బీజేపీది వ్యూహమా? సెల్ఫ్ గోలా?
posted on Jul 5, 2023 @ 9:59AM
చదవేస్తే ఉన్న మతి పోయిందన్నట్లుంది తెలుగురాష్ట్రాలలో పార్టీ ప్రక్షాళన పేరుతో బీజేపీ హైకమాండ్ చేసిన మార్పుల వ్యవహారం. రెండు రాష్ట్రాలలోనూ కూడా బీజేపీ హైకమాండ్ కు రహస్య మిత్రులున్నారు. ఆ విషయాన్ని పార్టీ రాష్ట్ర నాయకులకు కూడా తెలియనీయకుండా హైకమాండ్ జాగ్రత్త పడింది. తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి పార్టీ అధిష్ఠానం ఆ రాహస్య మిత్రుల కోసం పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని బలి చేసింది. పార్టీ పరువును గంగలో కలిపేయడానికీ సిద్ధ పడింది. తెలుగురాష్ట్రాలలో పార్టీ భవిష్యత్ ను వదిలేసుకుంది. ఆ రహస్య మిత్రుల విషయం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అయినా బీజేపీ అధిష్ఠానం మాత్రం కళ్లు మూసుకుని పిల్లి పాలు తాగినట్లు వ్యవహరించింది. వ్యవహరిస్తోంది.అదేదో బ్రహ్మరహస్యం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చింది.
ఇంతకీ బీజేపీకి ఉన్న ఆ రహస్య మిత్రులు ఎవరంటే తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో జగన్ నాయకత్వంలోని వైసీపీ అని పరిశీలకులు చెబుతున్నారు. సామాన్య జనం కూడా అదే నమ్ముతున్నారు.
ముందుగా తెలంగాణ విషయం తీసుకుంటే.. బీఆర్ఎస్ ను గద్దె దింపడమే లక్ష్యంగా కమలం పార్టీ కోసం సర్వం ఒడ్డి పోరాడిన బండి వంటి నేతలకు హైకమాండ్ దిమ్మదిరిగేలా షాక్ ఇచ్చింది. పండుగాడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే అన్నట్లుగా రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం ఇక తేరుకోలేనంతగా దెబ్బకొట్టింద. స్వయంగా అధిష్ఠానమే కాళ్ల కింద భూమిని లాగేస్తే.. అందుకోబోతున్న అధికార అందలాన్ని అందకుండా చేస్తే.. ఇక రాష్ట్రంలో బీజేపీ బలపడేదెలా? బీజేపీ కోసం అరెస్టులకు, లాఠీ దెబ్బలకు, కేసులకు వెరవకుండా పని చేసిన రాష్ట్ర నాయకులు జనాలకు ముఖం చూపేదెలా అని పార్టీ శ్రేణులే అవేదన వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకుడు బండి సంజయ్ విషయమే తీసుకుంటే.. బండి సంజయ్ పార్టీ రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన తరువాతే తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఆయన కుటుంబ పాలనను, కుటుంబ సభ్యుల అవినీతినీ ప్రతి వేదిక మీదా ఎండగడుతూ.. బీఆర్ఎస్ సర్కార్ కు పక్కలో బల్లెంగా మారారు. ఇప్పుడు ఆ బాధ్యతలను కేంద్ర మంతి కిషన్ రెడ్డికి అప్పగించింది బీజేపీ హైకమాండ్. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఫస్ట్ టార్గెట్ గా మారిన బండి సంజయ్ ను ఏ రక్షణా లేకుండా పార్టీ హైకమాండ్ బీఆర్ఎస్ కు ఎరవేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బండి సంజయ్ దూకుడు కారణంగానే తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కు దీటుగా ఎదిగింది. పార్టీకి అధికారంలోకి రాగలమన్న విశ్వాసాన్ని ఇచ్చింది. అయితే బీజేపీ అధిష్ఠానం అనూహ్యంగా తెలంగాణలో బీజేపీ కూర్చున్న కొమ్మనే నరికేసింది. ఇందుకు జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతన దెబ్బతీయడానికి బీఆర్ఎస్‌తో రహస్య రాజకీయ అవగాహనే కారణమని పార్టీ శ్రేణులే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నాయి. కేసీఆర్ ఒత్తిడి కారణంగానే బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బీజేపీ అధిష్ఠానం తప్పించిందని అంటున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అసలు ఇంత కాలం ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును కొనసాగించడమే వింత అనుకుంటే.. హఠాత్తుగా ఆయనను తప్పించి ఆ బాధ్యతలను పురంధేశ్వరికి అప్పగించడం మరో వింతగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ అగ్ర నేతలు ఏపీ పర్యటనలకు వచ్చినప్పుడు జగన్ సర్కాన్ ను విమర్శలతో ఎండగట్టడం, హస్తినకు వెళ్లగానే సైలెంట్ అయిపోతుండటం ఇటీవలి కాలంలో చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర పార్టీ మొత్తం సోము వీర్రాజును వ్యతిరేకిస్తున్నా చర్య తీసుకోకుండా ఇంత కాలం నిమ్మకు నీరెత్తినట్లు బీజేపీ అగ్రనాయకత్వం వ్యవహరించడానికి సోము తీరు ఏపీలో పార్టీకి నష్టం చేసినా అధికారంలో ఉన్న జగన్ కు ప్రయోజనం చేకూర్చేదిగా ఉండటమే కారణమని ఏపీలో ఇంత కాలం విస్తృతంగా చర్చ జరుగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఉరుము లేని పిడుగులా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి అప్పగిం అప్పగించడం ద్వారా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశంతో పొత్తుకు అవకాశాలు లేవన్న సందేశాన్ని బీజేపీ హైకమాండ్ ఇచ్చిందా అన్న అనుమానాలు రాజకీయ సర్కిల్స్ లో వ్యక్తమౌతున్నాయి. సోము వీర్రాజును తప్పించడం ద్వారా వైసీపీకి బీజేపీ అనుకూలమన్న ముద్రను తుడిచేసుకోవడం, అదే సమయంలో జగన్ కు మేలు చేకూర్చే విధంగా పొత్తుకు అవకాశం లేకుండా చేయడం బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహంగా చెబుతున్నారు. మొత్తం మీద దక్షిణాదిపై ఆశలు వదిలేసుకున్న బీజేపీ.. జాతీయ స్థాయిలో ప్రయోజనాల కోసం తెలుగురాష్ట్రాలలో పార్టీని బలి చేయడానికి రెడీ అయ్యిందని అంటున్నారు.