జనసేన వైపు ముద్రగడ అడుగులు?

ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీలో  నిన్నటి దాకా చక్రం తిప్పిన నేతలు నేడు జీరోలుగా మారి పార్టీని వీడుతున్నారు. జగన్ కోసం అయిన వారినీ, సొంత సామాజిక వర్గాన్నీ కూడా దూరం చేసుకుని పార్టీలో చేరిక కోసం చకోరపక్షుల్లా ఎదురు చూస్తున్న నేతలు కూడా ఇప్పుడు వైసీపీకి దగ్గరవ్వడమంటే కోరి తలకొరివి పెట్టుకున్నట్లే అని భావించి దూరం జరుగుతున్నారు. అలాంటి కోవలోకే కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొంది, ఆ సామాజికవర్గంలో మంచి పలుకుబడి ఉన్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా చేరారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాపు సామాజిక వర్గ ఓట్ల ప్రాధాన్యత, ప్రాముఖ్యత గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో కాపు సామాజిక  వర్గ మద్దతే పార్టీల గెలుపు ఓటములను నిర్ణయిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఆ కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం పెద్ద ఎద్యమమే జరిగింది. ఆ ఉద్యమానికి ముద్రగడ నాయకత్వం వహించారు. అయితే అదంతా గతం. ఇప్పుడు ముద్రగడ కాపు రిజర్వేషన్లు అసాధ్యం అని చెప్పిన జగన్ కు మద్దతుగా నిలిచారన్న భావన ఆ సామాజిక వర్గంలో బలంగా నాటుకు పోయింది. అందుకు తగ్గట్టుగానే  ముద్రగడ పద్మనాభం ఇప్పటివరకూ వ్యవహరించారు. కాపు రిజర్వేషన్ల అమలు కోసం సీరియస్ గా ప్రయత్నించి చాలా వరకూ సాధించిన తెలుగుదేశంపైనా, రిజర్వేషన్ల కోసం తన శాయశక్తులా కృషి చేస్తానంటున్న పవన్  కల్యాణ్ పార్టీ జనసేనపైనా విమర్శలు గుప్పిస్తూ, రిజర్వేషన్లు అసాధ్యం అని తేల్చేసిన జగన్ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్న ముద్రగడ పట్ల సొంత సామాజికవర్గంలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆ వ్యతిరేకతను కాపు యువత పలు సందర్భాలలో దాపరికం లేకుండా వ్యక్తం చేశారు కూడా.  అయితే ఇప్పుడు తాజాగా ముద్రగడ పద్మనాభం వైసీపీకి మద్దతు విషయంలో పునరాలోచనలో పడ్డారా అన్న అనుమానాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఆ అనుమానాలు ఎందుకు వ్యక్తం అవుతున్నాయన్న విషయం దగ్గరకు రావడానికి ముందు.. విపక్షాలకు కాపు సామాజిక వర్గ మద్దతు దక్కుండా చేసేందుకు జగన్ తరఫున ముద్రగడ ఎంతగా ప్రయత్నం చేశారో  ఒక సారి చూద్దాం. గతంలో జనసేనాని పవన్ కల్యాణ్ కాకినాడలో వారాహి యాత్ర సందర్భంగా కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖరరెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనను అవినీతి ‘ద్వారం)పూడి చంద్రశేఖర్ గా అభివర్ణించారు. ద్వారంపూడిపై జగన్ బినామీ అనీ, అవినీతికి కేరాఫ్ అడ్రస్ అనీ విమర్శలు గతం నుంచీ ఉన్నాయి. జగన్ ప్రాపకం కోసం అటువంటి ద్వారంపూడికి మద్దతుగా ముద్రగడ అప్పట్లో చేసిన ప్రయత్నం కాపు సామాజికవర్గంలో ముద్రగడకు ఉన్న ప్రతిష్టను దిగజార్చింది. మసకబార్చింది. అప్పట్లో ద్వారంపూడికి సమర్ధనగా, ఆయన కాపు ఉద్యమానికి ఎంతో మేలు చేశారని పేర్కొంటూ ముద్రగడ రాసిన లేఖ ఆయనకే బూమరాంగ్ అయ్యింది.  ఇంతకీ ఆ లేఖలో ముద్రగడ ఏం పేర్కొన్నారంటే... గ‌తంలో కాపు ఉద్య‌మ స‌మ‌యంలో ఉద్య‌మ కార్య‌క్ర‌మాల‌కు వ‌చ్చిన యువ‌త‌కు ద్వారంపూడినే ఉప్మా పెట్టించార‌ని.. వారి త‌ర‌లింపుకు లారీలు ఏర్పాటు చేశార‌ని ముద్రగ‌డ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. ఆ ఒక్క లేఖ కాపుసామాజిక వర్గంలో ముద్రగడపై ఉన్న గౌరవాన్ని మంటగలిపిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అదే విధంగా  గోదావరి జిల్లాల్లోని కాపు యువత పెద్ద ఎత్తున ముద్రగడకు నాటి ఉద్యమ సమయంలో తాము తిన్న ఉమ్మాకు డబ్బులు ఇవిగో అంటూ వెల్లువలా మనీయార్డర్లు పంపించారు.    నిజానికి సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌ల్లో ఒక‌రైన ముద్ర‌గ‌డ పద్మ‌నాభంకు ఒక‌ప్పుడు కాపు యువ‌త‌లో మంచి క్రేజే ఉండేది. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల కోసం ఆయ‌న ఉద్య‌మించిన స‌మ‌యంలో ల‌క్ష‌లాదిగా యువత ఆయ‌న వెంట న‌డిచారు. అయితే, 2019 ఎన్నిక‌లకు ముందు కాపుల‌కు రిజర్వేష‌న్లకు సుముఖంగా ఉన్న చంద్ర‌బాబును కాదని.. ఆ ప్ర‌తిపాద‌న‌కు నో చెప్పిన జ‌గ‌న్ కు ముద్ర‌గ‌డ‌ మద్దతు ఇచ్చారు. కానీ.. గ‌త నాలుగేళ్ల‌లో ఆ వ‌ర్గానికి జ‌గ‌న్ చేసిందేమీ లేకపోగా కాపు రిజర్వేషన్లు అయ్యే పని కాదని తెగేసి చెప్పారు. అంతకు ముందు ప్రభుత్వ ప్రతిపాదనలను సైతం పక్కన పెట్టేశారు.  ఆయన జనసేన తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం ఖరారైపోయిందనీ, పెద్దాపురం లేదా మరో నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు ముద్రగడ చల్లారావు వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతారనీ వైసీపీ వర్గాలు అప్పట్లో చాలా గట్టిగా చెప్పారు. ముద్రగడ వైసీపీ ఎంట్రీకి జనవరి 2 ముహూర్తం కూడా ప్రకటించేశారు. అయితే జనవరి 2 వచ్చేసింది. వెళ్లిపోయి కూడా వారం రోజులు అయ్యింది. అయితే ఎక్కడా ముద్రగడ వైసీపీ ఎంట్రీ గురించిన వార్తలు రాలేదు. ఆయన కూడా నోరు మెదిపిన దాఖలాలు లేవు. ఈ తరుణంలో జనసేన, కాపు జేఏపీకి చెందిన కాపు నేతలు  ముద్రగడతో భేటీ కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తాడేపల్లిగూడెం జనసేన ఇన్ చార్జ్ బోలిశెట్టి శ్రీనివాసరావులు కిర్లంపూడి వెళ్లి మరీ ముద్రగడతో భేటీ అయ్యారు. పైకి మర్యాదపూర్వక భేటీయే అని చెబుతున్నా వీరి మధ్య రాజకీయ చర్చలు జరిగాయనీ, త్వరలో అంటే రానున్న రెండు మూడు రోజుల్లోనే జనసేన ముఖ్య నేతలో ముద్రగడను కలిసే అవకాశం ఉందనీ జనసేన వర్గాలు చెబుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ ముద్రగడ వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడినా, వైసీపీలో సిట్టింగుల మార్పు రగడ తరువాత ముద్రగడ మౌనముద్ర వహించారు. ఏ పార్టీకి మద్దతుగా నోరెత్తలేదు. ఈ నేపథ్యంలోనే జనసేన నేతలు ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

జగన్ ప్రతి అడుగూ పరాజయం దిశగానే?!

వైసీపీ అధినేత, ఏపీ సీఎం  జగన్ రెడ్డి పరిస్థితి నోరు తెరవాలంటే భయం, అడుగుకదపాలంటే జంకు అన్నట్లుగా తయారైంది. వచ్చే ఎన్నికలలో గెలవాలంటే సిట్టింగులను మార్చేసి కొత్త ముఖాలను బరిలోకి దింపడమే అని భావిస్తున్న జగన్.. ఆ దిశగా వేసే ప్రతి అడుగూ ఆయనను పరాజయం దిశగానే నడిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సొంత పార్టీ నేతలు సైతం అదే అంటున్నారు. అందుకే 11 మందిని మారుస్తూ గొప్పగా విజయం దిశగా అడుగులు పడుతున్నాయని  ప్రకటించుకున్న వైసీపీ అధినేత.. ఆ తొలి విడత మార్పులతో వచ్చిన రియాక్షన్ చూసి రెండో జాబితా విడుదల చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. అసంతృప్తులను తాడేపల్లి పిలిపించుకుని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేశారు. ఎలాగోలా రెండో జాబాతా విడుదల చేసిన తరువాత వైసీపీలో భూ కంపం పుట్టింది. రాజీనామాలు, తిరుగుబాట్లతో పలువురు నేతలు జగన్ కు ఎదురు తిరిగారు. అలా తిరిగిన వారిలో సొంత సామాజికవర్గానికి చెందిన వారు కూడా ఉండటం జగన్ ను కంగుతినిపించింది. దీంతో గత వారం రోజులుగా 15 మంది సిట్టింగుల మార్పుతో  మూడో జాబితా అంటూ లీకులైతే ఇస్తున్నారు కానీ ప్రకటించే ధైర్యం చేయడం లేదు. అయితే ఆ లీకులతోనే వైసీపీలో అసమ్మతి ఏ స్థాయిలో ఉందో అవగతమౌతోంది. ఒకరి తరువాత ఒకరుగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు.  ఈ అసమ్మతిని చల్లార్చేందుకు ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో పడిన జగన్ తాను ద్వేషించే సామాజిక వర్గానికి చెందిన వారిని పార్టీలోకి ఆహ్వానిస్తే లెవెల్ అయిపోతుందని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే తెలుగుదేశం వద్దనుకున్న కేశినేని నానిని పార్టీలో చేర్చుకున్నారు. ఇందు కోసం ఆయన వైసీపీ ప్రతినిథులను పంపి మరీ రెండు, మూడు అంటూ టికెట్ల ఆఫర్ ఇచ్చారు. పార్టీలో తనను నమ్ముకుని తొలి నుంచీ ఉన్నవారికి టికెట్లు లేవంటూ మొండి చేయి చూపుతున్న జగన్, ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చే వారికి రెడ్ కార్పెట్ వెల్కం పలకడం పార్టీలో అసమ్మతి  మరింత ప్రజ్వరిల్లేందుకు కారణమౌతోంది. కేశినేని నానితో జగన్ భేటీ అయిన రోజే, వైసీపీ నుంచి ఒక వికెట్ పడిపోయింది. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీకి గుడ్ బై  చెప్పేశారు. పార్టీకే కాకుండా, ఆ పార్టీ నుంచి గెలిచిన లోక్ సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అలా చేయడానికి ముందు వైసీపీలో బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్నీ, ఎదురౌతున్న అవమానాలనూ పూసగుచ్చినట్లు చెప్పారు.  నా బీసీలు, నా ఎస్టీలు, ఎస్సీలు అంటూ ప్రసంగాలు చేసే జగన్ వారి పట్ల ఎంత అవమానకరంగా వ్యవహరిస్తారో, ఎంత చులకనగా చూస్తారో వివరించారు. జగన్ తనను అవమానించిన తీరును వివరిస్తూ ఎమోషనల్ అయ్యి కంటనీరు పెట్టుకున్నంత పని చేశారు.   పార్టీ అధినేత జగన్ తో భేటీ కోసం ఆయన విజయవాడలోని ఓ హోటల్‌లో   ఐదు రోజులుగా మకాం వేసినా జగన్ దర్శన భాగ్యం (అప్పాయింట్ మెంట్) దొరకలేదని డాక్టర్ సంజీవ్ కుమార్ చెప్పారు. ఈ ఐదు రోజులుగా ప్రతీ రోజూ.. తాడేపల్లి ఆఫీసులో ఉండే వాళ్లకు ఫోన్  చేసి, తాను వచ్చి కలుస్తానంటే.. వద్దు వద్దు మేం చెబుతాం అప్పుడు రండి అంటూ ఒకే సమాధానం వచ్చిందని వివరించారు. ఇక విసిగి పార్టీలో గౌరవం సంగతి తరువాత, ఇంత అవమానం జరుగుతుంటే ఇక భరించలేక బయటకు వచ్చేశానని డాక్టర్ సంజీవ్ కుమార్ చెప్పాురు. ఆ సందర్భంగా ఇటీవల సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ బరిహంగ సభలోనే జగన్ తో అప్పాయింట్ మెంట్ ఇప్పించండి అని వేడుకున్న సంగతిని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది.  ఇప్పుడు డాక్టర్ సంజీవ్ కుమార్ కూడా అదే చెబుతున్నారు. జగన్ ను సరే ఆఖరికి పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ముఖం చాటేసి తనను కలవడానికి ఇష్టపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ఓ ఎంపీని అయిన తనకు ఈ దుస్థితేమిటంటూ జగన్ ను నిలదీశారు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత ఇప్పటి వరకూ కేవలం రెండంటే రెండు సార్లు మాత్రమే జగన్ తో భేటీ అయ్యాననీ,  అప్పుడు కూడా ఆయన ఊకదంపుడు మాటలే కానీ తన మాట వినిపించుకున్న పాపాన పోలేదని గుర్తు చేసుకున్నారు. బీసీలకు పెద్ద పీట వేశానని ఘనంగా చాటుకునే జగన్ మోహన్ రెడ్డి, ఆచరణలో మాత్రం వారిని అడుగడుగునా అవమానాల పాలు చేస్తారని ఆరోపించారు.  డాక్టర్ గా సమాజంలో, జనంలో మంచి పేరు ఉన్న తనను జగన్, ఆయన అనుయాయులూ ఘోరంగా అవమానించారని డాక్టర్ సంజీవ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలో పోటీకి ఒక వేళ వైసీపీ టికెట్ లభించినా తాను ఆ పార్టీ తరఫున బరిలోకి దిగడానికి సిద్ధంగా లేనని కుండబద్దలు కొట్టేశారు. కుటుంబ సభ్యులతో, అనుచరులతో చర్చించి  రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. భవిష్యత్ కార్యాచరణను రానున్న రోజులలో ప్రకటిస్తానని చెప్పారు. రానున్న రోజులలో సంజీవ్ కుమార్ దారిలో పలువురు పయనించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఆ విశ్లేషణలు వాస్తవమేనని అనిపించక మానదు. రాజీనామాల భయంతోనే జగన్ మూడో జాబితా విడుదలకు ధైర్యం చేయలేకపోతున్నారని పార్టీ వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి. 

అటు అంబటి రాయుడు.. ఇటు లావు కృష్ణదేవరాయులు.. జగన్ కు డబుల్ షాక్!

అటు అంబటి రాయుడు ఇటు కృష్ణదేవరాయులు.. జగన్ డబుల్ షాక్ ఇచ్చారు. ఇరువురూ కూడా జగన్ నిర్ణయంతో గట్టిగా విభేదించి రోడ్డెక్కారు. ఈ ఇరువురి ధిక్కారానికీ కారణం ఒక ఎంపీ సీటు. అవును గుంటూరు లోక్ సభ నియోజకవర్గ పార్టీ టికెట్ విషయంలో  అటు అంబటి రాయుడినీ, ఇటు కృష్ణ దేవరాయులు జగన్ కు షాక్ ఇచ్చారు. విషయమేమిటంటే గత నెల 28న వైసీపీ కండువా కప్పుకున్న క్రికెటర్ అంబటి రాయుడు సరిగ్గా పది రోజుల వ్యవధిలో పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. ఆయన బయటకు రావడానికి కారణమేమిటంటే.. ఆయన పార్టీ కండువా కప్పుకోవడానికి కారణమైన గుంటూరు ఎంపీ టికెట్ ఆయనకు ఇచ్చే విషయంలో జగన్ మాట తప్పడమే. ఔను అంబటి రాయుడు చాలా కాలం నుంచీ కూడా గుంటూరు నుంచి లోక్ సభకు పోటీ చేయాలని ఆశిస్తున్నారు. ఆ మేరకు జగన్ నుంచి స్పష్టమైన హామీ దక్కడంతో గత ఆరు నెలలుగా అక్కడే మకాం వేసి పార్టీలోనూ, నియోజకవర్గంతోనూ పరిచయం పెంచుకున్నారు. అన్ని బాగున్నాయి అనుకుని గత నెల 28న జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుని వైసీపీలో చేరారు. అయితే ఇలా చేరారో లేదో అలా గుంటూరు టికెట్ విషయంలో జగన్ పునరాలోచనలో పడ్డారని తెలిసి క్షణం ఆలోచించకుండా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అదలా ఉంచితే  నరసరావు పేట ఎంపీ లావు కృష్ణదేవరాయును ఆయన స్థానం నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీలోకి దింపాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని లావుకు తెలియజేశారు. అయితే అందుకు లావు కృష్ణదేవరాయులు ససేమిరా అన్నారు. తాను నియోజకవర్గం మారే ప్రశ్నే లేదనీ, అవసరమైతే పోటీకి దూరంగా ఉంటానని కృష్ణ దేవరాయులు జగన్ కు ముఖంమీదే కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.  సో గుంటూరు లోక్ సభ నియోజకవర్గం విషయంలో ఒకే సారి జగన్ కారణంగా  అంబటి రాంబాబు, లావు కృష్ణ దేవరాయలు జగన్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. అంబటి రాయుడు వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించేసి బయటకు వచ్చేస్తే.. లావు తన సన్నిహితులు, సహచరులతో చర్చిస్తున్నారు. ఇక అంబటి రాయుడు నేడో రేపో జనసేన గూటికి చేరనున్నారని అంటున్నారు. ఇక లావు కృష్ణ దేవరాయులు కూడా తెలుగుదేశం పార్టీలోకి టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు.  

ఆ మూడు కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిలు

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిపై జగన్ సర్కార్ బనాయించిన ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, మద్యం కేసులలో ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ విషయంలో చంద్రబాబు తన కుటుంబానికి మేలు జరిగేలా వ్యవహరించారనీ, అలాగే చంద్రబాబు హయంలో తీసుకువచ్చిన మద్యం, ఇసుక విధానాలలో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ కేసులలో తనను అరెస్టు చేయకుండా యాంటిసిపేటరీ బెయిలు కోరుతూ చంద్రబాబు ఏపీ హై కోర్టును ఆశ్రయించారు. ఈ మూడు కేసులపై హైకోర్టులో గతంలోనే వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రిజర్వ్ అయ్యింది. ఈ తీర్పులను హైకోర్టు ఈ రోజు వెలువరించింది. మూడు కేసులలోనూ చంద్రబాబుకు భారీ ఊరట కలిగిస్తూ యాంటిసిపేటరీ బెయిలు మంజూరు చేసింది. అలాగే మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రైటైర్డ్ ఐఏఎస్ నరేష్ కు కూడా యాంటిసిపేటరీ బెయిలు లభించింది. ఇలా ఉండగా హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇలా ఉండగా స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై సుప్రీంలో వాదనలు ముగిసి తీర్పు రిజర్వ్ అయిన సంగతి తెలిసిందే. ఆ కేసులో కూడా చంద్రబాబు క్వాష్ కు అనుమతి లభిస్తే.. ఇప్పడు ఆయనకు యాంటిసిపేటరీ బెయిుల లభించిన మూడు కేసులూ కూడా దూది పింజల్లా ఉఫ్ మని ఎగిరిపోతాయి. 

మంత్రి రోజాకు జగన్ షోకాజ్ నోటీసు.. సస్పెన్షనే తరువాయా?

పరిచయం అక్కర్లేని పేరు మంత్రి ఆర్కే రోజా. ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ గా గుర్తింపు పొందిన రోజా పరిస్థితి వైసీపీలో అగమ్యగోచరంగా మారింది. వరుసగా రెండు సార్లు నగరి నుంచి వైసీపీ తరఫున విజయం సాధించిన రోజా.. జగన్ కేబినెట్ లో మంత్రి కూడా. అయినా ఇప్పుడు ఆమెకు ఆ నియోజకవర్గం నుంచి జగన్ మరో చాన్స్ ఇస్తారా అంటే అనుమానమే అని వైసీపీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.   మొత్తంగా ఇప్పడు  వైసీపీలో   టికెట్ల కల్లోలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటి వరకూ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండగా.. రాత్రికి రాత్రి ఖాళీ చేసి మరో నియోజకవర్గానికి వెళ్లిపోవాలని పెద్దలు ఆదేశాలు ఇస్తున్నారు. మరికొందరికైతే నీ నియోజకవర్గం మరొకరికి ఇచ్చేస్తున్నాం.. మీరు పక్కకి తప్పుకోండని హుకుం జారీ చేస్తున్నారు. అసలు ఏ ఆధారంగా మమ్మల్ని మార్చేస్తున్నారని అడగాలని ప్రయత్నించినా సీఎం దగ్గరకు రానివ్వడం లేదు. దీంతో మరో చోటకి వెళ్లే పరిస్థితి లేదని బహిరంగంగానే ససేమీరా అనేవాళ్ళు కొందరైతే.. అసలు పార్టీకి, పార్టీ అధినేతకు రాంరాం చెప్పేసి వెళ్లిపోతున్న వారు మరికొందరు. మంత్రులు, సీనియర్లు, జగన్ కు ఫాలోవర్లు, జగన్ తో మంచి సంబంధాలున్న వారు, కుటుంబంతో అనుబంధం ఉన్న వారు.. ఇలా ఎవరైనా సరే కనీసం మాట కూడా చెప్పకుండా జగన్ మార్చేస్తున్నారు. బుజ్జగింపులు కమిటీ పెద్దలు తాడేపల్లికి పిలిచి ఈ అసంతృప్త ఎమ్మెల్యేలతో మాట్లాడాలని ప్రయత్నించినా వారు వినే పరిస్థితి లేదు. జగన్ తో ఒక్కసారి మాట్లాడాలని ప్రయత్నించినా.. మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. నా మాటే శాసనం అని సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. దీంతో నిన్నటి వరకూ వైసీపీలో  అంతా  అనుకున్న వాళ్లకి కూడా రాత్రికి రాత్రి ఫేట్ మారిపోతున్నది. ఈ కోవలోనే మంత్రి రోజాకి కూడా కష్టాలు మొదలయ్యాయి. ఏ చిన్న అవకాశం దొరికినా తెలుగుదేశం అధినేత చంద్రబాబును, లోకేష్ ను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి తనదైన ప్రత్యేక శైలిలో దూషణాత్మక విమర్శలు గుప్పించే  రోజాను ఇప్పుడు సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్నారు. దీంతో వైసీపీ అధినేత జగన్ కు మద్దతుగా ఆమె ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శలు జబర్దస్త్ కామెడీని మించిన హాస్యాన్ని పండిస్తున్నాయి.  నిజానికి నగరిలో సొంత పార్టీ నేతలే రోజా మీద గుర్రుగా ఉన్నారు. ఇక రోజా, పెద్దిరెడ్డి మధ్య జరుగుతున్న యుద్ధం అంతా ఇంతా కాదు. రోజా విషయంలో పెద్దిరెడ్డి మొదటి నుంచి సానుకూలంగా లేరు. నగరి నుంచి బీసీ వర్గానికి చెందిన ఓ నేతకు టికెట్ ఇప్పించేందుకు పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నించడమేమిటి, ఆ నేతకు జగన్ ఇప్పటికే స్పష్టమైన హామీ కూడా ఇచ్చేశారన్న ప్రచారం జరుగుతోంది. అయితే రోజా మాత్రం తాను వచ్చే ఎన్నికలలో నగరి నుంచే పోటీలో ఉంటానని ధీమాగా చెబుతూ వస్తున్నారు. రోజాకు నగరి టికెట్ ఉంటుందా? ఉండదా అన్న చర్చ పార్టీలో సాగుతుండగానే ఆమెకు జగన్ భారీ షాక్ ఇచ్చారన్న ప్రచారం జోరందుకుంది. రోజాకు పార్టీ హైకమాండ్ షోకాజ్ నోటీసులు ఇచ్చిందనీ, 24 గంటల్లో వివరణ ఇవ్వకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామనీ హెచ్చరించినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తోంది.   చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీలో మంత్రి పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా వైసీపీలో పెద్దిరెడ్డి హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అలాంటి రోజాకు పెద్దిరెడ్డికీ మధ్య విభేదాలు ఉన్న సంగతీ తెలిసిందే. అందుకే రోజా మంత్రిగా ఉన్నా జిల్లాలో ఆమె ఆటలు సాగడం లేదన్న సంగతీ తెలిసిందే. ఇప్పటికే పలు మార్లు మంత్రిగా అందరినీ కలుపుకుని పోవాలంటే అధిష్టానం రోజాను హెచ్చరించింది. అయితే రోజా  మాత్రం మంత్రి పెద్దిరెడ్డితో సమన్వయం చేసుకునే విషయంలో రాజీలేదన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.   తాజాగా నూతన సంవత్సర వేడుకలలో భాగంగా ఆమె బెంగళూరులోని ఒక పబ్ లో డ్యాన్సులు చేసిన వీడియోలు  వైరల్ అయ్యాయి. మంత్రి హోదాలో ఉన్న రోజా ఇలా పబ్బుల్లో డ్యాన్సులు చేయడమేమిటంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో ఆందోళనలు, ధర్నాలు కొనసాగుతుండగా.. మంత్రి హోదాలో ఉన్న రోజా అవేవీ పట్టనట్టు బెంగళూరు పబ్ కు వెళ్లి ఎంజాయ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె పబ్బులో డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ అవ్వడం వైసీపీ ప్రతిష్టను కూడా దిగజార్చింది .  ఈ నేపథ్యంలోనే  సీఎం జగన్  రోజాకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి రోజా వివరణ ఇస్తారా? ఆమె వివరణతో జగన్ సంతృప్తి చెందుతారా, లేక సస్పెన్షన్ వేటు వేస్తారా అన్న చర్చ  చిత్తూరు వైసీపీలో జోరుగా సాగుతోంది. షోకాజ్ నోటీసుకు రోజా బెంగళూరు పబ్బులో డ్యాన్స్ చేయడం అన్నది ఒక సాకు మాత్రమేననీ, వాస్తవానికి మంత్రి పెద్దిరెడ్డితో విభేదాలు, వివాదాల కారణంగానే ఆమెను వదిలించుకుకోవాలనుకోవడమే కారణమని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. అయితే అసలింతకూ రోజాకు షోకాజ్ నోటీసు అందిందా? అందితే ఆమె స్పందన ఏమిటి అన్నది తేలాల్సి ఉంది. 

ఏపీలో బీజేపీ రాజకీయ పయనంపై క్లారిటీ?

అడ్డగోలు ప్రయోగాలతో  దక్షిణాది రాష్ట్రాలలో  పార్టీ ఉనికినే నామమాత్రంగా చేసిన కమలనాథులు ఇప్పుడు తప్పుటడుగులను సరిచేసుకునే ప్రయత్నంలో పడ్డారా? కర్నాటక, తెలంగాణలలో జరిగిన నష్టం జరిగిపోయింది. కనీసం ఏపీలోనైనా ఉనికి కాపాడుకుని జాగ్రత్త పడదామనుకుంటున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలతో పోలిస్తే బీజేపీకి ఏపీలో ఉన్న పట్టు శూన్యం అనే చెప్పాలి. కర్నాటకలో అధికారం చేజిక్కించుకున్న చరిత్ర ఉంది. తెలంగాణలో గట్టి పట్టు ఉంది. అధికారానికి ఆమడదూరంలో ఆగిపోయినా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి ఓట్లు, సీట్లూ కూడా పెరిగాయి. అదే ఏపీ విషయానికి వస్తే ఆ పార్టీకి పట్టూ లేదు, ఓట్లూ లేవు, సీట్లూ రావు. ఈ విషయం కమలనాథులకూ స్పష్టంగా తెలుసు. గత ఎన్నికలలో  ఏపీలో ఒంటరిగా బరిలోకి దిగిన ఆ పార్టీకి వచ్చిన సీట్లు శూన్యం. ఓట్లు కూడా బొటాబొటీగా ఒక శాతం. అటువంటి రాష్ట్రంలో ఆ పార్టీ ఎన్నికల సమాయత్తం ఎలా ఉండాలి. అయితే గత నాలుగున్నరేళ్లుగా ఆ పార్టీ రాష్ట్రంలో బలోపేతం అవ్వడానికి ఇసుమంతైనా ప్రయత్నించలేదు సరికదా, అధికార పక్షానికి అండగా నిలుస్తూ, విపక్షాన్ని బలహీనపరచడమే ధ్యేయం అన్నట్లుగా సాగింది. ఏపీలో తెలుగుదేశం బలహీనపడితే చాలు.. అధికార పక్షం జట్టు మనచేతుల్లోనే ఉంది ఎప్పుడు కావాలంటే అప్పుడే తొక్కేయచ్చు అన్నట్లుగా బీజేపీ హై కమాండ్ ఏపీ విషయంలో వ్యవహరించింది. జగన్ అడ్గగోలు పాలనకు అంత కంటే అడ్డగోలుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ మద్దతు ఇచ్చి అండగా నిలవడంతో రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. అసలే విభజన హామీల అమలు విషయంలో మొండి చేయి చూపిందన్న ఆగ్రహంతో ఉన్న జనాలకు.. పాలన అంటే బటన్ నొక్కుడే అన్న చందంగా ముందుకు సాగుతున్న జగన్ కు కేంద్రంలోని బీజేపీ సర్కార్ అండదండలు అందిస్తుండటంతో  ఆగ్రహం తీవ్ర వ్యతిరేకతగా మారింది. ఇప్పుడు అంతా అయిపోయిన తరువాత జ్ఝానోదయం అయినట్లుగా బీజేపీ జగన్ పార్టీకి దూరం జరుగుతోంది. అలా దూరం జరగడం వల్ల ప్రయోజనం లేదు కనుక రాష్ట్రంలో ఇప్పటికే పొత్తులో ఉన్న జనసేన ద్వారా తెలుగుదేశం పార్టీకి చేరువ కావడానికి పావులు కదుపుతోంది. జనసేన, తెలుగుదేశం పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. పొత్తు సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీ నేతలు ఎవరికి తోచినట్లు వారు చేస్తున్న వ్యాఖ్యలతో ఒకింత అయోమయ పరిస్థితి నెలకొంది. అయితే ఆ పార్టీ నేతల నుంచి వస్తున్న భిన్న వ్యాఖ్యలను పక్కన పెడితే ఒకటి మాత్రం స్పష్టమైపోయింది. బీజేపీ హై కమాండ్ ఏపీలో తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసే వచ్చే ఎన్నికలలో సాగాలన్న నిర్ణయానికి వచ్చేసింది. ఇటీవల విజయవాడలో జరిగిన బీజేపీ కోర్‌ కమిటీ భేటీ ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.  అనుభవమయితేగానీ తత్వం బోధపడదన్నట్లుగా ఇంత కాలం అధికార వైసీపీతో అంటకాగి  ఇప్పుడు నిండా మునిగిన తర్వాత  దిద్దుబాటకు దిగింది. ఇప్పటి దాకా అసలు ఏపీలో ఎవరితోనూ పొత్తులు వద్దని, ఐదారు సీట్ల కోసం పొత్తులు పెట్టుకోవలసిన పనిలేదనీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌జీ  తన వద్దకు వచ్చిన సీనియర్లకు చెబుతూ వచ్చారు. అయితే  తాజాగా విజయవాడలో  పార్టీ  కోర్‌ కమిటీ, ముఖ్యనేతల సమావేశంలో మాత్రం అదే సంతోష్ జీ అందుకు పూర్తి భిన్నమైన వైఖరి ప్రదర్శించారని అంటున్నారు. స్వయంగా సంతోష్ జీ సమావేశానికి హాజరు కాకపోయినప్పటికీ, హాజరైన ఆ  పార్టీ జాతీయ సహ సంఘటనా మంత్రి శివప్రకాష్‌జీ స్వయంగా పొత్తు ప్రస్తావన తీసుకు వచ్చారు. తొలుత అసలు ఎన్నికల్లో పొత్తు ఉండదన్న భావనతో, నాయకులు మానసికంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆ తర్వాత పొత్తు ఉంటే ఎలా ఉంటుంది? లేకపోతే ఎలా ఉంటుంది? అని ఆయనే ప్రశ్నించారట. దానితో పొత్తుల విషయంలో పార్టీ నాయకత్వ వైఖరిలో మార్పు వచ్చిందని పార్టీ రాష్ట్ర నేతలకు బోధపడిపోయింది.  టీడీపీతో పొత్తు ఉండాలా? వద్దా? అన్న అంశంపై రాష్ట్ర నేతల అభిప్రాయాలను ఆయన లిఖిత పూర్వకంగా ఇచ్చారు.   అసలు పొత్తే వద్దన్న పరిస్థితి నుంచి.. పొత్తు ఉంటే ఎలా ఉంటుందన్న అభిప్రాయ సేకరణ వరకూ వ్యవహారం వచ్చిందంటే.. నేడో రేపో పొత్తు దిశగా కార్యాచరణ కూడా ప్రారంభమైనా ఆశ్చర్యపోనవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

చంద్రబాబు విజన్.. వైఎస్ వేగం... రేవంత్ నెల రోజుల పాలన!

తెలంగాణ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టి మంగళవారం (జనవరి 9) నాటికి సరిగ్గా నెల రోజులు పూర్తయ్యింవది. సీఎంగానే కాకుండా టీపీసీసీ చీఫ్‌గా కూడా జోడు బాధ్యతలను జమిలిగా నిర్వహిస్తున్న రేవంత్  సీఎంగా నెలరోజుల పాలనపై జనబాహుల్యంలో ప్రశంసలే వస్తున్నాయి. ఇక పొలిటికల్ సర్కిల్స్ లో అయితే ఆయన నెల రోజుల పాలన చూస్తే చంద్రబాబు దక్షత, వైఎస్ వేగం గుర్తుకు వస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా   రేవంత్‌రెడ్డి సహజ సిద్ధమైన దూకుడు ఎక్కడా తగ్గిన దాఖలాలు లేవు. అదే సమయంలో సంయమనంతో పార్టీలో అందరినీ కలుపుకుని వెడుతున్న తీరు పరిశీలకుల ప్రశంసలను అందుకుంటోంది.  అదీ కాకుండా ఈ నెల రోజులలో పార్టీలో ఎక్కడా రేవంత్ పట్ల చిన్న పాటి  వ్యతిరేకత కూడా కనిపించలేదు. సరికదా రేవంత్ సర్కార్ సమష్టిగా ముందుకు సాగుతోందన్న భావన కలిగింది. రేవంత్ కేబినెట్ సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటోంది. అదే సమయంలో మంత్రులు స్వేచ్ఛగా స్వతంత్రంగా పని చేస్తున్నారు. సాధారణంగా గ్రూపు విభేదాలతో నిత్యం విమర్శలు, ప్రతివిమర్శలతో  ఉండే కాంగ్రెస్ లో రేవంత్ సీఎం అయిన తరువాత సీన్ మారిపోయింది. విమర్శలు లేవు, విభేదాలు లేవు. ఎక్కడ చూసిన ఐకమత్యం, సమష్టితత్వం. ఆ కారణంగానే రేవంత్ నెళ్లాల పాలన రాష్ట్ర ప్రగతి, పురోగతి, ప్రజా సంక్షేమం విషయాలలో సవ్యంగా ముందుకు వెడుతున్నదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇక పరిశీలకులు అయితే దూకుడు, సమన్వయం కలగలిసిన పరిణితి గలిగిన నేతగా రేవంత్ ఈ నెల రోజులలో తనను తాను ప్రూవ్ చేసుకున్నారని అంటున్నారు.   అసెంబ్లీలో తన ముఖం చూడడానికే ఇష్టపడని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సీఎంగా పగ్గాలు అందుకున్న వెంటనే రేవంత్  ఆస్పత్రికి వెళ్లి మరీ పరామర్శించారు.  అదే సమయంలో కేసీఆర్ సర్కార్ అనితీని, అక్రమాలపై  చట్ట ప్రకారం చర్యలను తీసుకునే విధంగా దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేశారు.  ఇక ఒంటి చేత్తో రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధకారంలోకి తీసుకువచ్చిన తనకు పోటీగా సీఎం పదవి కోసం చివరి వరకూ పోటీ పడిన సీనియర్లతో సమన్వయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు రేవంత్. రేవంత్‌.. తనతో సీఎం పదవికి పోటీ పడిన వారితో కలసి నడుస్తున్నారు. తన ఆలోచనలను వారితో పంచుకుంటున్నారు. సమష్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సరిగ్గా ఈ సందర్భంగానే వైఎస్ లోని వేగం, కలుపుగోలుతనం రేవంత్ లో కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక పాలనకు సంబంధించిన అంశాలలో..  సమీక్షలు, అధికారులతో భేటీలు- నిర్ణయాలు- మీడియాతో భేటీలు వంటి విషయంలో  చంద్రబాబులోని దక్షత కనిపిస్తోంది.  కేసీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో సచివాలయం ప్రజలకు ప్రవేశార్హత లేని ప్రదేశంగా ఉండేది.  ఎమ్మెల్యేలకు సైతం నో ఎంట్రీ బోర్డులే దర్శనమిచ్చేవి.  ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి. అలాగే కేసీఆర్ హయంలో ప్రగతి భవన్ దొరల కోటలను తలపించేది.  ఎవరికీ ప్రవేశం ఉండేది కాదు. అటువంటిది ఇప్పుడు ప్రగతి భవన్ ప్రజా భవన్ అయిపోయింది. నిత్యం వందల వేల సంఖ్యలో ప్రజలు అక్కడకు వస్తున్నారు. అర్జీలు ఇస్తున్నారు. సమస్యలు చెప్పుకుంటున్నారు. రేవంత్ నివాసం కూడా నిత్యం జనసందోహంతో కళకళలాడుతోంది.  ప్రజలకు తేడా స్పష్టంగా తెలుస్తోంది. గడీల పాలన స్థానంలో  ప్రజాస్వామ్య పాలన వచ్చిందన్న భావన ప్రజలలో వ్యక్తం అవుతోంది.   మొత్తంగా నెల రోజుల పాలనలో రేవంత్ కు అన్ని వర్గాల నుంచీ అంటే ప్రజల నుంచీ, పరిశీలకుల నుంచీ, మేధావుల నుంచీ కూడా మంచి మార్కులే పడ్డాయి. ఇదే ఒరవడిని రేవంత్ ముందు ముందు కూడా కొనసాగిస్తారని ఆశిద్దాం. 

జగన్ ముఖం చెల్లడం లేదు.. అందుకే చాటేస్తున్నారు!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికలలో గెలుపు మంత్రం సిట్టింగులను మార్చడమే అన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు. ఎంత వ్యతిరేకత వ్యక్తమైనా, పార్టీ నుంచి నేతలు జారిపోతున్నా, పోటీ చేయం మొర్రో అని మొత్తుకుంటున్నా వినడం లేదు. నేను చెప్పాను, మీరు విన్నారు అన్నట్లుగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని నిర్ణయాలు తీసేసుకుని వాటిని అమలు చేసేస్తున్నారు. అయితే జగన్ సిట్టింగుల మార్పు నిర్ణయం వెనుక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సిట్టింగులకే టికెట్లిచ్చి కేసీఆర్ దెబ్బతిన్నారనీ, తాను అలా కాకుండా సిట్టింగులను మార్చేసి ఎన్నికలలో లబ్ధి పొందాలన్నది ఆయన అభిప్రాయంగా చెబుతున్నారు. అయితే కడుపు నొప్పికీ, కాలు నొప్పికీ ఒకటే ముందైతే ఎలా అని వైసీపీ నేతలు మొత్తు కుంటున్నారు. తెలంగాణలో పరిస్థితి వేరనీ, ఏపీలో పరిస్థితి ఎంతగా చెప్పినా జగన్ తలకెక్కించుకోవడం లేదంటున్నారు. అసలు గత ఎన్నికలలో అంటే 2019 ఎన్నికలలో జగన్ ఎన్నికల ప్రచారంలో  ఎమ్మెల్యే అభ్యర్థులను కాదు, తన ముఖం చూసి ఓటేయండి అని ప్రజలను కోరారు. జనం ఔదాల్చారు. అందుకే ఆ ఎన్నికలలో జగన్ పార్టీ 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు జగన్ నాడు తన ముఖం చూసి జనం ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారు. అలా మార్చేసే వారి స్థానాలలో పోటీలోకి దింపేందుకు ఇతర జిల్లాల నుంచి, కొండొకచో ఇతర రాష్ట్రాల నుంచీ కూడా అభ్యర్థులను దిగుమతి చేస్తున్నారు. కర్నాటక నుంచి బీజేపీ మాజీ ఎంపీని ఇప్పుడు ఏపీలో నిలబెడుతున్నారు.    అయితే జగన్ ఆఫర్ ను అంగీకరించి ఆయన మారమంటే మారడానికి మెజారిటీ ఎమ్మెల్యేలు అంగీకరించడం లేదు. నేతలను గెలిపించుకోలేనని చేతులెత్తేసిన నేత వెంట నడవాల్సిన అవసరం మాకు లేదంటూ తిరగబడుతున్నారు. సిట్టింగుల పనితీరు బాగా లేకపోతే  పార్టీ టికెట్ రిజెక్ట్ చేయాలి, అంతే కానీ ఇక్కడ నువ్వు గెలవవు కనుక మరో నియోజకవర్గానికి పోయి గెలవడానికి ట్రై చేయి అంటూ తరిమేయడమేమిటని అంటున్నారు. అసలు వాస్తవం ఏమిటంటే జనం ఆగ్రహం ఎమ్మెల్యేల మీద కంటే జగన్ మీదే ఎక్కువగా ఉందనీ పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు బాహాటంగానే చెబుతున్నారు. తమను సీటు మార్చడం కాదు, జగన్ ప్రచారానికి రాకుండా ఉంటే చాలు మా పాట్లేవో మేమే పడతాం అంటున్నారు. జనంలో జగన్ చెల్లని నాణెంగా మారిపోయారని అర్ధం చేసుకున్న పార్టీ నేతలు ఆయన ఆదేశాలను పాటించేందుకు పెద్దగా సుముఖత వ్యక్తం చేయడం లేదు. అందుకే జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన వారు సైతం కట్టు తెంచుకుని వెళ్లిపోతున్నారు.  ఇదీ ఇప్పుడు వైసీపీలో క నిపిస్తున్న దృశ్యం. వినిపిస్తున్న మాట! అసలు అన్ని తప్పులూ మీ  వద్దే పెట్టుకుని, ఎమ్మెల్యేలు, ఎంపీలను బలిపశువులను చేయడం ఏమిటి సొంత పార్టీ నేతలే జగన్ ను నిలదీస్తున్నారు? వై నాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న జగన్ ఆ ధీమా నిజమైతే   సిట్టింగులను మార్చడమెందుకని జగన్ నే సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఒకచోట చెల్లని రూపాయి, పక్క ఊర్లో పదిరూపాయల నోటెలా అవుతుందని నిలదీస్తున్నారు.  వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ  అధినేత జగన్‌పై సంధిస్తున్న  ఈ ప్రశ్నాస్త్రాలకు జగన్ నుంచి మౌనమే సమాధానంగా వస్తోంది. నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ గత ఎన్నికలలో సందర్భం ఉన్నా లేకున్నా చెప్పిన జగన్ ఇప్పుడు మాత్రం నేను వినను, నేను చూడను, నేను మాట్లాడను అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.  గత ఎన్నికల ముందు నన్ను చూసి ఓటేయమన్న జగన్ జనానికి ఇప్పుడా మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు. జనానికి మెహం ఎందుకు చూపించలేకపోతున్నారు. ఎందుకు ముఖం చాటేస్తున్నారు. జనం ముదుకు రావడానికి ఆయన ముఖం చెల్లడం లేదా? అంటూ పార్టీ వర్గాల్లోనే కాదు రాజకీయ వర్గాలలో కూడా పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సందర్భంగా జగన్ తన పర్యటన సందర్భంగా జనానికి కనబడకుండా రోడ్లకు ఇరువైపులా పరదాలు ఏర్పాటు చేసుకోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. జనం ముందుకు వచ్చేందుకు జగన్ కు ముఖం చెల్లడం లేదనడానికి ఇంత కన్నా రుజువేం కావాలని అంటున్నారు.   గత నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ తీసుకున్న  నిర్ణయాలన్నీ పార్టీ పరంగా అయినా, ప్రభుత్వ పరంగా అయినా  ఏకపక్షంగా తీసుకున్నవేనని అటువంటప్పుడు ఆయన వైఫల్యాలకు తమను బలి చేయడమేమిటని వైసీపీ సిట్టింగులు ఫైర్ అవుతున్నారు. పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు, నామినేటెడ్ పదవుల నియామకాలలో తమ ప్రమేయం ఇసుమంతైనా లేదనీ, ప్రభుత్వ పథకాల రూపకల్పన అంశాల్లోనూ అదే పరిస్థితనీ, చివరాఖరికి మంత్రులతో కూడా సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుని, ఇప్పుడు  ఇప్పుడు వైఫల్యాలకు తమను  బాధ్యులను చేయడమేమిటని గరం అవుతున్నారు.   నియోజకవర్గాల్లో మమ్మల్ని డమ్మీలను చేసి, వాలంటీర్లతో పనిచేయించుకుంటున్నారు, నియోజకవర్గ పరిస్థితి వివరించేందుకు  తాడేపల్లి అపాయింట్‌మెంట్  దొరకదు. సీఎంఓ అధికారులకే   చెప్పుకోవాల్సిన పరిస్థితి, అసలు మాకే మొహం చాటేసీ నేత జనానికి ఎలా ముఖం చూపగలరంటూ పలువురు అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీకో దండం, జగన్ కో దండం అంటూ  గుడ్ బై చెప్పేస్తున్నారు.  అసలు 175కి 175 సీట్లు, 80 శాతానికిపైగా సంతృప్తకరస్థాయి, ఎస్సీ-ఎస్సీ-ఎస్టీ-మైనారిటీలంతా మనవైపే ఉన్నప్పుడు… 58 శాతం ఓటు బ్యాంకు ఉన్నప్పుడు.. మళ్లీ సీట్లు మార్చాడం ఎందుకన్న ప్రశ్నలు  ఇప్పుడు వైసీపీ వర్గాలలో వినిపిస్తున్నాయి.   జగన్ గారిని ఒక్కసారి చూపించమని మాజీమంత్రి, దళిత నేత డొక్కా లాంటివారు ప్రాధేయపడుతున్నారంటే పార్టీలో  నేతల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఇట్లే అవగతమౌతుందని విశ్లేషకులు అంటున్నారు.  దాదాపు పార్టీ నేతలందరిలోనూ ఇదే భావన వ్యక్తమౌతోందంటున్నారు.  

విజయవాడ లోక్ సభ బరిలోకి సుజనా చౌదరి?

విజయవాడలో రాజకీయం కాక రేగుతోంది. తెలుగుదేశం పార్టీకి స్థానిక ఎంపీ కేశినేని నాని రాజీనామా ప్రకటన.. అలాగే ఆయన కుమార్తె కేశినేని శ్వేత.. పార్టీతోపాటు డివిజన్ కార్పొరేటర్ పదవికి సైతం రాజీనామా తో విజయవాడ నుంచి బరిలో దిగనున్న టీడీపీ అభ్యర్థి ఎవరు..కేశినేని నాని సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నానేనా? అనే ఓ ప్రశ్న   పోలిటికల్ సర్కిల్‌లో  జోరుగా సాగుతున్నది.  ఓ వేళ రానున్న ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ కేశినేని చిన్నికి ఇస్తే.. కేశినేని నానితోపాటు ఆయనతోనే ఉన్న పలు వర్గాలు సైతం పార్టీకి దాదాపుగా దూరమవుతాయనే ఓ చర్చ ఆ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తున్నాయి. ఈ రెండు పార్టీలతో కలిసి వెళ్లే ఆలోచనలో బీజేపీ ఉందనే ఓ ప్రచారం అయితే నడుస్తోంది. అలాంటి వేళ... మధ్యే మార్గంగా.. బీజేపీ నేతగా ఉన్న సుజనాచౌదరిని విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపితే.. ఆయన గెలుపు నల్లేరు మీద నడిక అయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సుజనాచౌదరి అసలు పేరు యలమంచిలి సత్యనారాయణ చౌదరి. ఆయన స్వస్థలం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కంచికచర్ల. ఈ ఊరు విజయవాడ లోక్‌సభ పరిధిలోకి వస్తుందన్న విషయం తెలిసిందే. అదీకాక.. టీడీపీ అధినేత చంద్రబాబుకు  సుజనా చౌదరి సన్నిహితుడన్న సంగతి తెలిసిందే.  ఇక గత లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని నాని గత కొంత కాలంగా ఆ పార్టీతో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు... ఇంకా క్లియర్ గా చెప్పాలంటే 2022లో ఒంగోలు వేదికగా జరిగిన తెలుగుదేశం పార్టీకి పండుగ లాంటి మహానాడుకు, 2023లో రాజమహేంద్రవరం వేదికగా జరిగిన మహానాడుకు కేశినేని నాని హాజరుకాలేదు.  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. చేపట్టిన యువగళం పాదయాత్రలోనూ ఆయన పాల్గొనలేదు. అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలకు సైతం కేశినేని నాని  దూరంగానే ఉన్నారు. ఈ విషయాలన్నిటి ప్రస్తావనతో పోలిటికల్ సర్కిల్స్ లో నాని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదన్న చర్చ జరుగుతోంది.  అలాగే గత ఎన్నికల్లో అధికార జగన్ పార్టీ కైవసం చేసుకున్న తన లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కేశినేని నాని  తరచూ పర్యటిస్తూ.. ఆ పార్టీ ఎమ్మెల్యేలపై కేశినేని నాని ప్రశంసల వర్షం కురిపించిన విషయాన్ని కూడా పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  ఇంకోవైపు కేశినేని నాని, ఆయన కుమార్తె శ్వేత సాధ్యమైనంత త్వరలో జగన్ పార్టీలో  చేరతారనీ, నాని.. ఆ పార్టీ తరఫున విజయవాడ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా బరిలో దిగననున్నారనే ఓ ప్రచారం  వాడి వేడిగా నడుస్తోంది. అదీ కాక విజయవాడ నుంచి ఫ్యాన్ పార్టీ లోక్‌సభ అభ్యర్థిగా బరిలో దింపేందుకు సరైన అభ్యర్థి కోసం ఆ పార్టీ గత కొంత కాలంగా అన్వేషణ చేస్తున్నది. ఆ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా కేశినేని నానిని బరిలో దింపే అవకాశాలు ఉన్నాయి. ఇంకోవైపు.. న్యూఢిల్లీ వెళ్లాలంటే.. ఒక విమానం కాకుంటే మరో విమానంలో వెళ్లాలంటూ కేశినేని నాని తన రాజీనామా ప్రకటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు పార్టీ మారే ఉద్దేశ్యంతోనే చేశారనే ఓ చర్చ సైతం  నడుస్తోంది.  ఏదీ ఏమైనా రానున్న ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి బరిలొ దిగే ఏ పార్టీ అభ్యర్థిని  విజయలక్ష్మీ వరిస్తుందోనని ఆ నియోజకవర్గ ప్రజలు దృష్టి సారిస్తున్నారనే ఓ ప్రచారం సైతం పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది.

సీటు మారమంటే.. పోటీకి దూరమంటున్నారు!

వైసీపీలో అసమ్మతిని అణచి ఉంచాలని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఎంతగా ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. గోడకు బంతిని ఎంత బలంగా కొడితే అంత బలంగా వెనక్కి వచ్చినట్లు, జగన్ అసమ్మతి గళాలను అణిచేయాలని ప్రయత్నిస్తున్న కొద్దీ అవి మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. మొత్తంగా  పార్టీపై జగన్ పూర్తిగా అదుపు కోల్పోయాడనే అనిపించే పరిస్థితులు వైసీపీలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అసలు పార్టీలో జగన్ ఆధిపత్యం మేడిపండు చందమేనని రెండేళ్ల నాడు ఆయన తన కేబినెట్ ను విస్తరించిన సందర్భంలోనే తేటతెల్లమైంది. అయితే అధికారం మరో రెండేళ్లు ఉన్నందున, అప్పుడు నిరసనలు, అసమ్మతి జ్వాలలూ ఎగసిపడినా తరువాత సర్దుకున్నాయి. చల్లారాయి. కానీ గాలిని గుప్పిట ఎలా బంధించలేమో, పార్టీ నేతల్లో జగన్ పట్ల విశ్వాసం కోల్పోయిన తరువాత బెల్లించో, బెదిరించో వారి నోళ్లు మూయించడం అంత లేలిక కాదు.    వైసీపీలో తిరుగుబాట  పడుతున్న నేతల సంఖ్య  రోజురోజుకూ పెరిగిపోతుండటమే ఇందుకు నిదర్శనం. వాస్తవానికి వైసీసీలో తిరుగుబాటు సంకేతాలు జగన్ రెండేళ్ల కిందట మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించిన సమయంలోనే కనిపించాయి. అప్పటి నుంచే పార్టీ అధినేతగా జగన్ కు తన మాటే శాసనం అన్న పరిస్థితి లేదని లీడర్ నుంచి క్యాడర్ వరకూ అందరికీ అర్ధమైపోయింది.   ఆ తరువాత గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జగన్ ఆదేశాల మేరకు పాటించిన ఎమ్మెల్యేలు, మంత్రులను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. జగన్ ఆదేశాలను పాటించేందుకు పార్టీలో మెజారిటీ నేతలు ముందుకు రాలేదన్న విషయం ఆ కార్యక్రమం ఆరంభంలోనే తెలిసిపోయింది. ఈ విషయాన్ని వేరే ఎవరో కాదు.. స్వయంగా జగనే పలు సందర్భాలలో జరిపిన సమీక్షల్లో చెప్పారు.  కేవలం పదిపదిహేను మంది ఎమ్మెల్యేలు వినా మిగిలిన వారెవరూ గడప గడపకూను సీరియస్ గా తీసుకోవడం లేదని జగన్  అప్పట్లో ఫైరయ్యారు.  గడపగడపకు కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే మళ్లీ పోటీకి టికెట్లు ఇచ్చేది లేదని హెచ్చరికలు కూడా చేశారు. అయితే వాటిని మెజారిటీ ఎమ్మెల్యేలు ఖాతరు చేయలేదు. ఆ తరువాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ అంటూ ఓ నలుగురు ఎమ్మెల్యేలపై జగన్ సస్పెన్షన్ వేటు వేస్తే, ఆ నలుగురూ కూడా అందుకే వెయిట్ చేస్తున్నామన్నట్లు స్పందించి జగన్ పై, ఆయన ప్రభుత్వంపై, పాలనపై విమర్శలు గుప్పిస్తూ జనంలోకి వచ్చారు.  ఇక ఇప్పుడు తాజాగా సిట్టింగుల నియోజకవర్గాల మార్పు అంటూ జగన్ చేస్తున్న ప్రయోగం వికటించి ఏకంగా తిరుగుబాటు స్థాయికి చేరింది.     ఇప్పుడు జగన్ రెండు మెట్లు దిగి బెదరింపులు, హెచ్చరికలను పక్కన పెట్టి బతిమలాడుకునే పరిస్థితికి వచ్చారు. బతిమలాడినా అసమ్మతీయులు వినే పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు ఉంటున్నారు. సర్వేలు, ప్రజాగ్రహం అన్నీ ఓటమిని కళ్ల ముందు ఆవిష్కరిస్తుంటే.. జగన్ పార్టీలో నేతలకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. అందుకే ఈ సారి పోటీకి దూరంగా ఉండటం బెటరన్న భావనే మెజారిటీ సిట్టింగులలో కనిపిస్తోందంటున్నారు. అందుకే జగన్ నియోజకవర్గ మార్పు అనగానే.. వద్దు వద్దు ఈ సారి పోటీకి దూరంగా ఉంటామని చెబుతున్న సిట్టింగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందంటున్నారు. అదీ కాక సిట్టింగ్ స్థానాన్ని మార్చడమంటే ఇక్కడ మీ ఓటమి ఖాయమైందని చెప్పడమేనని, సొంత నియోజకవర్గంలోనే ఎదురీదే పరిస్థితి ఉంటే మరో నియోజకవర్గానికి వెడితే మునకే అని అంతర్గత సంభాషణల్లో సీటు మారిన ఎమ్మెల్యేలు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజులలో జగన్ మాటను ధిక్కరించే వైసీపీ నేతల సంఖ్య ఇంకా పెరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జగన్ పై రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేల రివోల్డ్ !

ఏపీలో అధికార పార్టీ వైసీపీ పరిస్థితి ఇప్పుడు క్లైమాక్స్ కి చేరినట్టు కనిపిస్తున్నది. ఆ పార్టీ కథ ఇక కంచికి చేరిపోవడమే తరువాయి అని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు. ఒకవైపు ప్రజలలో జగన్ పార్టీపై అసంతృప్తి పెరిగిపోతుంటే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలలో అంతకు మించి అసమ్మతి, ఆగ్రహం కనిపిస్తున్నది. కనీసం మాటా మంతీ లేకుండా, తమ అభిప్రాయాలకు విలువే లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తన నియోజకవర్గాలను మార్చేయడంపై వైసీపీ ఎమ్మెల్యేలు అధిష్టానంపై మండిపడుతున్నారు.కొందరు ఎమ్మెల్యేలైతే ఇప్పటికే జగన్ లెక్కేమిటని నిలదీసి పార్టీని వీడుతుంటే మరి కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్దమవుతున్నారు. ఇంకొందరు తమ ధిక్కారాన్ని ప్రదర్శించడానికి  సమయం  కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ సీఎం జగన్ సొంత సామజిక వర్గం ఎమ్మెల్యేలలో ఒకరిద్దరు తప్ప మిగతా వారు పెద్దగా జగన్ నిర్ణయాలను వ్యతిరేకించలేదు. అసలు జగన్ తన సొంత సామజిక వర్గ ఎమ్మెల్యేల సిట్టింగ్ స్థానాలను  పెద్దగా మార్చలేదు. స్థానాలను మార్చిన, టికెట్ నిరాకరించిన మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి లాంటి వారు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పేసి వెళ్లిపోతే.. కాపు రామచంద్రారెడ్డి వంటి వారు నీకో దండం, నీ పార్టీకో దండం అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అయితే  వైసీపీలో నిన్నటి వరకూ ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క అన్నట్లు  పరిస్థితి మారిపోయింది. స్థానాల మార్పుపై ఇప్పుడు సొంత సామాజికవర్గ ఎమ్మెల్యేలు కూడా  రివర్స్ అవుతున్నారు. ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో న‌ర‌సారావు పేట పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఈసారి లావుకు న‌ర‌సారావుపేట టికెట్ లేద‌ని, గుంటూరు పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేయాల‌ని, లేదంటే ఈసారికి టికెట్ ఆశపడొద్దని పార్టీ అధినేత జ‌గ‌న్ తేల్చి చెప్పార‌ని పార్టీలో చ‌ర్చ‌ సాగుతోంది. వైసీపీ నేతల అంతర్గత సంభాషణలతో ఇది కాస్త ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చకు వచ్చింది. అయితే  జగన్ చెప్పినా ఎంపీ కృష్ణదేవరాయలు మాత్రం తాను గుంటూరు నుంచి పోటీ చేసేది లేద‌ని.. నర‌స‌రావుపేట‌ నుండే  రంగంలోకి దిగుతాననీ తేల్చి చెప్పేశారు.   కాగా, న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంటు ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా లావుకు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. మరోసారి ఇక్కడ నుండి లావుకు అవకాశం ఇవ్వాలని ఇక్కడి ఎమ్మెల్యేలు సైతం వైసీపీ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో ఇక్కడ వైసీపీలో హీట్ పెరిగిపోతున్నది.  లావుకే మరోసారి న‌ర‌సారావుపేట టికెట్ ఇవ్వాలంటూ ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన‌ నాయ‌కులు తాజాగా రోడ్డెక్కారు. లోక్‌స‌భ వైసీపీ క‌న్వీన‌ర్ ఏరువ విజ‌య‌భాస్క‌ర‌రెడ్డి నేతృత్వంలో ఓబుల్‌రెడ్డి, తిరుప‌తి రెడ్డి, బ్ర‌హ్మారెడ్డి, న‌ర‌సారెడ్డి, నాగుల రెడ్డి ప్ల‌కార్డులు ప‌ట్టుకుని మ‌రీ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. తాజాగా సామాజిక పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మానికి వీరు పనిగట్టుకొని మరీ వెళ్లి  ఎంపీ లావుకు మ‌ద్ద‌తు తెలిపారు. స్థానికంగా పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాన్ని లావు ఎంతో డెవ‌ల‌ప్ చేశార‌ని, ఆయ‌న‌కు టికెట్ ఇస్తే మరోసారి గెలుపు ఖాయ‌మ‌ని వారు అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. లావుకు మద్దతు తెలుపుతున్న ఈ ఎమ్మెల్యేలంతా సీఎం సొంత సామజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలే  కావడం విశేషం. టికెట్ తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న లావు కృష్ణదేవరాయలు కమ్మ సామజిక వర్గానికి చెందిన ఎంపీ కావడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొత్తంగా లావు రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు జగన్ పై తిరుగుబాటు ప్రకటించారు.   ఎంపీ లావు కృష్ణదేవరాయల విషయానికి వస్తే ఉమ్మడి జిల్లాలో ఆయనకు ప్రతిష్టాత్మమైన విద్యాసంస్థలు ఉన్నాయి. ఆయన తండ్రి లావు రత్తయ్య నెలకొల్పిన ఈ విద్యాసంస్థలలో చదివిన సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తండ్రి వ్యాపారాలతో పాటు రాజకీయంగా కూడా తన మార్క్ చూపించాలని ఆరాటపడుతున్న కృష్ణదేవరాయలు వైసీపీ ప్రభుత్వంతో పనిలేకుండా సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి అదే  స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. కానీ, జగన్ మాత్రం సర్వేలనే నమ్ముకుని  కృష్ణదేవరాయులును మార్చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు. అయితే లావు కుటుంబం కాకుండా ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇంకెవరిని పోటీకి దింపినా  ఆ ప్రభావం ఆ లోక్ సభ స్థానం పరిధిలో ఉన్న అసెంబ్లీ   నియోజకవర్గాలపై కచ్చితంగా పడుతుంది. అందుకే ఈ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలంతా ఇప్పుడు  కృష్ణదేవరాయలకే  నరసరావుపేట టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది  రెడ్డి సామజిక వర్గ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరందరూ మూకుమ్మడిగా లావు నామస్మరణ జపం చేస్తూ జగన్ పైనే నిరసన గళం విప్పారు.  దీంతో జగన్ దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. మరో వైపు లావు పార్టీ మారే యోచనలో ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. అదే జరిగితే లావుతో పాటు ఆయనకు మద్దతుగా నిలుస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమ దారి తాము చూసుకునే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

నగ్నంగా తిప్పుతూ దాడి.. ఏపీలో సామాన్యుడంటే ఇంత చులకనా?

ఇప్పటికే ఏపీ పోలీసులపై ఎన్నో విమర్శలున్నాయి. అధికార పార్టీ నేతలకు అండగా సామాన్యులపై ప్రతాపం చూపుతున్నారనడానికి ఇప్పటికే ఎన్నో   రుజువులున్నాయి. అధికార పార్టీ నేతలకు అడ్డొచ్చిన సొంత పార్టీలోని దళితులు, బీసీలపై కూడా పోలీసులు జులుం ప్రదర్శించారు. ఈమధ్యనే హోంమంత్రి సుచరిత సొంత నియోజకవర్గంలోని ఓ దళిత యువకుడు పోలీసుల టార్చర్ భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకు ముందు కూడా పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేసి ఘోరంగా అవమానపరిచిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఓ వృద్ద మహిళపై అక్రమ కేసులు బనాయించి ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేసిన పాపానికి రాత్రికి రాత్రి పోలీసులు ఇళ్లపై దాడులు చేసి సామాన్యులను లాక్కెళ్లి అసలు ఎక్కడ ఉంచారో కూడా తెలియకుండా వారి కుటుంబాలను క్షోభపెట్టిన ఘటనలు ఎన్నోఎన్నోన్నో ఉన్నాయి. ఏపీలో పోలీస్ ఆగడాలు పెరిగిపోయాయని సామాన్య ప్రజలు కోర్టులను ఆశ్రయించిన సంఘటనలూ ఉన్నాయి. ఆయా సందర్భాలలో  పోలీస్ బాసుకు కోర్టులు  చీవాట్లు పెట్టినా పోలీసుల బుద్ది మారలేదు.. జులుం ఆగ  లేదు. ఏపీ పోలీసులకు సామాన్య ప్రజలంటే ఎంత చులకనో మరో సంఘటన రుజువు చేసింది. తాజాగా వైసీపీ జెండా దించి ఆ స్థానంలో జాతీయ జెండా ఎగరేయాలని డిమాండ్ చేసిన  ఓ సామాన్యుడిపై పోలీసులు ప్రతాపం చూపించారు. అతనితో బట్టలు విప్పించి పోలీసులే వెనకాల లాఠీ పట్టుకొని తిరుగుతూ స్టేషన్ ఆవరణలో నగ్నంగా తిప్పారు. బూటు కాళ్లతో తన్నుతూ ఇష్టం వచ్చినట్లు చితగొట్టారు. ఈ అమానవీయ ఘటన అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూర్ పోలీస్ స్టేషన్ లో  జరిగింది. విడపనకల్లు మండలం చీకలగూరి గ్రామానికి చెందిన చంద్రమోహన్ అనే వ్యక్తి డిసెంబర్ 31 రాత్రి గ్రామంలోని సచివాలయం ఎదుట ఉన్న వైసీపీ జెండాను తొలగించి, అదే స్థానంలో జాతీయ జెండాను ఎగురవేయాలని సచివాలయ సిబ్బందిని కోరాడు. దీనికి వైసీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు వైసీపీ జెండాను దించకపోతే.. నేనే దాన్ని దించి తగుల బెడతానని చంద్రమోహన్ హెచ్చరించాడు. జెండా దించితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వైసీపీ నేతలు హెచ్చరించారు. అయితే ఆ మరుసటి రోజు జెండాను చంద్రమోహన్ తగులుబెట్టాడని వైసీపీ నేతలు పాల్తూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చంద్రమోహన్ ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే, తనను ఎందుకు స్టేషన్ కు తీసుకెళుతున్నారంటూ చంద్రమోహన్ ప్రశ్నించాడు. అంతే  మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ పోలీసులు ఆయనపై దాడికి దిగారు. స్టేషన్ కు తీసుకెళ్లి బూటు కాళ్లతో తంతూ, పిడిగుద్దులు గుద్దుతూ చితకబాదారు. బట్టలు ఊడదీయించి స్టేషన్ ప్రాంగణంలో నగ్నంగా తిప్పుతూ.. వెంటాడుతూ లాఠీలతో కొట్టారు. జనవరి 1న పోలీసులు చంద్రమోహన్ ను అరెస్టు చేయగా.. 4వ తేదీన ఉరవకొండ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్ బెయిల్‌ మంజూరు చేశారు. పోలీసు దెబ్బలకు చంద్రమోహన్ ఒళ్లంతా హూనమై ఆరోగ్యం క్షీణించడంతో అతడిని అదేరోజు కుటుంబ సభ్యులు ఉరవకొండ ఆస్పత్రిలో చేర్చారు. కాగా  పోలీసులు చంద్రమోహన్ ను స్టేషన్ ఆవరణలో నగ్నంగా తిప్పుతూ,  లాఠీలతో వెంటాడడానికి సంబంధించిప వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీకి చెంచాగిరి చేస్తున్నారనే విమర్శలు బాహాటంగానే వస్తున్నాయి. అధికార పార్టీ నేతలు చెప్పినట్టుగా నడుచుకుంటూ విపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అదే అధికార పార్టీ నేతలు విపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలపై దాడి చేసినా, హత్యలు చేసినా, అఘాయిత్యాలు చేసినా, చంపేసి డోర్ డెలివరీలు చేసినా పోలీసుల కళ్లకు కనిపించడం లేదు. పైగా వైకాపా నేతల దుశ్చర్యలకు పోలీసులే అండగా నిలుస్తున్నారు. అందుకే వైకాపా నేతలు రెచ్చిపోతున్నారు. మరోవైపు పోలీసులు సామాన్యులపై రెచ్చిపోతున్నారు. ఈ మధ్యనే సొంత ప్రాంతానికి వచ్చిన ఆర్మీ జవాన్ ఫోన్ లో దిశా యాప్ ఇన్స్టాల్ చేయలేదన్న కారణంగా పోలీసులు చుట్టుముట్టి బంధించి చితకబాదిన ఘటన వీడియోలు వైరల్ కాగా.. ఇప్పుడు స్టేషన్ లోనే పోలీసుల దురాగతం వీడియోలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజలను రక్షించేందుకు జీతాలు తీసుకుంటున్న రక్షక భటులు.. ఆ ప్రజలనే భక్షిస్తుండడంతో ప్రజలలో తమకు రక్షణ కరవైందన్న అభద్రతా భావం పెరిగిపోతోంది.

కేశినేని నాని స్వయంకృతమే!

కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడటం అన్నది ఎప్పటి నుంచో అనుకుంటున్నదే. చివరికి అదే జరిగింది. ఇంత కాలం తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ చేసినా నాని పార్టీని వీడినందుకు ఎవరూ బాధపడే పరిస్థితి లేదు సరికదా హమ్మయ్య ఇప్పటికైనా బయటకు పోయారు అదే చాలు అన్న భావన తెలుగుదేశంలో లీడర్ నుంచి క్యాడర్ దాకా వ్యక్తం అవుతోంది.  చాలాకాలం నుంచి మరీ ముఖ్యంగా 2019 ఎన్నికలలో ఎంపీగా తెలుగుదేశం తరఫున విజయవాడ నుంచి లోక్ సభకు ఎన్నికై, ఆ ఎన్నికలలో పార్టీ పరాజయం పాలైనప్పటి నుంచీ నానిలో అంత వరకూ కనిపించని అహం ఒక్కసారిగా జడలు విప్పుకుని మరీ బయటపడింది. పార్టీ పరాజయం పాలై, అంతటి వ్యతిరేక పవనాలలోనూ తాను గెలవడం అంటే.. పార్టీ కంటే తానే ఎక్కువ అని భావించిన నాని అప్పటి నుంచీ పార్టీ లేక్కేమిటి? అన్నట్లుగా వ్యవహరించడం మొదలు పెట్టారు. అతడి దుందుడుకు వైఖరినీ, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరునూ గమనించినా, చాలా కాలంగా పార్టీలో ఉన్నాడన్న భావనతో ఆయనపై కనీస చర్యలు కూడా పార్టీ అధినేత తీసుకోకపోవడంతో కేశినేని నానిలో అహం మరింత ఎక్కువైంది. తాను అనుకున్న దానికి భిన్నంగా పార్టీ ఏం చేసినా అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా, తాను ఇంకా పార్టీలో కొనసాగడం తెలుగుదేశం అదృష్టం అన్న ధోరణిలో వ్యవహారం సాగించారు కేశినేని నాని. కొడాలి నానికి నిజాయితీపరుడుగా పేరుంది. ఇంత కాలం ఎంపీగా ఉన్నా ఎక్కడా ఎన్నడూ అవినీతి మరక అంటలేదు.  అయితే ఆయన వ్యవహారశైలి మాత్రం పార్టీలో ఆయన పట్ల వ్యతిరేకత పెరగడానికీ, పార్టీ కేడర్ నుంచి నాయకుల వరకూ ఆయనకు దూరం జరగడానికీ దోహదపడింది తప్ప మరో ప్రయోజనం చేకూరింది లేదు.  వ్యవస్థకు తప్ప, వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వని తెలుగుదేశం వంటి పార్టీలో … వ్యక్తిగత ప్రాధాన్యం కోరుకోవడం, అందుకు భిన్నంగా జరిగితే ఇష్టారీతిగా సొంత పార్టీనీ, నాయకులను విమర్శించడం చేసే నాని ధోరణే చివరకు ఆయన పార్టీ వీడేలా చేసింది.   నిజానికి గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ముగ్గురు ఎంపీలలో కేశినేని నాని మినహా మిగిలిన ఇద్దరూ పార్టీ విధానాలకు లోబడే వ్యవహరించారు. ఒక్క నాని మాత్రమే అందుకు భిన్నంగా వ్యవహరించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును సైతం ధిక్కరించి ఒక విధమైన అరచకానికి తెరలేపారు. చివరికి ఆ వైఖరే నాని టీడీపీ నుంచి బయటక వెళ్లడానికి కారుణమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంత అహంకారంతో వ్యవహరించే నాని నిజానికి మంచి ఆరేటర్ కాదు, అలాగే ప్రజలలో విశేష అభిమానం ఉన్న వ్యక్తి కూడా కాదు. అయితే ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా మాత్రమే నానికి గుర్తింపు, స్థానం యోగ్త ఉ:టాయని జగన్  అలాగని నాని మంచి వక్త కాదు. గ్లామర్ ఉన్న లీడర్ కాదు. జనాలకు అందుబాటులో ఉండే నాయకుడంతే! అయితే కేశినేని నానికి సొంత పార్టీ నేతలతోనే పెద్దగా పొసగదు. దాదాపు పార్టీ నాయకులందరితోనూ ఆయనకు విభేదాలే. సొంత పార్టీ నేతలపైనే బహిరంగంగా విమర్శలు, పరోక్షంగా దూషణలు చేయడం నానికి ఈ నాలుగున్నదేళ్లుగా ఒక అలవాటుగా మారింది.  చివరాఖరికి తిరువూరులో వైసీపీ ఎమ్మెల్యేపై యుద్ధం చేస్తున్న తెలుగుదేశం నేతల మనోభావాలు దెబ్బతినేలా.. అధికార పార్టీ ఎమ్మెల్యేపై పొగడ్తలవర్షం కురిసిస్తారు  కేశినేని నాని. ఆయన ఈ వైఖరి కారణంగానే తెలుగుదేశంలో ఆయనకు సన్నిహితుడు, స్నేహితుడు అని చెప్ుకోవడానికి ఎవరూ లేకుండా పోయారు.    ఇక పార్టీకి కేశినేని నాని ఇప్పుడు కాదు ఎప్పుడో దూరం అయిపోయారు. తెలుగేదేశం పార్టీకి పెద్ద పండుగ లాంటి మహానాడుకూ ఆయన దూరంగా ఉన్నారు. అలాగే పార్టీలో, పార్టీ క్యాడర్ లో చైతన్యం నింపిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకూ ఆయన దూరం అయ్యారు. అలాగే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకూ ఆయన హాజరు కాలేదు. దీనిని బట్టే కేశినేని నాని పార్టీకి ఎప్పుడో దూరమయ్యారని అవగతమౌతుంది. అందుకే కేశినేని నాని పార్టీని వీడుతున్నానని ప్రకటించినా ఆయనను బుజ్జగించడానికి కానీ, వద్దని వారించేందుకు కానీ తెలుగుదేశం నుంచి ఒక్కరంటే ఒక్కరు కేశినేని నానికి మద్దతు ఇచ్చిన వారు లేరు.  

కొడాలి నానీ.. అది నోరేనా?!

నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు పెద్దలు. అంటే మనం ఎంత మర్యాదగా మాట్లాడితే ఊరి ప్రజలు మనకు అంత అండగా ఉంటారు. అదే నోటికి  ఏది వస్తే మాట్లాడితే.. అదే ఊరి జనం తరిమి తరిమి కొడతారు. ఈ విషయం వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానీకి ఎప్పటికి అర్ధమవుతుందో ఏమో. కొడాలి నానీ అంటే బూతులు మాట్లాడే మంత్రి అని ఎప్పుడో పేరు సంపాదించుకున్నారు. ఎదుటివాళ్ళు ఎంతటి వారైనా.. వయసు అనుభవ పరంగా ఎంత గొప్పవారైనా నానీకి అవేమీ  పట్టదు. తనకు తెలుగుభాషలో  తెలిసింది కేవలం బూతులే  అన్నట్లు ఆయన నోటి వెంట బూతులు, అసభ్య పదజాలం మాత్రమే వస్తుంది. కనీసం తానో ప్రజా ప్రతినిధిననీ.. తనను ప్రజలు గమనిస్తారనే  స్ఫృహ కూడా నానీకి లేదు. ఉండదు.  వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరు ఏమన్నా, జగన్ పాలనను ఎవరు తప్పుబట్టినా తన నోటివెంట  వచ్చేది బూతుల పంచాగం మాత్రమే.  ఇది దాదాపుగా తెలుగు ప్రజలంరికీ తెలిసిందే.   అసలు కనీసం మంచీ మర్యాదా లేని, తెలియని నేత ఎవరైనా ఉన్నారంటే అది కేవలం తానుమాత్రమేనని నాని తాజాగా మరోసారి నిరూపించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పకపోవడంపై  మీడియా ప్రతినిధులు కొడాలి నానీ స్పందనను కోరారు. అయితే  ఏదో తమ ముఖ్యమంత్రి ప్రజాపాలన, సమస్యల బిజీ వలన కుదరలేదనో.. ప్రభుత్వ కార్యక్రమాల వలన వీలుపడలేదనో సమాధానం చెప్తే సమంజసంగా ఉండేది.  కానీ, అలా చెప్తే కొడాలి నానీ కుసంస్కారం ఎలా తెలుస్తుంది. అందుకే ఆయన మరోసారి తనకే సాధ్యమైన బూతుల పంచాంగం విప్పారు? అసలు రేవంత్ రెడ్డికి జగన్ ఎందుకు శుభాకాంక్షలు చెప్పాలన్న నానీ.. మాకేం పని లేదా? అంటూ తన అహంకారాన్ని బయటపెట్టారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు జగన్ హైదరాబాద్ వెళ్లారు కదా? మరి పనిలేక వెళ్ళారా అనే స్థాయిలో మీడియా ప్రతినిధులు కౌంటర్   వేశారు. దీంతో నానీ మరోసారి దురుసుగా.. రేవంత్ కు ఏమైనా తుంటి విరిగిందా పరామర్శించేందుకు అంటూ ఉచితానుచితాలు మరిచి హుంకరించారు.   నిజానికి మీడియా ప్రతినిధులు నానీని ఈ ప్రశ్న అడగడం సమంజసమే. సాటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి ఎంపికైనపుడు శుభాకాంక్షలు చెప్పడం సంస్కారం. ఇది జగన్ మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగానే కాదు.. రెండు రాష్ట్రాల మధ్య సామరస్య, సుహృద్భావ వాతావరణం ఏర్పడేందుకు కూడా దోహదపడుతుంది. జగన్ ఏమీ పనిగట్టుకొని హైదరాబాద్ వెళ్లి శుభాకాంక్షలు చెప్పాల్సిన పనిలేదు.. ఫోన్ ద్వారా లేదా సోషల్ మీడియా ఖాతాల ద్వారా అయినా ఆ పని చేయొచ్చు.  కానీ జగన్ ఆ మర్యాద పాటించలేదు.   పైగా ప్రత్యేక విమానంలో ప్రభుత్వ సొమ్ములతో జగన్ హైదరాబాద్ వెళ్లి మరీ ఆ రాష్ట్ర  మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించి వచ్చారు. కేసీఆర్ ను పరామర్శించడంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు. కానీ, కనీస మర్యాదైన కొత్త సీఎంకు శుభాకాంక్షలు చెప్పకపోవడాన్నే పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. అసలు జగన్  తీరే సమంజసంగా లేదని విమర్శలు వెల్లువెత్తుతుంటే..  ఇప్పుడు కొడాలి నానీ వ్యాఖ్యలు అంతకు మించి డ్యామేజ్ చేసేవిగా ఉన్నాయి.  నానీ  వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ ఫాలోవర్లు అసలు నానీది నోరేనా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.    చీమ చిటుక్కుమన్నా.. చిన్న జ్వరం వచ్చినా వైసీపీ ఎమ్మెల్యేలందరూ వైద్యం కోసం వెళ్లేది హైదరాబాద్ కే. ఆలాగే తెలంగాణతో వైసీపీ ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. అలాంటి   రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేతకు శుభాకాంక్షలు చెప్పటంలో ఉండే ఇబ్బందేమిటో కొడాలికే తెలియాలి. తన గురించి తాను ఎన్ని చెప్పుకున్నా.. ఎలా మాట్లాడినా అది తనకే ఇబ్బంది. కానీ, తమ పార్టీ అధినేతకు సంబంధించి, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపే అంశాలపై కూడా నానీ నోటి కొచ్చినట్లు అసభ్యంగా, అనుచితంగా మాట్లాడటం దారుణం.  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసే సమయంలో కాస్త ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసేలా మాట్లాడటం సరికాదనీ,  సంయమనం అవసరమన్న చిన్న విషయాన్ని నానీ మర్చిపోవడం ఆయన దౌర్భాగ్యం కాగా.. అసలు అలంటి నేతను ఎన్నుకొని నాయకుడిని చేయడం ఏపీ ప్రజల దౌర్భాగంగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఫార్మా కంపెనీ యజమాని ఇల్లు, కార్యాలయంలో ఐటీ సోదాలు 

తెలంగాణ ఎన్నికల ముందు కాంగ్రెస్ అభ్యర్థులు, నేతల ఇళ్లు కార్యాలయాలపై ఐటీ సోదాలు జరిగాయి. ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. నెల రోజుల పాలన సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులకు మరో షాక్ తగిలింది.  కాంగ్రెస్ నేతల, బంధువుల పెట్టుబడులు ఉన్న  ఫార్మా కంపెనీలపై ఐటీ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం..  బిజెపి బీ టీం  ఆరోపణలు ఎదుర్కొంటున్నబి ఆర్ఎస్ ప్రోద్బలంతో దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. లోకసభ ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్న సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం. హైదరాబాద్ లో పెద్దయెత్తున ఆదాయపు పన్నును ఎగవేశారన్న ఆరోపణలతో ఒక ఫార్మా కంపెనీ యజమాని కార్యాలయం, ఇళ్లపై  ఆదాయపు పన్ను శాఖాదికారులు సోదాలు  చేస్తున్నారు.   బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు... మంగళవారం ఉదయం నుంచి మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. రాయదుర్గం, కోకాపేట్, మొయినాబాద్ ప్రాంతాల్లో ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. పెద్దయెత్తున ఆదాయపు పన్నును ఎగవేశారన్న ఆరోపణలతో ఫార్మా కంపెనీపై దాడులు నిర్వహిస్తున్నట్లు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం హైదరాబాద్‌లో గ్లాండ్ ఫార్మా కంపెనీకి చెందిన కార్యాలయాలు, ప్రాంతాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో కంపెనీ ప్రతినిధులు, వారి బంధువుల ఇళ్లలో సైతం తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. 

జగన్ ను చూసి కాదు.. నన్ను చూసి ఓటేయండి.. మారిన వైసీపీ ఎమ్మెల్యేల తీరు!

నిన్న మొన్నటి దాకా జనం వై జగన్ అంటుంటే.. వైసీపీ నేతలూ, ఎమ్మెల్యేలూ, మంత్రులూ ఓన్లీ జగన్ అంటూ వచ్చారు. ఎప్పుడైతే జగన్ నియోజకవర్గాల మార్పు అంటూ సిట్టింగులను ఇష్టారీతిగా మార్చేయడం ఆరంభించారో వారు కూడా వై జగన్ అంటూ పక్క చూపులు చూస్తున్నారు. లేదా నో పోటీ అంటూ సైడైపోతున్నారు. అయితే ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మాత్రం జగన్ ను చూసి కాదు నన్ను చూసి ఓటేయండి అని తన నియోజకవర్గ ప్రజలను కోరుతున్నారు. విజయనగరం ఎమ్మెల్యే, ఉప సభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి జగన్ ఫేస్ వేల్యూ తనను గెలిపిస్తుందన్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు. పార్టీ అభ్యర్థిగా జగన్ ఫొటో పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్లడం కంటే తన గుడ్ విల్ ని పణంగా పెట్టి ఓట్లడగడమే బెటర్ అని ఫిక్సైపోయారు. అంతే ప్రజలు అడుతారని భావించిన ప్రశ్నలన్నీ ఆయనే వేస్తూ, ఆ సమస్యలేవీ తన పరిధిలో పరిష్కారమయ్యేవి కావంటూ సరెండర్ అయిపోయారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. అల్పాహార విందు ఏర్పాటు చేసి ఉపాధ్యాయ సంఘాల నాయకులను ఆహ్వానించారు. ఆ సందర్భంగా ఆయన మనసు విప్పి వారితో మాట్లాడారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేసిందన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే ఉపాధ్యాయుల సమస్యలను తన పరిధిలో పరిష్కరించలేనని చేతులెత్తేశారు. సీఎంపై మీ వ్యతిరేకతను అలాగే ఉంచుకోండి, కానీ ఓటు మాత్రం నన్ను చూసి వేయండని వేడుకున్నారు. కేవలం ఉపాధ్యాయ సంఘాల నేతలతోనే కాకుండా, నియోజకవర్గాల పరిధిలోని పలు సామాజిక వర్గాల నేతలతోనూ కోలగట్ల వీరభద్రస్వామి రహస్య భేటీలు నిర్వహించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారితో కూడా ఈ తరహాలోనే ఆయన తనను గెలిపించాలని కోరినట్లు తెలిసింది. కాగా నిన్న మొన్నటి వరకూ జగన్ తమ సర్వస్వం అన్న వారంతా ప్రజా వ్యతిరేకతకు బెదిరి జగన్ మొహం చూసి కాదు, మమ్మల్ని చూసి ఓటేయండి అంటూ బతిమలాడుకుంటున్నట్లు చెబుతున్నారు. మిమ్మల్ని గెలిపించే సత్తా నాకు లేదు అని సిట్టింగుల మార్పుతో జగన్ చేతులెత్తేయడంతో, ఇక ఎమ్మెల్యేలు కూడా మీ అవసరం మాకు లేదు, మా గెలుపేదో మేమే గెలుస్తాం అని చెప్పేయడానికి రెడీ అయిపోతున్నట్లు కనిపిస్తోందని పార్టీ శ్రేణులే అంటున్నాయి.   పరిస్థితి చూస్తుంటే జగన్ పార్టీ టికెట్ పైన గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ముందు ముందు జగన్ కు విధేయంగా ఉంటే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ ప్రమేయం లేకుండా తమ సొంత సత్తామీద గెలిచిన వారికి జగన్ కు విధేయంగా ఉండాల్సిన అవసరమేముంటుందని అంటున్నారు. మొత్తంగా సిట్టింగుల మార్పు అంటూ జగన్ చేస్తున్న ప్రయోగం ఆయన నాయకత్వానికే ఎసరు తీసుకువస్తోందని చెబుతున్నారు. 

లగడపాటి రాజకీయ రీ ఎంట్రీ ఖాయమేనా?

పదేళ్ల కిందట అప్పటి కాంగ్రెస్ ఎంపీ లగడపాటి ఓ శపథం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఏపీ, తెలంగాణ గా విభజించేందుకు తాను అంగీకరించబోననీ, అలా విభజనే జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటాననీ ప్రతిన పూనారు. సరే ఆయన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా రాష్ట్ర విభజన జరిగిపోయింది. దాంతో తాను అన్న మాట ప్రకారం గత పదేళ్లుగా లగడపాటి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అన్న మాట ప్రకారం రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకున్నారు. అయితే ఆంధ్రా ఆక్టోపస్ గా పేరొందిన లగడపాటి ఆ తరువాత అడపాదడపా తన సర్వేలతో వార్తలలో ఉంటూ వచ్చారు తప్ప ప్రత్యక్ష రాజకీయాలలో కనిపించిందిగానీ వేలు పెట్టింది   లేదు. అయితే ఇటీవలి కాలంలో ఆయన రాజకీయ ప్రవేశం నుంచి పెద్ద ఎత్తున వార్తలు వినవస్తున్నాయి. తెలుగుదేశం గూటికి చేరి ఎంపీగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగుతారనీ, కాదు కాదు.. కాంగ్రెస్ చేయందుకుని రాష్ట్ర రాజకీయాలలో క్రీయాశీలంగా వ్యవహరిస్తారనీ పెద్ద ఎత్తున వార్తలు వినవస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన పర్యటనలూ, భేటీలూ ఉంటున్నాయి. తాజాగా ఆయన రాజమహేంద్రవరం వెళ్లి మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్ తో భేటీ అయ్యారు. వారిరువురూ కూడా కాంగ్రెస్ వాదులే. మాజీ ఎంపీలే కావడం ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సి ఉంటుంది. హర్ష కుమార్ ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉన్నప్పటికీ గతంలోలా క్రీయాశీలంగా అయితే వ్యవహరించడం లేదు. ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ విషయానికి వస్తే ఆయన కూడా రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయినా తన రాజకీయ గురువుగా చెప్పుకునే దివంగత ముఖ్యమంత్రి కోసం ఆయన అప్పుడప్పుడు లేదా తరచుగా మీడియా సమావేశాలు పెట్టి మరీ ఏపీ సీఎం జగన్ కు సూచనలూ, సలహాలూ కొండొకచో మందలింపులతో ఒకింత మద్దతుగా మాట్లాడుతుంటారు.   ఏ విధంగా చూసినా రాష్ట్ర రాజకీయాలలో ఏమంత ప్రభావం చూపలేని లడగపాటి, ఉండవల్లిల భేటీ, అలాగే లగడపాటి, హర్షకుమార్ భేటీ మాత్రం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తాను రాజకీయాలలోకి పున: ప్రవేశించే అవకాశం ఇసుమంతైనా లేదని లగడపాటి చెబుతున్నప్పటికీ ఆయన మాటల వెనుక ఏదో మర్మం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  దక్షిణాదిలో  కర్నాటకతో మొదలు పెట్టి, తెలంగాణలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ అన్నట్లుగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే  దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిలను కాంగ్రెస్ లో చేర్చుకుంది. ఆమెకే ఏపీ సారథ్య బాధ్యతలు అప్పగించే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ ను వీడి వెళ్లిన వారూ, రాజకీయాలకు దూరంగా ఉంటున్న వారూ అందరూ మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆ కోవలోనే లగడపాటి, ఉండవల్లి అరుణ్ కుమార్ లు కూడా వస్తారు. ఇటువంటి వారంతా కాంగ్రెస్ కు దగ్గరై విభజన హామీలపై డిమాండ్ ను గట్టిగా తెరమీదకు తీసుకువస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ కు బలం పెరుగుతుందనీ, ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా, జగన్ పార్టీ విజయావకాశాలకు భారీగా గండి పడుతుందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ వంటి అంశాలు బలంగా తెరమీదకు వస్తాయనీ, అది ఏపీలో కాంగ్రెస్ కు ఎంతో కొంత మేలు చేస్తుందనీ అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, అమరావతే రాజధాని వంటి అంశాలపై స్పష్టమైన వైఖరి ప్రకటించి ఉండటం కూడా కలిసి వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద లగడపాటి తాను మర్యాదపూర్వకం అంటున్న రాజకీయభేటీలపై ఏపీలో విస్తృత చర్చ జరుగుతోంది.