అటు అంబటి రాయుడు.. ఇటు లావు కృష్ణదేవరాయులు.. జగన్ కు డబుల్ షాక్!
posted on Jan 10, 2024 @ 2:38PM
అటు అంబటి రాయుడు ఇటు కృష్ణదేవరాయులు.. జగన్ డబుల్ షాక్ ఇచ్చారు. ఇరువురూ కూడా జగన్ నిర్ణయంతో గట్టిగా విభేదించి రోడ్డెక్కారు. ఈ ఇరువురి ధిక్కారానికీ కారణం ఒక ఎంపీ సీటు. అవును గుంటూరు లోక్ సభ నియోజకవర్గ పార్టీ టికెట్ విషయంలో అటు అంబటి రాయుడినీ, ఇటు కృష్ణ దేవరాయులు జగన్ కు షాక్ ఇచ్చారు. విషయమేమిటంటే గత నెల 28న వైసీపీ కండువా కప్పుకున్న క్రికెటర్ అంబటి రాయుడు సరిగ్గా పది రోజుల వ్యవధిలో పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. ఆయన బయటకు రావడానికి కారణమేమిటంటే.. ఆయన పార్టీ కండువా కప్పుకోవడానికి కారణమైన గుంటూరు ఎంపీ టికెట్ ఆయనకు ఇచ్చే విషయంలో జగన్ మాట తప్పడమే.
ఔను అంబటి రాయుడు చాలా కాలం నుంచీ కూడా గుంటూరు నుంచి లోక్ సభకు పోటీ చేయాలని ఆశిస్తున్నారు. ఆ మేరకు జగన్ నుంచి స్పష్టమైన హామీ దక్కడంతో గత ఆరు నెలలుగా అక్కడే మకాం వేసి పార్టీలోనూ, నియోజకవర్గంతోనూ పరిచయం పెంచుకున్నారు. అన్ని బాగున్నాయి అనుకుని గత నెల 28న జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుని వైసీపీలో చేరారు. అయితే ఇలా చేరారో లేదో అలా గుంటూరు టికెట్ విషయంలో జగన్ పునరాలోచనలో పడ్డారని తెలిసి క్షణం ఆలోచించకుండా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అదలా ఉంచితే నరసరావు పేట ఎంపీ లావు కృష్ణదేవరాయును ఆయన స్థానం నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీలోకి దింపాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని లావుకు తెలియజేశారు. అయితే అందుకు లావు కృష్ణదేవరాయులు ససేమిరా అన్నారు. తాను నియోజకవర్గం మారే ప్రశ్నే లేదనీ, అవసరమైతే పోటీకి దూరంగా ఉంటానని కృష్ణ దేవరాయులు జగన్ కు ముఖంమీదే కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.
సో గుంటూరు లోక్ సభ నియోజకవర్గం విషయంలో ఒకే సారి జగన్ కారణంగా అంబటి రాంబాబు, లావు కృష్ణ దేవరాయలు జగన్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. అంబటి రాయుడు వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించేసి బయటకు వచ్చేస్తే.. లావు తన సన్నిహితులు, సహచరులతో చర్చిస్తున్నారు. ఇక అంబటి రాయుడు నేడో రేపో జనసేన గూటికి చేరనున్నారని అంటున్నారు. ఇక లావు కృష్ణ దేవరాయులు కూడా తెలుగుదేశం పార్టీలోకి టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు.