కిషన్ ఇన్.. బండి ఔట్.. బీజేపీలో ప్రక్షాళన ఇదేనా ?
posted on Jul 4, 2023 @ 3:38PM
బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అనంతరం బండి సంజయ్ రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర నాయకత్వంలో బీజేపీ హైకమాండ్ పెను మార్పులు చేస్తుండటం ఎలాంటి ఫలితాన్నిస్తుందన్న ఉత్కంఠ వ్యక్తమౌతోంది.
తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన తథ్యమని గత కొంత కాలంగా గట్టిగా వినిపిస్తోంది. బండి సంజయ్ స్వయంగా తాను మోడీ పర్యటన నాటికి బీజేపీ రాష్ట్ర చీఫ్ గా ఉండే అవకాశం లేదని కార్యకర్తలతో గతంలోనే చెప్పేశారు. ఇప్పటి వరకు తెలంగాణ చీఫ్ గా ఉన్న బండి సంజయ్ ను క్యాబినెట్ లోకి తీసుకొని.. ఇక్కడ రాష్ట్ర నాయకత్వాన్ని కిషన్ రెడ్డికి అప్పగించనున్నారని రాజకీయ వర్గాలు బలంగా చెప్తున్నాయి. అయితే సోమవారం ( జూలై 3) కేబినెట్ భేటీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఎటువంటి చర్చా జరగలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 8 నెలల ముందు బీజేపీ అధిష్టానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తూ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమనే చెప్పాలి. గతంలో బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ బండిని మార్చే ప్రశక్తేలేదని చెప్పిన సంగతి తెలిసిందే. మొత్తం మీద రాష్ట్ర బీజేపీలో సమూల ప్రక్షాళన జరిగితేనే పార్టీకి ఉనికి ఉంటుందని హైకమాండ్ నిర్ణయించుకున్నట్లు తాజా నిర్ణయంతో తేటతెల్లమైంది. కాగా రాష్ట్ర బీజేపీలో భారీ మార్పుల గురించి ఇటీవల కొంత కాలంగా వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈటెల రాజేందర్ కు బీజేపీ ప్రచార సారధ్య బాధ్యతలు అప్పగించవచ్చని చెప్తున్నారు.
కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవిని వదులుకుని పార్టీ రాష్ట్రఅధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు పెద్దగా సుముఖత చూపకుంటే.. ఆయనను కేవలం పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలకు పరిమితం చేయకుండా బీజేపీ తన సంస్కృతిని పక్కనపెట్టేసి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
మొత్తంగా తెలంగాణలో అధికారం మాదే అనే స్థాయి నుంచి పార్టీని కాపాడుకుంటే చాలన్న స్థాయికి బీజేపీ దిగజారిందని ఇటీవలి పరిణామాలను బట్టి అర్ధమౌతోంది. మరింత దిగజారకముందే పార్టీలో ధిక్కారాన్ని అణచివేసి మళ్లీ పార్టీని విజయం దిశగా నడిపించేందుకు బీజేపీ హై కమాండ్ శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. అయితే కేవలం నాయకత్వ మార్పుతోనే బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందా? అంటే పరిశీలకులు అనుమానం అనే అంటున్నారు.