిష్ఠానం సోము వీర్రాజును పార్టీ ఏపీ అధ్యక్షుడిగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.