బీజేపీ ఏపీ పగ్గాలు పురంధేశ్వరికి.. వ్యూహమేంటంటే?
posted on Jul 5, 2023 @ 11:26AM
తెలుగు రాష్ట్రాల్లో అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. సినీ ప్రముఖుల మద్దతు కోసం ఉవ్విళ్లూరుతోంది. ఇందు కోసం ప్రయత్నాలు చేస్తున్నది. జాతీయ స్థాయిలో బీజేపీకి పలువురు బాలీవుడ్ ప్రముఖలు మద్దతుగా ఉన్న సంగతి తెలిసిందే.
అలాగే పలు రాష్ట్రాలలో కూడా రాష్ట్రాల్లో కూడా సినిమా తారల మద్దతు ఉన్న సంగతి విదితమే. అయితే తెలుగు రాష్ట్రాలలో మాత్రం.. బీజేపీకి సినీ తారల నుంచి మద్దతు పెద్దగా లేదు. గతంలో బీజేపీ నేతగా ఉన్న కృష్ణంరాజు.. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు ఆ స్థాయి సినీ ప్రముఖుల మద్దతు బీజేపీకి లేదు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా బీజేపీ అగ్ర నేతలు తెలుగు సినీ ప్రముఖులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని, తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కిషన్ రెడ్డిల నియామకం జరిగిన నేపథ్యంలో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కిషన్ రెడ్డి విషయానికి వస్తే.. ఆయనకు సౌమ్యుడిగా పేరుంది. పలువురు సినీ ప్రముఖులతో ఆయన మంచి పరిచయాలే ఉన్నాయి. మరోవైపు దగ్గుబాటి పురందేశ్వరి విషయానికి వస్తే.. సీనియర్ ఎన్టీఆర్ కుమార్తెగా ఆమె కుటుంబానికి సినీ పరిచయాలు ఎక్కువే. ఆమె సోదరుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఆమె తండ్రి స్థాపించిన టీడీపీలో ఉన్నారు. మరోవైపు మరో సోదరుడు హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు మాత్రం.. ఏ పార్టీ తరఫున యాక్టివ్‌గా లేరు.
జూనియర్ ఎన్టీఆర్ గతంలో టీడీపీ కోసం పనిచేసినా, ఇప్పుడు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే పురందేశ్వరి కుటుంబంతో మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌కు స్నేహపూర్వక బంధమే ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పురందేశ్వరి ద్వారా.. సీనియర్ ఎన్టీఆర్ మద్దతుదారులలో కొందరినైనా తమ వైపుకు తిప్పుకోవడంతో పాటు, జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా పార్టీ వైపు తీసుకొచ్చే ప్రణాళికలను బీజేపీ అధిష్టానం రచిస్తున్నదా? అనే చర్చ కూడా సాగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయినప్పటి నుంచే.. ఆయనను బీజేపీ ప్రచారానికి వాడుకోవాలనే ఆలోచనతో బీజేపీ ఉందనే ప్రచారం సాగింది. ఇక నందమూరి కుటుంబంలోని హీరోలతోనే కాకుండా.. టాలీవుడ్‌లోని ఇతర సినీ ప్రముఖలతో కూడా పురందేశ్వరికి స్నేహపూర్వక సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పురంధేశ్వరి నియామకం వెనుక బీజేపీకి సినీ తారలను పార్టీలోకి ఆకర్షించాలనే వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.