కొడాలి నానీ.. అది నోరేనా?!
posted on Jan 9, 2024 @ 1:43PM
నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు పెద్దలు. అంటే మనం ఎంత మర్యాదగా మాట్లాడితే ఊరి ప్రజలు మనకు అంత అండగా ఉంటారు. అదే నోటికి ఏది వస్తే మాట్లాడితే.. అదే ఊరి జనం తరిమి తరిమి కొడతారు. ఈ విషయం వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానీకి ఎప్పటికి అర్ధమవుతుందో ఏమో. కొడాలి నానీ అంటే బూతులు మాట్లాడే మంత్రి అని ఎప్పుడో పేరు సంపాదించుకున్నారు. ఎదుటివాళ్ళు ఎంతటి వారైనా.. వయసు అనుభవ పరంగా ఎంత గొప్పవారైనా నానీకి అవేమీ పట్టదు. తనకు తెలుగుభాషలో తెలిసింది కేవలం బూతులే అన్నట్లు ఆయన నోటి వెంట బూతులు, అసభ్య పదజాలం మాత్రమే వస్తుంది. కనీసం తానో ప్రజా ప్రతినిధిననీ.. తనను ప్రజలు గమనిస్తారనే స్ఫృహ కూడా నానీకి లేదు. ఉండదు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరు ఏమన్నా, జగన్ పాలనను ఎవరు తప్పుబట్టినా తన నోటివెంట వచ్చేది బూతుల పంచాగం మాత్రమే. ఇది దాదాపుగా తెలుగు ప్రజలంరికీ తెలిసిందే. అసలు కనీసం మంచీ మర్యాదా లేని, తెలియని నేత ఎవరైనా ఉన్నారంటే అది కేవలం తానుమాత్రమేనని నాని తాజాగా మరోసారి నిరూపించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పకపోవడంపై మీడియా ప్రతినిధులు కొడాలి నానీ స్పందనను కోరారు. అయితే ఏదో తమ ముఖ్యమంత్రి ప్రజాపాలన, సమస్యల బిజీ వలన కుదరలేదనో.. ప్రభుత్వ కార్యక్రమాల వలన వీలుపడలేదనో సమాధానం చెప్తే సమంజసంగా ఉండేది. కానీ, అలా చెప్తే కొడాలి నానీ కుసంస్కారం ఎలా తెలుస్తుంది. అందుకే ఆయన మరోసారి తనకే సాధ్యమైన బూతుల పంచాంగం విప్పారు? అసలు రేవంత్ రెడ్డికి జగన్ ఎందుకు శుభాకాంక్షలు చెప్పాలన్న నానీ.. మాకేం పని లేదా? అంటూ తన అహంకారాన్ని బయటపెట్టారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు జగన్ హైదరాబాద్ వెళ్లారు కదా? మరి పనిలేక వెళ్ళారా అనే స్థాయిలో మీడియా ప్రతినిధులు కౌంటర్ వేశారు. దీంతో నానీ మరోసారి దురుసుగా.. రేవంత్ కు ఏమైనా తుంటి విరిగిందా పరామర్శించేందుకు అంటూ ఉచితానుచితాలు మరిచి హుంకరించారు.
నిజానికి మీడియా ప్రతినిధులు నానీని ఈ ప్రశ్న అడగడం సమంజసమే. సాటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి ఎంపికైనపుడు శుభాకాంక్షలు చెప్పడం సంస్కారం. ఇది జగన్ మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగానే కాదు.. రెండు రాష్ట్రాల మధ్య సామరస్య, సుహృద్భావ వాతావరణం ఏర్పడేందుకు కూడా దోహదపడుతుంది. జగన్ ఏమీ పనిగట్టుకొని హైదరాబాద్ వెళ్లి శుభాకాంక్షలు చెప్పాల్సిన పనిలేదు.. ఫోన్ ద్వారా లేదా సోషల్ మీడియా ఖాతాల ద్వారా అయినా ఆ పని చేయొచ్చు. కానీ జగన్ ఆ మర్యాద పాటించలేదు. పైగా ప్రత్యేక విమానంలో ప్రభుత్వ సొమ్ములతో జగన్ హైదరాబాద్ వెళ్లి మరీ ఆ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించి వచ్చారు. కేసీఆర్ ను పరామర్శించడంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు. కానీ, కనీస మర్యాదైన కొత్త సీఎంకు శుభాకాంక్షలు చెప్పకపోవడాన్నే పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. అసలు జగన్ తీరే సమంజసంగా లేదని విమర్శలు వెల్లువెత్తుతుంటే.. ఇప్పుడు కొడాలి నానీ వ్యాఖ్యలు అంతకు మించి డ్యామేజ్ చేసేవిగా ఉన్నాయి. నానీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ ఫాలోవర్లు అసలు నానీది నోరేనా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
చీమ చిటుక్కుమన్నా.. చిన్న జ్వరం వచ్చినా వైసీపీ ఎమ్మెల్యేలందరూ వైద్యం కోసం వెళ్లేది హైదరాబాద్ కే. ఆలాగే తెలంగాణతో వైసీపీ ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. అలాంటి రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేతకు శుభాకాంక్షలు చెప్పటంలో ఉండే ఇబ్బందేమిటో కొడాలికే తెలియాలి. తన గురించి తాను ఎన్ని చెప్పుకున్నా.. ఎలా మాట్లాడినా అది తనకే ఇబ్బంది. కానీ, తమ పార్టీ అధినేతకు సంబంధించి, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపే అంశాలపై కూడా నానీ నోటి కొచ్చినట్లు అసభ్యంగా, అనుచితంగా మాట్లాడటం దారుణం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసే సమయంలో కాస్త ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసేలా మాట్లాడటం సరికాదనీ, సంయమనం అవసరమన్న చిన్న విషయాన్ని నానీ మర్చిపోవడం ఆయన దౌర్భాగ్యం కాగా.. అసలు అలంటి నేతను ఎన్నుకొని నాయకుడిని చేయడం ఏపీ ప్రజల దౌర్భాగంగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.