జగన్ పై రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేల రివోల్డ్ !
posted on Jan 9, 2024 @ 4:37PM
ఏపీలో అధికార పార్టీ వైసీపీ పరిస్థితి ఇప్పుడు క్లైమాక్స్ కి చేరినట్టు కనిపిస్తున్నది. ఆ పార్టీ కథ ఇక కంచికి చేరిపోవడమే తరువాయి అని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు. ఒకవైపు ప్రజలలో జగన్ పార్టీపై అసంతృప్తి పెరిగిపోతుంటే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలలో అంతకు మించి అసమ్మతి, ఆగ్రహం కనిపిస్తున్నది. కనీసం మాటా మంతీ లేకుండా, తమ అభిప్రాయాలకు విలువే లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తన నియోజకవర్గాలను మార్చేయడంపై వైసీపీ ఎమ్మెల్యేలు అధిష్టానంపై మండిపడుతున్నారు.కొందరు ఎమ్మెల్యేలైతే ఇప్పటికే జగన్ లెక్కేమిటని నిలదీసి పార్టీని వీడుతుంటే మరి కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్దమవుతున్నారు. ఇంకొందరు తమ ధిక్కారాన్ని ప్రదర్శించడానికి సమయం కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే ఇప్పటి వరకూ సీఎం జగన్ సొంత సామజిక వర్గం ఎమ్మెల్యేలలో ఒకరిద్దరు తప్ప మిగతా వారు పెద్దగా జగన్ నిర్ణయాలను వ్యతిరేకించలేదు. అసలు జగన్ తన సొంత సామజిక వర్గ ఎమ్మెల్యేల సిట్టింగ్ స్థానాలను పెద్దగా మార్చలేదు. స్థానాలను మార్చిన, టికెట్ నిరాకరించిన మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి లాంటి వారు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పేసి వెళ్లిపోతే.. కాపు రామచంద్రారెడ్డి వంటి వారు నీకో దండం, నీ పార్టీకో దండం అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అయితే వైసీపీలో నిన్నటి వరకూ ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క అన్నట్లు పరిస్థితి మారిపోయింది. స్థానాల మార్పుపై ఇప్పుడు సొంత సామాజికవర్గ ఎమ్మెల్యేలు కూడా రివర్స్ అవుతున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో నరసారావు పేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఈసారి లావుకు నరసారావుపేట టికెట్ లేదని, గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని, లేదంటే ఈసారికి టికెట్ ఆశపడొద్దని పార్టీ అధినేత జగన్ తేల్చి చెప్పారని పార్టీలో చర్చ సాగుతోంది. వైసీపీ నేతల అంతర్గత సంభాషణలతో ఇది కాస్త ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చకు వచ్చింది. అయితే జగన్ చెప్పినా ఎంపీ కృష్ణదేవరాయలు మాత్రం తాను గుంటూరు నుంచి పోటీ చేసేది లేదని.. నరసరావుపేట నుండే రంగంలోకి దిగుతాననీ తేల్చి చెప్పేశారు. కాగా, నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా లావుకు మద్దతు తెలుపుతున్నారు. మరోసారి ఇక్కడ నుండి లావుకు అవకాశం ఇవ్వాలని ఇక్కడి ఎమ్మెల్యేలు సైతం వైసీపీ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో ఇక్కడ వైసీపీలో హీట్ పెరిగిపోతున్నది.
లావుకే మరోసారి నరసారావుపేట టికెట్ ఇవ్వాలంటూ ఇదే నియోజకవర్గానికి చెందిన నాయకులు తాజాగా రోడ్డెక్కారు. లోక్‌సభ వైసీపీ కన్వీనర్ ఏరువ విజయభాస్కరరెడ్డి నేతృత్వంలో ఓబుల్‌రెడ్డి, తిరుపతి రెడ్డి, బ్రహ్మారెడ్డి, నరసారెడ్డి, నాగుల రెడ్డి ప్లకార్డులు పట్టుకుని మరీ నిరసన వ్యక్తం చేశారు. తాజాగా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వీరు పనిగట్టుకొని మరీ వెళ్లి ఎంపీ లావుకు మద్దతు తెలిపారు. స్థానికంగా పార్లమెంట్ నియోజకవర్గాన్ని లావు ఎంతో డెవలప్ చేశారని, ఆయనకు టికెట్ ఇస్తే మరోసారి గెలుపు ఖాయమని వారు అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. లావుకు మద్దతు తెలుపుతున్న ఈ ఎమ్మెల్యేలంతా సీఎం సొంత సామజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలే కావడం విశేషం. టికెట్ తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న లావు కృష్ణదేవరాయలు కమ్మ సామజిక వర్గానికి చెందిన ఎంపీ కావడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొత్తంగా లావు రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు జగన్ పై తిరుగుబాటు ప్రకటించారు.
ఎంపీ లావు కృష్ణదేవరాయల విషయానికి వస్తే ఉమ్మడి జిల్లాలో ఆయనకు ప్రతిష్టాత్మమైన విద్యాసంస్థలు ఉన్నాయి. ఆయన తండ్రి లావు రత్తయ్య నెలకొల్పిన ఈ విద్యాసంస్థలలో చదివిన సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తండ్రి వ్యాపారాలతో పాటు రాజకీయంగా కూడా తన మార్క్ చూపించాలని ఆరాటపడుతున్న కృష్ణదేవరాయలు వైసీపీ ప్రభుత్వంతో పనిలేకుండా సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి అదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. కానీ, జగన్ మాత్రం సర్వేలనే నమ్ముకుని కృష్ణదేవరాయులును మార్చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు. అయితే లావు కుటుంబం కాకుండా ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇంకెవరిని పోటీకి దింపినా ఆ ప్రభావం ఆ లోక్ సభ స్థానం పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలపై కచ్చితంగా పడుతుంది.
అందుకే ఈ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలంతా ఇప్పుడు కృష్ణదేవరాయలకే నరసరావుపేట టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది రెడ్డి సామజిక వర్గ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరందరూ మూకుమ్మడిగా లావు నామస్మరణ జపం చేస్తూ జగన్ పైనే నిరసన గళం విప్పారు. దీంతో జగన్ దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. మరో వైపు లావు పార్టీ మారే యోచనలో ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. అదే జరిగితే లావుతో పాటు ఆయనకు మద్దతుగా నిలుస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమ దారి తాము చూసుకునే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.