ఆ మూడు కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిలు
posted on Jan 10, 2024 @ 2:00PM
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిపై జగన్ సర్కార్ బనాయించిన ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, మద్యం కేసులలో ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ విషయంలో చంద్రబాబు తన కుటుంబానికి మేలు జరిగేలా వ్యవహరించారనీ, అలాగే చంద్రబాబు హయంలో తీసుకువచ్చిన మద్యం, ఇసుక విధానాలలో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై ఈ కేసులలో తనను అరెస్టు చేయకుండా యాంటిసిపేటరీ బెయిలు కోరుతూ చంద్రబాబు ఏపీ హై కోర్టును ఆశ్రయించారు. ఈ మూడు కేసులపై హైకోర్టులో గతంలోనే వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రిజర్వ్ అయ్యింది. ఈ తీర్పులను హైకోర్టు ఈ రోజు వెలువరించింది. మూడు కేసులలోనూ చంద్రబాబుకు భారీ ఊరట కలిగిస్తూ యాంటిసిపేటరీ బెయిలు మంజూరు చేసింది. అలాగే మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రైటైర్డ్ ఐఏఎస్ నరేష్ కు కూడా యాంటిసిపేటరీ బెయిలు లభించింది. ఇలా ఉండగా హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఇలా ఉండగా స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై సుప్రీంలో వాదనలు ముగిసి తీర్పు రిజర్వ్ అయిన సంగతి తెలిసిందే. ఆ కేసులో కూడా చంద్రబాబు క్వాష్ కు అనుమతి లభిస్తే.. ఇప్పడు ఆయనకు యాంటిసిపేటరీ బెయిుల లభించిన మూడు కేసులూ కూడా దూది పింజల్లా ఉఫ్ మని ఎగిరిపోతాయి.