పవన్ పెళ్లిళ్లపై జగన్ విమర్శలు.. జోగయ్య చురకలు
posted on Jul 4, 2023 @ 3:51PM
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ సభ్యుడు చేగొండి హరిరామజోగయ్య మంగళవారం(జూన్ 4) బహిరంగ లేఖ రాశారు. మీ నాన్నగారు వైఎస్ఆర్‌తో తనకు సన్నిహిత సంబంధం ఉండేదన్నారు. మొదట్లో ఆయన్ని విమర్శించినా.. ఆ తర్వాత ఆయన అభిమానిగా మారానని గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్ష నాయకుల పట్ల ఆయన అప్పుడప్పుడు చేస్తుండే విమర్శనాస్త్రాలు ఎంతో హుందాగా ఉండేవని.. ఆ విషయం ప్రజలందరికి తెలిసిందేనని ఆయన వివరించారు. ముఖ్యమంత్రిగా మీ తండ్రిగారి హుందాతనంలో 10వ వంతు కూడా మీకు లేవని.. మీ ప్రవర్తన చూస్తుంటే అనిపిస్తోందంటూ సీఎం వైయస్ జగన్‌కు సుతిమెత్తగా చురకలంటించారు.
ప్రజల ఆరాథ్య నాయకుడు, ప్రతిపక్ష నేత పవన్ కల్యాణ్ పట్ల మీరు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు విన్న తర్వాత సినిమాల్లో విలన్ పాత్రధారిగా మిమ్మల్ని వర్ణించ వచ్చనిపిస్తోందన్నారు. చట్టపరంగా ఆయన ఎన్ని పెళ్లిళ్లు చేసుకొంటే ప్రజలకెవ్వరికీ లేని అభ్యంతరం మీకేందుకని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌పై బురదజల్లడానికి మరో కారణం లేక.. ఇటువంటి చవకబారు కారణాలతో లబ్ది పొందాలని మీరు చుస్తున్నట్లుగా ఉందని అన్నారు. మరోసారి చవకబారు విమర్శలు చేయకుండా.. మీ నోరు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిదంటూ సీఎం జగన్‌కు హితవు పలికారు. మాట్లాడితే పవన్ కల్యాణ్.. చంద్రబాబుకి దత్త పుత్రుడు, ప్యాకేజీ అంటూ విమర్శిస్తుంటారని.. మరీ మీరు తెలంగాణ సీఎం కేసీఆర్‌కి దత్తపుత్రుడుగా 2019 ఎన్నికల్లో ఓటర్లను కొనుక్కునే నిమిత్తం కోట్లాది రూపాయిలు ప్యాకేజీ తీసుకొని ఆంధ్రప్రదేశ్‌ని తెలంగాణకు తాకట్టు పెట్టలేదా? అని ప్రశ్నించాల్సి ఉంటుందన్నారు. మీ తాతా రాజారెడ్డి నుంచి మీ వరకు మీ కుటుంబంలో అందరికీ దోచుకోవడం, దాచుకోవడం అలవాటే కదా? కాదని చెప్పగల దమ్ము.. మీకుందా? అంటూ సీఎం జగన్‌కు జోగయ్య సవాల్ విసిరారు. లేకుంటే.. మీ అందరి అవినీతి చిట్టా అంతా మరోసారి ప్రజల ముందుకు తీసుకురమ్మంటారా? అని హరిరామ జోగయ్య ప్రశ్నించారు.
ఇకపై ప్రతిపక్ష నాయకులపై ముఖ్యంగా పవన్ కల్యాణ్‌పై అనవసర దుర్బాషలాడటం మానుకొంటే బాగుపడ్తారు. ఒకటి అని నాలుగు అనిపించుకోవడం ఏ సలహాదారు నేర్పారు మీకు అంటూ ప్రశ్నించారు. మంచిగా మాట్లాడి మంచి రోజులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండంటూ సీఎం జగన్‌కి సూచించారు. మీపై ఈ అభియోగాలు మోపవలసిన పరిస్థితి వచ్చినందుకు తనకు చాలా బాధాగా ఉందని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తప్పనిసరి పరిస్థితి అయిందన్నారు. తనకు మొదటి నుంచి ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం అలవాటని.. అది అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా తప్పు అంటూ ఉంటే.. ముఖంపైన కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడడమే తన నైజమని ఈ సందర్బంగా వైయస్ జగన్‌కు హరిరామజోగయ్య స్పష్టం చేస్తూ.. సారీ అంటూ లేఖను ఆయన ముగించారు.