నిస్తేజంలో తెలంగాణ బీజేపీ
posted on Jul 5, 2023 @ 10:54AM
తెలంగాణ బీజేపీలో నిస్తేజం ఆవరించిందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. రాష్ట్ర బీజేపీలో ప్రక్షాళన పేరిట హైకమాండ్ మంగళవారం (జూలై4) కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తొలగించి ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని నియమించింది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించడంతో ఆయన రానున్న రోజులలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అది పక్కన పెడితే రాష్ట్ర పార్టీలో మాత్రం ఈ మార్పులపై ఎటువంటి స్పందనా కనిపించడం లేదు. వ్యక్తిగతంలో ఖమ్మంలో ఒకరు, నల్గొండ జిల్లాలో ఒకరు తమ అసంతృప్తి వ్యక్తం చేసినా శ్రేణుల్లో ఎటువంటి స్పందనా కనిపించలేదు. బండి సంజయ్ సొంత జిల్లా అయిన కరీంనగర్ లో అయితే తుపాను ముందు ప్రశాంతతలా పరిస్థితి ఉంది. కార్యకర్తలు, నాయకులు ఎవరూ బండి ఉద్వాసనకు నిరసన వ్యక్తం చేయడం కానీ, కిషన్ రెడ్డి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేయడం కానీ కనిపించలేదు. రాష్ట్ర నాయకులలో కూడా బండి తొలగింపుపై స్పందన లేదు,
కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడంపై హర్షం లేదు. బీజేపీ సంప్రదాయానికి విరుద్ధంగా బయటి నుంచి వచ్చిన ఈటలకు కీలక పదవి ఇవ్వడంపై కూడా ఎవరూ స్పందించిన దాఖలాలు లేవు. ఈటల మాత్రం మీడియా ముందుకు వచ్చి తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తాననీ, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తాననీ చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో మాత్రం ఎలాంటి ఉత్సాహం, ఉత్తేజం కనిపించడం లేదు.
వాస్తవానికి బండి సంజయ్ కు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించిన తరువాత తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు పలు మార్లు బాహాటంగానే చెప్పారు. మోడీ అయితే వేదికపైనే బండి భుజం తట్టి మరీ అభినందనలు తెలిపారు. బండి ఆధ్వర్యంలో ప్రజాసంగ్రమ యాత్ర, నిరుద్యోగ దీక్ష, నిరుద్యోగ మార్చ్ వంటి కార్యక్రమాలు విజయవంతం కావడంతోపాటు అధికార పార్టీకి బీజేపీ దీటుగా ఎదిగింది. అటువంటి బండి తొలగింపుతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో పార్టీ విజయం పట్ల విశ్వాసం సన్నగిల్లడమే ఈ నిస్తేజానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.