జగన్ ప్రతి అడుగూ పరాజయం దిశగానే?!
posted on Jan 11, 2024 8:50AM
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ రెడ్డి పరిస్థితి నోరు తెరవాలంటే భయం, అడుగుకదపాలంటే జంకు అన్నట్లుగా తయారైంది. వచ్చే ఎన్నికలలో గెలవాలంటే సిట్టింగులను మార్చేసి కొత్త ముఖాలను బరిలోకి దింపడమే అని భావిస్తున్న జగన్.. ఆ దిశగా వేసే ప్రతి అడుగూ ఆయనను పరాజయం దిశగానే నడిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సొంత పార్టీ నేతలు సైతం అదే అంటున్నారు.
అందుకే 11 మందిని మారుస్తూ గొప్పగా విజయం దిశగా అడుగులు పడుతున్నాయని ప్రకటించుకున్న వైసీపీ అధినేత.. ఆ తొలి విడత మార్పులతో వచ్చిన రియాక్షన్ చూసి రెండో జాబితా విడుదల చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. అసంతృప్తులను తాడేపల్లి పిలిపించుకుని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేశారు. ఎలాగోలా రెండో జాబాతా విడుదల చేసిన తరువాత వైసీపీలో భూ కంపం పుట్టింది. రాజీనామాలు, తిరుగుబాట్లతో పలువురు నేతలు జగన్ కు ఎదురు తిరిగారు. అలా తిరిగిన వారిలో సొంత సామాజికవర్గానికి చెందిన వారు కూడా ఉండటం జగన్ ను కంగుతినిపించింది. దీంతో గత వారం రోజులుగా 15 మంది సిట్టింగుల మార్పుతో మూడో జాబితా అంటూ లీకులైతే ఇస్తున్నారు కానీ ప్రకటించే ధైర్యం చేయడం లేదు. అయితే ఆ లీకులతోనే వైసీపీలో అసమ్మతి ఏ స్థాయిలో ఉందో అవగతమౌతోంది. ఒకరి తరువాత ఒకరుగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు.
ఈ అసమ్మతిని చల్లార్చేందుకు ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో పడిన జగన్ తాను ద్వేషించే సామాజిక వర్గానికి చెందిన వారిని పార్టీలోకి ఆహ్వానిస్తే లెవెల్ అయిపోతుందని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే తెలుగుదేశం వద్దనుకున్న కేశినేని నానిని పార్టీలో చేర్చుకున్నారు. ఇందు కోసం ఆయన వైసీపీ ప్రతినిథులను పంపి మరీ రెండు, మూడు అంటూ టికెట్ల ఆఫర్ ఇచ్చారు. పార్టీలో తనను నమ్ముకుని తొలి నుంచీ ఉన్నవారికి టికెట్లు లేవంటూ మొండి చేయి చూపుతున్న జగన్, ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చే వారికి రెడ్ కార్పెట్ వెల్కం పలకడం పార్టీలో అసమ్మతి మరింత ప్రజ్వరిల్లేందుకు కారణమౌతోంది. కేశినేని నానితో జగన్ భేటీ అయిన రోజే, వైసీపీ నుంచి ఒక వికెట్ పడిపోయింది. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీకే కాకుండా, ఆ పార్టీ నుంచి గెలిచిన లోక్ సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అలా చేయడానికి ముందు వైసీపీలో బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్నీ, ఎదురౌతున్న అవమానాలనూ పూసగుచ్చినట్లు చెప్పారు.
నా బీసీలు, నా ఎస్టీలు, ఎస్సీలు అంటూ ప్రసంగాలు చేసే జగన్ వారి పట్ల ఎంత అవమానకరంగా వ్యవహరిస్తారో, ఎంత చులకనగా చూస్తారో వివరించారు. జగన్ తనను అవమానించిన తీరును వివరిస్తూ ఎమోషనల్ అయ్యి కంటనీరు పెట్టుకున్నంత పని చేశారు.
పార్టీ అధినేత జగన్ తో భేటీ కోసం ఆయన విజయవాడలోని ఓ హోటల్‌లో ఐదు రోజులుగా మకాం వేసినా జగన్ దర్శన భాగ్యం (అప్పాయింట్ మెంట్) దొరకలేదని డాక్టర్ సంజీవ్ కుమార్ చెప్పారు. ఈ ఐదు రోజులుగా ప్రతీ రోజూ.. తాడేపల్లి ఆఫీసులో ఉండే వాళ్లకు ఫోన్ చేసి, తాను వచ్చి కలుస్తానంటే.. వద్దు వద్దు మేం చెబుతాం అప్పుడు రండి అంటూ ఒకే సమాధానం వచ్చిందని వివరించారు. ఇక విసిగి పార్టీలో గౌరవం సంగతి తరువాత, ఇంత అవమానం జరుగుతుంటే ఇక భరించలేక బయటకు వచ్చేశానని డాక్టర్ సంజీవ్ కుమార్ చెప్పాురు. ఆ సందర్భంగా ఇటీవల సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ బరిహంగ సభలోనే జగన్ తో అప్పాయింట్ మెంట్ ఇప్పించండి అని వేడుకున్న సంగతిని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ సంజీవ్ కుమార్ కూడా అదే చెబుతున్నారు. జగన్ ను సరే ఆఖరికి పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ముఖం చాటేసి తనను కలవడానికి ఇష్టపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఎంపీని అయిన తనకు ఈ దుస్థితేమిటంటూ జగన్ ను నిలదీశారు.
తాను ఎంపీగా గెలిచిన తర్వాత ఇప్పటి వరకూ కేవలం రెండంటే రెండు సార్లు మాత్రమే జగన్ తో భేటీ అయ్యాననీ, అప్పుడు కూడా ఆయన ఊకదంపుడు మాటలే కానీ తన మాట వినిపించుకున్న పాపాన పోలేదని గుర్తు చేసుకున్నారు. బీసీలకు పెద్ద పీట వేశానని ఘనంగా చాటుకునే జగన్ మోహన్ రెడ్డి, ఆచరణలో మాత్రం వారిని అడుగడుగునా అవమానాల పాలు చేస్తారని ఆరోపించారు. డాక్టర్ గా సమాజంలో, జనంలో మంచి పేరు ఉన్న తనను జగన్, ఆయన అనుయాయులూ ఘోరంగా అవమానించారని డాక్టర్ సంజీవ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలో పోటీకి ఒక వేళ వైసీపీ టికెట్ లభించినా తాను ఆ పార్టీ తరఫున బరిలోకి దిగడానికి సిద్ధంగా లేనని కుండబద్దలు కొట్టేశారు.
కుటుంబ సభ్యులతో, అనుచరులతో చర్చించి రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. భవిష్యత్ కార్యాచరణను రానున్న రోజులలో ప్రకటిస్తానని చెప్పారు. రానున్న రోజులలో సంజీవ్ కుమార్ దారిలో పలువురు పయనించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఆ విశ్లేషణలు వాస్తవమేనని అనిపించక మానదు. రాజీనామాల భయంతోనే జగన్ మూడో జాబితా విడుదలకు ధైర్యం చేయలేకపోతున్నారని పార్టీ వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి.