లగడపాటి రాజకీయ రీ ఎంట్రీ ఖాయమేనా?
posted on Jan 9, 2024 @ 11:29AM
పదేళ్ల కిందట అప్పటి కాంగ్రెస్ ఎంపీ లగడపాటి ఓ శపథం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఏపీ, తెలంగాణ గా విభజించేందుకు తాను అంగీకరించబోననీ, అలా విభజనే జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటాననీ ప్రతిన పూనారు. సరే ఆయన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా రాష్ట్ర విభజన జరిగిపోయింది. దాంతో తాను అన్న మాట ప్రకారం గత పదేళ్లుగా లగడపాటి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అన్న మాట ప్రకారం రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకున్నారు. అయితే ఆంధ్రా ఆక్టోపస్ గా పేరొందిన లగడపాటి ఆ తరువాత అడపాదడపా తన సర్వేలతో వార్తలలో ఉంటూ వచ్చారు తప్ప ప్రత్యక్ష రాజకీయాలలో కనిపించిందిగానీ వేలు పెట్టింది లేదు.
అయితే ఇటీవలి కాలంలో ఆయన రాజకీయ ప్రవేశం నుంచి పెద్ద ఎత్తున వార్తలు వినవస్తున్నాయి. తెలుగుదేశం గూటికి చేరి ఎంపీగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగుతారనీ, కాదు కాదు.. కాంగ్రెస్ చేయందుకుని రాష్ట్ర రాజకీయాలలో క్రీయాశీలంగా వ్యవహరిస్తారనీ పెద్ద ఎత్తున వార్తలు వినవస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన పర్యటనలూ, భేటీలూ ఉంటున్నాయి. తాజాగా ఆయన రాజమహేంద్రవరం వెళ్లి మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్ తో భేటీ అయ్యారు. వారిరువురూ కూడా కాంగ్రెస్ వాదులే. మాజీ ఎంపీలే కావడం ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సి ఉంటుంది. హర్ష కుమార్ ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉన్నప్పటికీ గతంలోలా క్రీయాశీలంగా అయితే వ్యవహరించడం లేదు. ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ విషయానికి వస్తే ఆయన కూడా రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయినా తన రాజకీయ గురువుగా చెప్పుకునే దివంగత ముఖ్యమంత్రి కోసం ఆయన అప్పుడప్పుడు లేదా తరచుగా మీడియా సమావేశాలు పెట్టి మరీ ఏపీ సీఎం జగన్ కు సూచనలూ, సలహాలూ కొండొకచో మందలింపులతో ఒకింత మద్దతుగా మాట్లాడుతుంటారు.
ఏ విధంగా చూసినా రాష్ట్ర రాజకీయాలలో ఏమంత ప్రభావం చూపలేని లడగపాటి, ఉండవల్లిల భేటీ, అలాగే లగడపాటి, హర్షకుమార్ భేటీ మాత్రం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తాను రాజకీయాలలోకి పున: ప్రవేశించే అవకాశం ఇసుమంతైనా లేదని లగడపాటి చెబుతున్నప్పటికీ ఆయన మాటల వెనుక ఏదో మర్మం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
దక్షిణాదిలో కర్నాటకతో మొదలు పెట్టి, తెలంగాణలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ అన్నట్లుగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిలను కాంగ్రెస్ లో చేర్చుకుంది. ఆమెకే ఏపీ సారథ్య బాధ్యతలు అప్పగించే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ ను వీడి వెళ్లిన వారూ, రాజకీయాలకు దూరంగా ఉంటున్న వారూ అందరూ మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆ కోవలోనే లగడపాటి, ఉండవల్లి అరుణ్ కుమార్ లు కూడా వస్తారు. ఇటువంటి వారంతా కాంగ్రెస్ కు దగ్గరై విభజన హామీలపై డిమాండ్ ను గట్టిగా తెరమీదకు తీసుకువస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ కు బలం పెరుగుతుందనీ, ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా, జగన్ పార్టీ విజయావకాశాలకు భారీగా గండి పడుతుందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ వంటి అంశాలు బలంగా తెరమీదకు వస్తాయనీ, అది ఏపీలో కాంగ్రెస్ కు ఎంతో కొంత మేలు చేస్తుందనీ అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, అమరావతే రాజధాని వంటి అంశాలపై స్పష్టమైన వైఖరి ప్రకటించి ఉండటం కూడా కలిసి వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద లగడపాటి తాను మర్యాదపూర్వకం అంటున్న రాజకీయభేటీలపై ఏపీలో విస్తృత చర్చ జరుగుతోంది.