సీటు మారమంటే.. పోటీకి దూరమంటున్నారు!
posted on Jan 10, 2024 8:21AM
వైసీపీలో అసమ్మతిని అణచి ఉంచాలని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఎంతగా ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. గోడకు బంతిని ఎంత బలంగా కొడితే అంత బలంగా వెనక్కి వచ్చినట్లు, జగన్ అసమ్మతి గళాలను అణిచేయాలని ప్రయత్నిస్తున్న కొద్దీ అవి మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. మొత్తంగా పార్టీపై జగన్ పూర్తిగా అదుపు కోల్పోయాడనే అనిపించే పరిస్థితులు వైసీపీలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
అసలు పార్టీలో జగన్ ఆధిపత్యం మేడిపండు చందమేనని రెండేళ్ల నాడు ఆయన తన కేబినెట్ ను విస్తరించిన సందర్భంలోనే తేటతెల్లమైంది. అయితే అధికారం మరో రెండేళ్లు ఉన్నందున, అప్పుడు నిరసనలు, అసమ్మతి జ్వాలలూ ఎగసిపడినా తరువాత సర్దుకున్నాయి. చల్లారాయి. కానీ గాలిని గుప్పిట ఎలా బంధించలేమో, పార్టీ నేతల్లో జగన్ పట్ల విశ్వాసం కోల్పోయిన తరువాత బెల్లించో, బెదిరించో వారి నోళ్లు మూయించడం అంత లేలిక కాదు.
వైసీపీలో తిరుగుబాట పడుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటమే ఇందుకు నిదర్శనం. వాస్తవానికి వైసీసీలో తిరుగుబాటు సంకేతాలు జగన్ రెండేళ్ల కిందట మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించిన సమయంలోనే కనిపించాయి. అప్పటి నుంచే పార్టీ అధినేతగా జగన్ కు తన మాటే శాసనం అన్న పరిస్థితి లేదని లీడర్ నుంచి క్యాడర్ వరకూ అందరికీ అర్ధమైపోయింది.
ఆ తరువాత గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జగన్ ఆదేశాల మేరకు పాటించిన ఎమ్మెల్యేలు, మంత్రులను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. జగన్ ఆదేశాలను పాటించేందుకు పార్టీలో మెజారిటీ నేతలు ముందుకు రాలేదన్న విషయం ఆ కార్యక్రమం ఆరంభంలోనే తెలిసిపోయింది. ఈ విషయాన్ని వేరే ఎవరో కాదు.. స్వయంగా జగనే పలు సందర్భాలలో జరిపిన సమీక్షల్లో చెప్పారు. కేవలం పదిపదిహేను మంది ఎమ్మెల్యేలు వినా మిగిలిన వారెవరూ గడప గడపకూను సీరియస్ గా తీసుకోవడం లేదని జగన్ అప్పట్లో ఫైరయ్యారు. గడపగడపకు కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే మళ్లీ పోటీకి టికెట్లు ఇచ్చేది లేదని హెచ్చరికలు కూడా చేశారు. అయితే వాటిని మెజారిటీ ఎమ్మెల్యేలు ఖాతరు చేయలేదు. ఆ తరువాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ అంటూ ఓ నలుగురు ఎమ్మెల్యేలపై జగన్ సస్పెన్షన్ వేటు వేస్తే, ఆ నలుగురూ కూడా అందుకే వెయిట్ చేస్తున్నామన్నట్లు స్పందించి జగన్ పై, ఆయన ప్రభుత్వంపై, పాలనపై విమర్శలు గుప్పిస్తూ జనంలోకి వచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా సిట్టింగుల నియోజకవర్గాల మార్పు అంటూ జగన్ చేస్తున్న ప్రయోగం వికటించి ఏకంగా తిరుగుబాటు స్థాయికి చేరింది.
ఇప్పుడు జగన్ రెండు మెట్లు దిగి బెదరింపులు, హెచ్చరికలను పక్కన పెట్టి బతిమలాడుకునే పరిస్థితికి వచ్చారు. బతిమలాడినా అసమ్మతీయులు వినే పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు ఉంటున్నారు. సర్వేలు, ప్రజాగ్రహం అన్నీ ఓటమిని కళ్ల ముందు ఆవిష్కరిస్తుంటే.. జగన్ పార్టీలో నేతలకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. అందుకే ఈ సారి పోటీకి దూరంగా ఉండటం బెటరన్న భావనే మెజారిటీ సిట్టింగులలో కనిపిస్తోందంటున్నారు. అందుకే జగన్ నియోజకవర్గ మార్పు అనగానే.. వద్దు వద్దు ఈ సారి పోటీకి దూరంగా ఉంటామని చెబుతున్న సిట్టింగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందంటున్నారు. అదీ కాక సిట్టింగ్ స్థానాన్ని మార్చడమంటే ఇక్కడ మీ ఓటమి ఖాయమైందని చెప్పడమేనని, సొంత నియోజకవర్గంలోనే ఎదురీదే పరిస్థితి ఉంటే మరో నియోజకవర్గానికి వెడితే మునకే అని అంతర్గత సంభాషణల్లో సీటు మారిన ఎమ్మెల్యేలు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజులలో జగన్ మాటను ధిక్కరించే వైసీపీ నేతల సంఖ్య ఇంకా పెరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.