పెళ్లి కాని ప్రసాదులకు పెన్షన్!
posted on Jul 5, 2023 @ 12:33PM
పిల్ల దొరక్క పెళ్లి ఈడు దాటిపోయి... ఒంటరిగా మిగిలిపోయి.. దిగులు పడుతున్న పెళ్లి కాని ప్రసాదులకు హార్యానా ప్రభుత్వం జిలేబీ లాంటి తీపి కబురు చెప్పింది. బెండకాయ ముదిరినట్లు ముదిరిపోయిన ఒంటరి మగవారికి ఇకపై ప్రతీ నెల పెన్షన్ ఇచ్చే పథకాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. రాష్ట్రంలో 45 నుంచి 60 ఏళ్ల వయస్సు గల పురుషులు ఈ పథకానికి అర్హులని ఆయన చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న దాదాపు 2 లక్షల మంది పెళ్లి కాని ప్రసాదులకు లబ్ది చేకూరుతుంది
కర్నల్ జిల్లాలో కమలాపూర్ గ్రామంలో ఇటీవల నిర్వహించిన జన్ సంవాద్ కార్యక్రమంలో భాగంగా.. 60 ఏళ్ల వయస్సు ఉండి వివాహ యోగానికి నోచుకోని పురుషులకు పెన్షన్ అంశంపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. ముఖ్యమంత్రి కట్టర్ సానుకూలంగా స్పందించారు.
అయితే ఇదే కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్‌కు ఇస్తున్న పెన్షన్ మరో 250 రూపాయిలు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో సీనియర్ సిటిజన్ల పెన్షన్ 3 వేల రూపాయిలకు పెరుగుతుంది.
పెళ్లి కాని ప్రసాదుల కోసం ప్రభుత్వం త్వరలో అందజేయనున్న ఈ పెన్షన్ ఎంత అనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న పెన్షనే.. వీరికీ ఇవ్వాలన్న అభిప్రాయంతో సీఎం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై త్వరలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు 2024లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని తెరపైకి తీసుకు వచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదీకాక రాష్ట్రంలో మగవారి సంఖ్య పెరుగుతోంది అయితే ఆ నిష్పత్తిలో ఆడవారి సంఖ్య పెరగడం లేదు. దీంతో మగవారిలో అవివాహితులుగా మిగిలిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.
ఇంకోవైపు దేశంలో భూణ హత్యల జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో హర్యానా కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో మహిళల సంఖ్య గణనీయంగా తగ్గిందనే ప్రచారం నడుస్తోంది.
అయితే రాష్ట్రంలో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో.. హిమాచల్‌ప్రదేశ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ మహిళలను బలవంతంగా హర్యానా పురుషులు వివాహం చేసుకున్నారు. అలా ఇతర రాష్ట్రాలకు చెందిన దాదాపు 1.35 లక్షల మంది మహిళలను.. హర్యానా పురుషులు వివాహం చేసుకొన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఆడపిల్ల సంఖ్యను పెంచే క్రమంలో.. ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏమైనా ఉన్నాయా అంటే.. ఆ విషయంలో ప్రభుత్వ పెద్దలకే ఓ స్పష్టత లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.