జగన్ ముఖం చెల్లడం లేదు.. అందుకే చాటేస్తున్నారు!
posted on Jan 10, 2024 @ 9:44AM
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికలలో గెలుపు మంత్రం సిట్టింగులను మార్చడమే అన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు. ఎంత వ్యతిరేకత వ్యక్తమైనా, పార్టీ నుంచి నేతలు జారిపోతున్నా, పోటీ చేయం మొర్రో అని మొత్తుకుంటున్నా వినడం లేదు. నేను చెప్పాను, మీరు విన్నారు అన్నట్లుగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని నిర్ణయాలు తీసేసుకుని వాటిని అమలు చేసేస్తున్నారు. అయితే జగన్ సిట్టింగుల మార్పు నిర్ణయం వెనుక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సిట్టింగులకే టికెట్లిచ్చి కేసీఆర్ దెబ్బతిన్నారనీ, తాను అలా కాకుండా సిట్టింగులను మార్చేసి ఎన్నికలలో లబ్ధి పొందాలన్నది ఆయన అభిప్రాయంగా చెబుతున్నారు. అయితే కడుపు నొప్పికీ, కాలు నొప్పికీ ఒకటే ముందైతే ఎలా అని వైసీపీ నేతలు మొత్తు కుంటున్నారు. తెలంగాణలో పరిస్థితి వేరనీ, ఏపీలో పరిస్థితి ఎంతగా చెప్పినా జగన్ తలకెక్కించుకోవడం లేదంటున్నారు.
అసలు గత ఎన్నికలలో అంటే 2019 ఎన్నికలలో జగన్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థులను కాదు, తన ముఖం చూసి ఓటేయండి అని ప్రజలను కోరారు. జనం ఔదాల్చారు. అందుకే ఆ ఎన్నికలలో జగన్ పార్టీ 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు జగన్ నాడు తన ముఖం చూసి జనం ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారు. అలా మార్చేసే వారి స్థానాలలో పోటీలోకి దింపేందుకు ఇతర జిల్లాల నుంచి, కొండొకచో ఇతర రాష్ట్రాల నుంచీ కూడా అభ్యర్థులను దిగుమతి చేస్తున్నారు. కర్నాటక నుంచి బీజేపీ మాజీ ఎంపీని ఇప్పుడు ఏపీలో నిలబెడుతున్నారు.
అయితే జగన్ ఆఫర్ ను అంగీకరించి ఆయన మారమంటే మారడానికి మెజారిటీ ఎమ్మెల్యేలు అంగీకరించడం లేదు. నేతలను గెలిపించుకోలేనని చేతులెత్తేసిన నేత వెంట నడవాల్సిన అవసరం మాకు లేదంటూ తిరగబడుతున్నారు. సిట్టింగుల పనితీరు బాగా లేకపోతే పార్టీ టికెట్ రిజెక్ట్ చేయాలి, అంతే కానీ ఇక్కడ నువ్వు గెలవవు కనుక మరో నియోజకవర్గానికి పోయి గెలవడానికి ట్రై చేయి అంటూ తరిమేయడమేమిటని అంటున్నారు. అసలు వాస్తవం ఏమిటంటే జనం ఆగ్రహం ఎమ్మెల్యేల మీద కంటే జగన్ మీదే ఎక్కువగా ఉందనీ పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు బాహాటంగానే చెబుతున్నారు. తమను సీటు మార్చడం కాదు, జగన్ ప్రచారానికి రాకుండా ఉంటే చాలు మా పాట్లేవో మేమే పడతాం అంటున్నారు. జనంలో జగన్ చెల్లని నాణెంగా మారిపోయారని అర్ధం చేసుకున్న పార్టీ నేతలు ఆయన ఆదేశాలను పాటించేందుకు పెద్దగా సుముఖత వ్యక్తం చేయడం లేదు. అందుకే జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన వారు సైతం కట్టు తెంచుకుని వెళ్లిపోతున్నారు. ఇదీ ఇప్పుడు వైసీపీలో క నిపిస్తున్న దృశ్యం. వినిపిస్తున్న మాట!
అసలు అన్ని తప్పులూ మీ వద్దే పెట్టుకుని, ఎమ్మెల్యేలు, ఎంపీలను బలిపశువులను చేయడం ఏమిటి సొంత పార్టీ నేతలే జగన్ ను నిలదీస్తున్నారు? వై నాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న జగన్ ఆ ధీమా నిజమైతే సిట్టింగులను మార్చడమెందుకని జగన్ నే సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఒకచోట చెల్లని రూపాయి, పక్క ఊర్లో పదిరూపాయల నోటెలా అవుతుందని నిలదీస్తున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ అధినేత జగన్‌పై సంధిస్తున్న ఈ ప్రశ్నాస్త్రాలకు జగన్ నుంచి మౌనమే సమాధానంగా వస్తోంది. నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ గత ఎన్నికలలో సందర్భం ఉన్నా లేకున్నా చెప్పిన జగన్ ఇప్పుడు మాత్రం నేను వినను, నేను చూడను, నేను మాట్లాడను అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల ముందు నన్ను చూసి ఓటేయమన్న జగన్ జనానికి ఇప్పుడా మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు. జనానికి మెహం ఎందుకు చూపించలేకపోతున్నారు. ఎందుకు ముఖం చాటేస్తున్నారు. జనం ముదుకు రావడానికి ఆయన ముఖం చెల్లడం లేదా? అంటూ పార్టీ వర్గాల్లోనే కాదు రాజకీయ వర్గాలలో కూడా పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సందర్భంగా జగన్ తన పర్యటన సందర్భంగా జనానికి కనబడకుండా రోడ్లకు ఇరువైపులా పరదాలు ఏర్పాటు చేసుకోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. జనం ముందుకు వచ్చేందుకు జగన్ కు ముఖం చెల్లడం లేదనడానికి ఇంత కన్నా రుజువేం కావాలని అంటున్నారు.
గత నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలన్నీ పార్టీ పరంగా అయినా, ప్రభుత్వ పరంగా అయినా ఏకపక్షంగా తీసుకున్నవేనని అటువంటప్పుడు ఆయన వైఫల్యాలకు తమను బలి చేయడమేమిటని వైసీపీ సిట్టింగులు ఫైర్ అవుతున్నారు. పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు, నామినేటెడ్ పదవుల నియామకాలలో తమ ప్రమేయం ఇసుమంతైనా లేదనీ, ప్రభుత్వ పథకాల రూపకల్పన అంశాల్లోనూ అదే పరిస్థితనీ, చివరాఖరికి మంత్రులతో కూడా సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుని, ఇప్పుడు ఇప్పుడు వైఫల్యాలకు తమను బాధ్యులను చేయడమేమిటని గరం అవుతున్నారు. నియోజకవర్గాల్లో మమ్మల్ని డమ్మీలను చేసి, వాలంటీర్లతో పనిచేయించుకుంటున్నారు, నియోజకవర్గ పరిస్థితి వివరించేందుకు తాడేపల్లి అపాయింట్‌మెంట్ దొరకదు. సీఎంఓ అధికారులకే చెప్పుకోవాల్సిన పరిస్థితి, అసలు మాకే మొహం చాటేసీ నేత జనానికి ఎలా ముఖం చూపగలరంటూ పలువురు అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీకో దండం, జగన్ కో దండం అంటూ గుడ్ బై చెప్పేస్తున్నారు. అసలు 175కి 175 సీట్లు, 80 శాతానికిపైగా సంతృప్తకరస్థాయి, ఎస్సీ-ఎస్సీ-ఎస్టీ-మైనారిటీలంతా మనవైపే ఉన్నప్పుడు… 58 శాతం ఓటు బ్యాంకు ఉన్నప్పుడు.. మళ్లీ సీట్లు మార్చాడం ఎందుకన్న ప్రశ్నలు ఇప్పుడు వైసీపీ వర్గాలలో వినిపిస్తున్నాయి. జగన్ గారిని ఒక్కసారి చూపించమని మాజీమంత్రి, దళిత నేత డొక్కా లాంటివారు ప్రాధేయపడుతున్నారంటే పార్టీలో నేతల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఇట్లే అవగతమౌతుందని విశ్లేషకులు అంటున్నారు. దాదాపు పార్టీ నేతలందరిలోనూ ఇదే భావన వ్యక్తమౌతోందంటున్నారు.