జగన్ ఒక్క చాన్స్ కు ఎక్స్ పైరీ డేట్.. ఇక వందశాతం ఓటమే
ఒక్క చాన్స్ అంటూ 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ పార్టీకి ఆ చాన్స్ కు ఎక్సపైరీ డేట్ వచ్చేసింది. జనం ఆ ఒక్క చాన్స్ ఎందుకు ఇచ్చాంరా బాబు అని తలలు పట్టుకుంటున్నారు. ఒక్క జనం మాత్రమే కాదు.. జగన్ పార్టీలో ఎమ్మెల్యేలు, నాయకులు, చివరాఖరికి ఆ పార్టీ కార్యకర్తలూ కూడా ఎరక్కపోయి జగన్ ను నమ్ముకున్నాం, ఇప్పుడు ములిగిపోతున్నాం అన్న భావనలో ఉన్నారు. ఇదేదో జగన్ వ్యతిరేకులు, ఆయన ప్రత్యర్థి పార్టీల నాయకులు చెబుతున్న మాట కాదు.. స్వయంగా నిన్న మొన్నటి వరకూ జగన్మాయలో ఉండి, ఆయన అడుగులకు మడుగులొత్తిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, పూతలపట్టు ఎమ్మెల్యే బాబు వంటి మారు చెబుతున్న మాట.
నిజమే.. 2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఓడిపోయింది. నిజానికి ఆ ఎన్నికల్లో తెలుగు దేశం ఎందుకు ఓడిపోయిందో, ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు. రాష్ట్ర విభజన అరిష్టాలను ఎదుర్కుంటూ నవ్యాంద్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేందుకు, తమ అనుభవం అంతా రంగరించి, ప్రణాళికా బద్దంగా ముందుకు సాగారు. రాజధాని అమరావతిని గ్రోత్ ఇంజిన్ నగరంగా అభివృద్ధి చేసేందుకు, చరిత్రలో కనీవినీఎరగని విధంగా భూసేకరణ చేశారు. నిర్మాణాలు మొదలయ్యాయి.. మరొక్క ఐదేళ్ళు చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగితే, రాజధాని నగరం అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడమే కాదు రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి అగ్రగామి రాష్ట్రంగా నిలిచేది. అయితే దురదృష్టవశాత్తు 2019 అసెంబ్లీ ఎన్నికలో తెలుగు దేశం పార్టీ ఒడి పోయింది. వైసీపీ అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అభ్యర్ధన సృష్టించిన సింపతీ వేవ్ వైసీపీని గెలిచింది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఆతర్వాత ఏమి జరిగింది అన్నది కళ్ళ ముందు కదులుతున్న నడుస్తున్న చరిత్ర.
రాష్ట్ర విభజన అనతరం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం సగటున 10.8 శాతం వృద్ధి రేటు సాధిస్తే, జగన్ రెడ్డి పాలనలో అది 3 శాతం దిగువకు పడిపోయింది. 2 019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం వలన రాష్ట్రం ఏమి కోల్పోయిందో ఈ గణాంకాలే చెబుతాయి. అంతే కాదు జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాలు అన్నీ ఇన్నీ కాదు. రాష్ట్రంలోని ఏ వర్గమూ జగన్ పాటన పట్ల సంతృప్తిగా లేదు. బటన్ నొక్కి జగన్ పంచుతున్న సొమ్ములు అందుకుంటున్న లబ్ధిదారులే.. అభివృద్ధి ఎక్కడ, మా పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలేవీ అంటూ నిలదీస్తున్నారు. అందుకే ఇప్పడు రాష్ట్ర ప్రజలు మళ్ళీ చంద్రన్న రావాలి ... వెలుగు తేవాలి అంటున్నారు. చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన యాత్రలకు జనం జననీరాజనాలు పట్టడం చూసే చాలు జనం జగన్ పాలనతో ఎంతగా విసిగిపోయారో, చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఎంతగా కోరుకుంటున్నారో అర్థమవుతుంది.
కాంగ్రెస్ పాలనలో విసిగిపోయిన ఆంధ్రా జనం ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు ఉప్పెనలా ఎలా కదిలారో.. ఇప్పుడు చంద్రబాబు సభలు, సమావేశాలకు అలా కదులుతున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సందర్భంలో జనంలో వ్యక్తమైన ఆగ్రహం, మధ్యంతర బెయిలుపై ఆయన బయటకు వచ్చిన సందర్బంలో ఆయనకు స్వాగతం పలికేందుకు చిన్నా పెద్దా, ఆడా,మగా అన్న తేడా లేకుండా పెద్ద సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చి నీరాజనాలు పలకడం చూస్తేంటే బాబు విజయాన్ని, నాయకత్వాన్ని ఎంతగా కోరుకుంటున్నారో అర్ధమౌతుంది. ఏపీ చేసుకున్న అదృష్టం చంద్రబాబు అయితే దురదృష్టం జగన్ అని అంటున్నారు.
నిజానికి 2019 ఓటమి తర్వాత తెలుగు దేశం అస్తిత్వం విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. తెలుగుదేశం పుంజుకోవడం అంత ఈజీ కాదని విశ్లేషణలు వినిపించిన వారూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వయసు రీత్యా అంత చురుకైన పాత్రను పోషించలేక పోవచ్చని, అలాగే, పార్టీని ముందుకు నడిపించడంలో లోకేష్ అనుభవం సరిపోదని చాలా మంది చాలా రకాల సందేహాలను వ్యక్త పరిచారు. అయితే ఇప్పుడు ఆ చాలామందే, అటు చంద్రబాబు, ఇటు లోకేష్ విషయంలో తమ అంచానాలు తప్పాయని అంగీకరిస్తున్నారు. యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ ప్రజా నాయకుడిగా ఎదిగారు.
మరోవంక జగన్ రెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నారు. 2019 ఎన్నికలలో అన్ని విధాల అండగా ఉన్న తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను జగన్ రెడ్డికి దూరమయ్యారు. నాడు షర్మిల తనను తాను జగనన్న వదిలిన బాణంగా చెప్పుకున్నారు. ఇప్పుడు అదే షర్మిల తాను జగనన్నకు గురిపెట్టిన బాణాన్ని అంటున్నారు. తల్లి విజయమ్మ తాను కుమార్తెతోనే అంటున్నారు. ఇక పార్టీలో కూడా ఆయన నమ్మే వారు ఒకరిద్దరు మినహా మరెవరు లేరు. చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దూరమవుతున్నారు. నియోజకవర్గ ఇన్ చార్జిల మార్పు పేరుతో ఆయన సిట్టింగులను మార్చేందుకు చేస్తున్న ప్రయత్నం బెడిసికొట్టింది. నేతల ధిక్కార స్వరం, రాజీనామాల బాట మొదలైంది. అందుకే, 2024 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ జగన్ ఓటమి తధ్యమని అంటున్నారు. అందుకే తెలుగుదేశం విజయం ఖాయమని చెబుతున్నారు.